CM Revanth reddy : తెలంగాణ హక్కులను ఎవరికీ తాకట్టు పెట్టం
తెలంగాణ నీటి పారుదల ప్రాజెక్టులపై సీయం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్

తెలంగాణ హక్కుల విషయానికి వస్తే దేవుడు ఎదురొచ్చినా నిటారుగా నిలబడి పోరాడుతామని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తెగేసి చెప్పారు. నీటిపారుదల ప్రాజెక్టులపై ప్రజా భవన్ లో జరిగిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కార్యక్రమంలో సీయం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీళ్ళు, నిధులకు సంబంధించి కేసీఆర్ కుటుంబం చేసిన తప్పిదాలను ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రజల మందు పెట్టామని చెప్పారు. ఏడాదిలో రాష్ట్రం సర్వనాసనం అయినపోనట్లు, మళ్ళీ వాళ్ళు వస్తేనే బాగుపడుతుందన్నట్లు ఒక వితండవాదం చేస్తున్నారని సీయం మండి పడ్డారు. శాశ్వతంగా కృష్ణా పరివాహక ప్రాంత రైతులకు మరణ శాసనం రాసే అధికారం కేసీఆర్ కు ఎవరూ ఇవ్వలేదన్నారు. ఆ నాడు హైదరాబాద్ నగరానికి తాగనీరు అందించిన తరువాతే మిగిలిన జలాలపై చర్చిస్తామని ఖరాఖండీగా మాట్లాడి ఉంటే పరిస్ధితి వేరుగా ఉండేదన్నారు. జూరాల నుంచి పాలమూరు, రంగారెడ్డికి నీటిని తరలించుకుంటే ఏపీకి అవకాశం ఉండేది కాదని, తెలంగాణలోకి ప్రవేశించిన కృష్ణా నీటిని వెంటనే ఒడిసి పట్టుకుని ఉంటే రాయలసీమకు నీరు తరలించుకు వెళ్ళే అవకాశం నేడు ఏపీకి ఉండేది కాదన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం వ్యయం అంచనాలు పెంచారు… తరలించాల్సిన నీటి సామర్ధ్యాన్ని తగ్గించారని సీయం గత ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్ళలో ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయకపోవడంతో రావల్సిన హక్కులు రాకపోగా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. కృష్ణా జలాల విషయలో ఉమ్మడి పాలకులు చేసిన అన్యాయం కంటే వెయ్యి రెట్టు కేసీఆర్ తెలంగాణకు ద్రోహం చేశారని సీయం రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
సాగునీటి ప్రాజెక్టులపై చట్టసభల్లో చర్చిద్దామని సూచన చేశా, క్లబ్బుల్లో పబ్బుల్లో కాకుండా చట్టసభల్లో చర్చ చేసుకుందామని కోరా… కానీ సడన్ గా ఆయనగారు వచ్చి ఏదేదో మాట్లాడారని రేవంత్ రెడ్డి అన్నారు. వాళ్ళు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి రోడ్డెక్కి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హయాంలో 54 లక్షల ఎకరాలకు నీళ్ళిస్తే అప్పుడు ఒక ఎకరాకు చేసిన ఖర్చు రూ. 93 వేలని, అదే కేసీఆర్ 15 లక్షల ఎకరాలకు నీళ్ళిస్తే ఒక ఎకరాకు పెట్టిన ఖర్చు రూ.11 లక్షలని సీయం రేవంత్ రెడ్డి వివరించారు. ఇప్పటికైనా కేసీఆర్ కు ఒక సూచన చేస్తున్నా, ఆయన అనుభవాన్ని పరిగణలోకి తీసుకుంటాం, ఆయన సూచనలు తెలంగాణకు ఉపయోగపడతాయంటే తీసుకుంటామని సీయం అన్నారు. నీటిపారుదల రంగంపై చర్చించడానికి మీరు శాసనసభ సమావేశాలు ఎప్పుడు పెట్టమన్నా మేము సిద్దంగా ఉన్నామన్నారు. లేకపోతే మీ ఫామ్ హౌస్ లో పెట్టమన్నా మేము రెఢీ, మా మంత్రులను పంపిస్తాను, అవసరమైతే నేను కూడా వస్తానని అంతే రేవంత్ రెడ్డి చెప్పారు. వాస్తవాలను ప్రజల దృష్టికి తీసుకు వెళ్ళాలన్నదే మా ఉద్దేశమని మేము పబ్బులు, క్లబ్బులకు దూరమని సీయం స్పష్టం చేశారు. ప్రజా భవన్ లో సమావేశం ఏర్పాటు చేస్తే హరీష్ రావు మా మంత్రి శ్రీధర్ బాబుతో అభ్యంతరం వ్యక్తం చేశారట, ఇది గడీ కాదు ప్రజా భవన్.. ఎవరైనా ఇక్కడికి రావచ్చని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు.
