జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వి కర్ణన్ అభ్యర్ధన

  • ఉత్సవాల నిర్వహణకు నిధుల కొరత లేదు.
  • గతం కంటే ఘనంగా గణేష్ ఉత్సవాలను నిర్వహిస్తాం

రానున్న గణేష్ ఉత్సవాలు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, శాంతియుత వాతావరణంలో జరిగేలా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి, సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులు సహకారం అందించాలనీ జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వి కర్ణన్ కోరారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఈ నెల 27 వ తేదీన ప్రారంభమై సెప్టెంబర్ 6 వ తేదీన పూర్తి కానున్న గణేష్ ఉత్సవాల ఏర్పాట్లపై భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి, సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో కమిషనర్ అధ్యక్షతన సన్నాహక సమన్వయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ ఆర్ వి కర్ణన్ మాట్లాడుతూ గత సంవత్సరం మాదిరి గానే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఘనంగా గణేష్ ఉత్సవాలు జరిగేలా జీహెచ్ఎంసీ, పోలీస్, సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది సహకారం అందించాలని కర్ణన్‌ కోరారు. ఇప్పటికే నగర పరిధిలో అధిక వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేపడుతున్నట్లు చెప్పారు. గణేష్ ప్రతిమల ఊరేగింపు జరిగే జాతీయ రహదారుల్లో ఏమైనా రోడ్లు రిపేర్ ఉంటే వాటిని కూడా చేపడతామని తెలిపారు. పోలీస్ శాఖ సూచన మేరకు నిమజ్జనం సజావుగా, వేగంగా పూర్తి చేసేందుకు గత సంవత్సరం కంటే ఎక్కువ క్రేన్ లు కూడా ఉపయోగిస్తామని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ వెల్లడించారు.

గణేష్ ఉత్సవాల కు బడ్జెట్ ప్రాబ్లం లేదని, వివిధ పనుల నిమిత్తం గతం కంటే కూడా అధిక నిధులు కేటాయిస్తామని, లాజిస్టిక్స్ సమకూర్చుతామనీ కమిషనర్ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులకు తెలిపారు. వేడుక సజావుగా జరిగేందుకు జోనల్ పరిధిలో సమన్వయ సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు. గత లోటుపాట్లను సమీక్షించుకుంటూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా గణేష్ ఉత్సవాలను జరిగేలా చూస్తామని కమిషనర్ హామీ ఇచ్చారు. లా అండ్ ఆర్డర్ అదనపు సిపి విక్రమ్ సింగ్ మాన్ గణేష్ ఉత్సవాలు సజావుగా జరిగేందుకు పలు సూచనలు చేశారు. ప్రతి సంవత్సరం భాగ్యనగర్, ఇతర గణేష్ ఉత్సవ సమితి లు, ప్రభుత్వ శాఖల సమన్వయంతో పండుగ సజావుగా జరుపుకుంటున్నామని అని తెలిపారు. వర్షాలు అధికంగా కురిసే అవకాశం ఉన్నందున గణేష్ పండాల్‌లు, మండపాల నిర్మాణానికి క్వాలిటీ మెటీరియల్, క్వాలిటీ వైరింగ్ తో సహా నాణ్యమైన లాజిస్టిక్ ఉపయోగించాలని ఆయన సూచించారు. ఊరేగింపు సమయంలో ప్రతిమల భారీ ఎత్తు వల్ల ఇబ్బందులు తలెత్తకుండా, ట్రాఫిక్ జామ్ కాకుండా ఉండేందుకు ముందే రూట్ మ్యాప్, వాహనం హైట్ ఆధారంగా ప్రతిమలను ప్రతిష్టించాలని కోరారు. ప్రతి మండపం వద్ద కనీసం ఒక్క సీసీ కెమెరా ఏర్పాటు చేసుకునేలా చూడాలని చెప్పారు. పెద్ద మండపాల్లో ముగ్గురికి తగ్గకుండా వాలంటీర్ సేవలను ఉపయోగించుకోవాలని చెప్పారు. పెద్ద మండపాలలో సందర్శనం కోసం వచ్చే మార్గాలను వేరు వేరు గా ఏర్పాటు చేయాలన్నారు. ఖైరతాబాద్, బాలాపూర్ సహా నగరంలోని అన్ని గణేష్ విగ్రహాల ఊరేగింపు సకాలంలో ప్రారంభం అయ్యేలా సహకరిస్తే నిమజ్జనం సజావుగా సాగుతుందని లా అండ్ ఆర్డర్ అదనపు సిపి వివరించారు.

అంతకుముందు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు గణేష్ ఉత్సవాలు సజావుగా జరిగేందుకు అధికారులకు పలు సూచనలు చేశారు. సమావేశంలో ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్, అడిషనల్ కమిషనర్ లు రఘు ప్రసాద్, సుభద్ర, హెచ్‌ఎమ్‌డీఏ జాయింట్ కమిషనర్ కోట శ్రీవాత్సవ, సీఈ రత్నాకర్, ఎలక్ట్రికల్ సీఈ ప్రభాకర్, జోనల్ కమిషనర్ లు అనురాగ్ జయంతి, రవి కిరణ్, వెంకన్న, హేమంత్ సహదేవరావు, అపూర్వ చౌహాన్, హెచ్‌ఎండీఏ, హెచ్‌ఎమ్‌ఆర్‌ఎల్‌, టీఎల్‌ఆర్‌టీసీ, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పోలీస్ అధికారులు, హెచ్‌ఎమ్‌ఎస్‌&ఎస్‌బి, అగ్నిమాపక, నీటిపారుదల, పర్యాటకం, ఆరోగ్యం, కాలుష్య నియంత్రణ బోర్డు, ట్రాన్స్‌కో విభాగాలకు చెందిన పలువురు అధికారులు ఈ సమన్వయ సమావేశంలో పాల్గొన్నారు .

Politent News Web 1

Politent News Web 1

Next Story