Minister Uttam Kumar Reddy: తడిసిన ధాన్యాన్ని కూడా మద్దతు ధరకే కొనుగోలు చేసి రైతులను ఆదుకుంటామని తెలంగాణ పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు.

యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్‌లో ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించిన మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి సహచర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, శ్రీధర్ బాబుతో కలిసి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి నుంచి ప్రస్తుత పరిస్థితులను సమీక్షించారు.

సమీక్షకు ముందు యాదగిరిగుట్ట మండలం వంగపల్లిలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రులు పరిశీలించి రైతులతో మాట్లాడారు.

రానున్న నాలుగు రోజులు యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరించి కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేశారు. అవసరమైతే ప్రైవేట్ లారీలు, ట్రాక్టర్లు, ఇతర వాహనాలను ఉపయోగించుకోవాలని సూచించారు. జూన్ 1 నాటికి ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలని ఆదేశించారు. ఎమ్మెల్యేలు కూడా ఈ ప్రక్రియకు సహకరించాలని కోరారు.

తమ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి కనీవినీ ఎరుగని రీతిలో ధాన్యం దిగుబడులు వచ్చాయని, ప్రతి గింజనూ రాష్ట్ర ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందని ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. ప్రతిపక్షాలు రాజకీయం కోసం యాత్రలు చేపడుతున్నాయని విమర్శించారు.

మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ, బీజేపీ నాయకులు బస్సు యాత్రలు చేయకుండా ఢిల్లీ వెళ్లి మద్దతు ధర కొనుగోలుకు అవసరమైన నిధులు ఇప్పించాలని డిమాండ్ చేయాలని సూచించారు. వడ్ల గురించి తెలియని వారు మాట్లాడటం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. రైతులకు సంకెళ్లు వేసిన బీఆర్‌ఎస్ నేతలు ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు.

ఈ సమీక్షలో ప్రభుత్వ విప్‌లు బీర్ల ఐలయ్య, వేముల వీరేశం, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు అనిల్ కుమార్ రెడ్డి, మందుల సామేల్ తదితరులు పాల్గొన్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story