Police Commissioner VC Sajjanar: ఐపీఎల్‌ క్రికెట్‌ ఫీవర్‌ను తనకు అనుకూలంగా మలచుకొని కొందరు మోసగాళ్లు ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ ఊబిలోకి సామాన్యులను లాక్కుతున్నారని హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

“టాస్‌ ఎవరిది? మ్యాచ్‌ ఏ టీమ్‌ గెలుస్తుంది?” అని ముందుగానే ప్రకటించేస్తామంటూ ఇన్‌ఫ్లూయెన్సర్లు సోషల్‌ మీడియా చానెళ్లలో అసత్య ప్రచారాలు చేసి అమాయకుల్ని తమకు సబ్‌స్క్రైబ్‌ చేయించుకుని, బెట్టింగ్‌లోకి లాగుతున్నారని ఆయన తెలిపారు. కేవలం డబ్బు కోసం ఇలాంటి నకిలీ ప్రిడిక్షన్‌ ప్రకటనలతో సామాన్యులను తప్పుదోవ పట్టిస్తున్నారని, కష్టపడి సంపాదించిన డబ్బును పోగొట్టుకోవద్దని సజ్జనార్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

హైదరాబాద్‌ సైబర్‌ క్రైం విభాగం ఈ మోసపూరిత ప్రమోషన్లపై కఠినంగా వ్యవహరిస్తోందని సజ్జనార్‌ వెల్లడించారు. గత నెల రోజుల వ్యవధిలోనే 494 పెయిడ్‌ ప్రకటనలు, వాటిని ప్రచారం చేస్తున్న 129 సోషల్‌ మీడియా ప్రొఫైల్స్‌ను బ్లాక్‌ చేయించినట్లు తెలిపారు. ఈ నిఘా నిరంతరం కొనసాగుతుందని, బాధ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇలాంటి మోసపూరిత యాడ్స్‌ దృష్టికి వచ్చినా లేదా మీరు మోసపోయినా వెంటనే 1930 నంబర్‌కు కాల్‌ చేయాలని, లేదా http://cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని సజ్జనార్‌ సూచించారు.

Next Story