CM Revanth Reddy’s Suggestion: కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరలు పెంచడం తప్ప పంటల కొనుగోలులో నిర్లక్ష్యం వహిస్తోందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి విమర్శించారు. కనీసం 30 శాతం కూడా సేకరించడం లేదని ఆరోపించారు. అయితే తెలంగాణలో రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

రాష్ట్ర సచివాలయంలో సీపీఎం, సీపీఐ నాయకులు వేర్వేరుగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో సమావేశమయ్యారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు నేతృత్వంలో ఆయా పార్టీల నాయకులు ఈ భేటీలో పాల్గొన్నారు.

సమావేశంలో సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కార్మికుల కనీస వేతనాల పెంపు నిర్ణయానికి సీఎంకు నేతలు ధన్యవాదాలు తెలిపారు. ధాన్యం కొనుగోలు, మూసీ నది ప్రక్షాళన, విద్యా రంగం సహా వివిధ అంశాలపై వారి మధ్య విస్తృత చర్చ జరిగింది.

ధాన్యం కొనుగోళ్లపై నిరంతర సమీక్ష

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల కారణంగా కూలీలు తమ స్వస్థలాలకు వెళ్లడం, తీవ్రమైన వడగాల్పుల వల్ల మధ్యాహ్నం పనులు నిర్వహించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించారు. ధాన్యం కొనుగోళ్లపై నిరంతరం సమీక్ష చేస్తున్నట్లు తెలిపారు. సన్నవడ్లకు రూ.500 బోనస్‌ ఇచ్చి, మొక్కజొన్నను మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నామని పేక్కొన్నారు.

మూసీ నిర్వాసితులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, స్థానికంగానే వారికి నివాసాలు కేటాయిస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఈ విషయంలో రాజకీయం చేయవద్దని పార్టీలను కోరారు. మూసీని పునరుజ్జీవనం చేసి అద్భుతమైన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని వెల్లడించారు.

ప్రభుత్వ విద్యను ప్రక్షాళన చేస్తాం

ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని సీఎం తెలిపారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నామని, రంగారెడ్డి జిల్లా ఆరుట్లలోని పాఠశాలను సీపీఎం నేతలు ఒకసారి సందర్శించాలని ఆహ్వానం పలికారు. విద్యార్థులకు నాణ్యమైన బ్రేక్‌ఫాస్ట్, భోజనం అందించడం ద్వారా నాణ్యమైన విద్యను అందించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు వివరించారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story