Graduate MLC Elections: తెలంగాణలో రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను చాలా సీరియస్‌గా తీసుకోవాలని, గెలుపే లక్ష్యంగా అందరూ కష్టపడి పనిచేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.

మంగళవారం ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో జిల్లాల వారీగా జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులతో సీఎం మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. దసరా పండగలోపే ఇన్‌ఛార్జి మంత్రి ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాల వారీగా పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహించి ఎన్నికల వ్యూహంపై చర్చించాలని సీఎం సూచించారు.

“పట్టభద్రుల ఓట్ల నమోదు చాలా కీలకమైన విషయం. అందరూ ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలి. మంత్రులు, ఎమ్మెల్యేలు కింది స్థాయి నేతలతో సమన్వయం చేసుకుంటూ ఓటర్ల నమోదుతో పాటు ప్రచారంపైనా దృష్టి పెట్టండి” అని సీఎం ఉద్బోధించారు.

ఉమ్మడి మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌, ఉమ్మడి నల్గొండ-ఖమ్మం-వరంగల్‌ ఎమ్మెల్సీ స్థానాల పరిధిలో 77 అసెంబ్లీ స్థానాలు ఉన్నందున ప్రతి ఎమ్మెల్యేతో వ్యక్తిగతంగా ఇన్‌ఛార్జి మంత్రి మాట్లాడి ఎన్నికల ప్రచారం ఖరారు చేసుకోవాలని ఆదేశించారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే లేని నియోజకవర్గాల్లో పార్టీ సమన్వయకర్త, ఇన్‌ఛార్జిలది కీలక బాధ్యతగా ఉంటుందని, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పర్యవేక్షించాలని చెప్పారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభలు ఏర్పాటు చేయాలని, ఓటర్ల నమోదు కోసం వెళ్లినప్పుడే పార్టీ శ్రేణులు కాంగ్రెస్‌ మద్దతిస్తున్న అభ్యర్థిని గెలిపించాలని పట్టభద్రులకు విజ్ఞప్తి చేయాలని సూచించారు.

ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఓటర్లకు వివరించాలని, గ్రామ, మండల స్థాయి వరకు పార్టీ ప్రచారం ముమ్మరంగా చేయాలని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ తెలిపారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీని చేపట్టిన అంశాన్ని అందరికీ వివరించాలని నేతలకు సూచించారు. ఈ ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన వారికి నామినేటెడ్‌ సహా పార్టీ పదవుల్లో ప్రాధాన్యం ఇస్తామని చెప్పినట్లు తెలుస్తోంది.

ఈ నెల 12న ఢిల్లీలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో రాష్ట్రం తరఫున నేతల హాజరు తీరుపైనా చర్చ జరిగింది. నిరసన కార్యక్రమంతో దేశవ్యాప్తంగా ఓటర్ల తొలగింపుపై ప్రజల్లో చర్చ జరుగుతోందని నేతలు తెలిపినట్లు సమాచారం. సీఎంను కలిసిన వారిలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, విప్‌ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, బత్తుల లక్ష్మారెడ్డి, బీర్ల అయిలయ్య, సామేల్, బాలూ నాయక్, కైలాష్‌ నేత తదితరులు ఉన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి రాహుల్‌ గాంధీని కలిసి సర్‌ జాబితాలో జరిగిన అక్రమాలు, రాష్ట్రంలో చేపడుతున్న నిరసన కార్యక్రమాలపై చర్చించారు. పలువురు ఇండియా కూటమి నేతలతోనూ మాట్లాడారు.

Next Story