Konda Murali: కూతురు వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు.. కాంగ్రెస్‌లోనే ఉంటాం: కొండా మురళి
కొండా మురళి

Konda Murali: మంత్రి కొండా సురేఖ భర్త, కాంగ్రెస్ నేత కొండా మురళి మీడియాతో మాట్లాడుతూ తాము పార్టీని వీడేది లేదని స్పష్టం చేశారు. ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డితో తాను సమావేశమయ్యానని, అయితే కొండా సురేఖ అంశం లేదా తాజా రాజకీయ పరిణామాలపై ఎలాంటి చర్చ జరగలేదని తెలిపారు.
‘‘సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంకపై సంపూర్ణ విశ్వాసం ఉంది. మా కుమార్తె సుస్మిత వ్యాఖ్యలతో మాకు ఏమాత్రం సంబంధం లేదు. నా బిడ్డ ప్లాన్-ఎ ప్రకారం వ్యాఖ్యలు చేసింది. ప్లాన్-బి ఏమిటో నాకు తెలియదు. సుస్మితకు స్వతంత్రంగా తన అభిప్రాయాలు వ్యక్తం చేసే హక్కు ఉంది. ఆమె వ్యాఖ్యలు పూర్తిగా వ్యక్తిగతమైనవి. ఆమెను ప్రశ్నించే హక్కు మాకు లేదు. మా బిడ్డ చేసిన వ్యాఖ్యలతో మాకేం సంబంధం?’’ అని కొండా మురళి అన్నారు.
మంత్రి సురేఖ మంగళవారం వనమహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారని, నేడు కూడా మరో కార్యక్రమానికి హాజరయ్యారని ఆయన చెప్పారు. క్రమశిక్షణ కమిటీ నిర్ణయం వెలువడే వరకు ఏమీ మాట్లాడనని, కమిటీకి చెప్పాల్సిన విషయాలన్నీ ఇప్పటికే వివరించామని స్పష్టం చేశారు. తాను కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని ధృవీకరించారు.
గతంలో వరంగల్ జిల్లా పరకాలలో కొండా సురేఖ జన్మదిన వేడుకల్లో సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్‌లో తీవ్ర చర్చకు దారితీశాయి. సీఎం రేవంత్‌రెడ్డి హామీలు నెరవేర్చడంలో విఫలమయ్యారని విమర్శిస్తూ, రేవూరి ప్రకాశ్‌రెడ్డికి పరకాల టికెట్ ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించి, తనకు టికెట్ ఇవ్వకపోతే స్వతంత్రంగా పోటీ చేస్తానని సుస్మిత ప్రకటించారు. దీనిపై తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసి చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలిపింది. సుస్మిత వ్యాఖ్యలపై ఆమె తల్లి కొండా సురేఖను వివరణ కోరాలని పీసీసీ నిర్ణయించింది. అయితే సుస్మిత వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమని కొండా సురేఖ ఇప్పటికే స్పష్టం చేశారు.

