CM Revanth Reddy: ఫాంహౌస్‌ కుట్ర నుంచి శుద్ధీకరణ ఘటన వరకు అన్ని అంశాలపై సమగ్ర విచారణ చేసి బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం శాసనసభలో ఆయన ప్రకటన చేస్తూ.. దళితులను, స్పీకర్‌ను ఉద్దేశపూర్వకంగా అవమానించడం, మహిళా పోలీసులపై దాడులకు సంబంధించి ఎస్సీ, ఎస్టీలపై వేధింపుల నియంత్రణ చట్టం కింద ఐపీఎస్‌ అధికారి నేతృత్వంలో విచారణ చేపట్టనున్నట్లు తెలిపారు. విచారణ అధికారిగా హైదరాబాద్‌ జాయింట్‌ కమిషనర్‌ విజయ్‌కుమార్‌ను నియమించనున్నట్లు ప్రకటించారు.

రెండు రోజులుగా జరుగుతున్న ఘటనలు, ప్రభుత్వం దృష్టికి వచ్చిన అంశాలు, అందిన ఫిర్యాదులన్నీ క్రోడీకరించి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు. “ప్రభుత్వం మీకు అండగా ఉంది. రాష్ట్రంలోని నాలుగు కోట్ల మంది ప్రజలూ దన్నుగా ఉన్నారు. అధైర్యపడకండి” అని స్పీకర్‌కు ధైర్యం చెప్పారు. మల్లికార్జున ఖర్గే, గడ్డం ప్రసాద్‌కుమార్‌లకు జరిగిన అవమానాలను వ్యక్తులకు జరిగినవిగా భావించడం లేదని.. కొందరి మనసుల్లో పేరుకున్న మనువాదం, ఆధిపత్యపు ఆలోచనల భావజాలమేనని ఆయన అన్నారు.

ఎర్రవల్లి ఫాంహౌస్‌లో ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పిలిచి సుదీర్ఘ చర్చలతో కుట్రకు ప్రణాళిక రచించారని, సభ్యులను దాడులకు ఉసిగొల్పారని సీఎం ఆరోపించారు. “వారి చేష్టలు, దాడులు, మాటలు తీవ్రవాదులు, ఉగ్రవాదుల చర్యల కన్నా హేయం. పార్లమెంటులో దాడులకు పాల్పడిన ఉగ్రవాదులకు, ఏకే-47తో ముంబయిలో సామాన్యులను కాల్చిచంపిన కసబ్‌కు, పుల్వామాలో తీవ్రవాదుల దాడులకు, స్పీకర్‌ను అవమానిస్తూ భారాస వారు వాడిన భాషకు తేడా లేదు. కేసీఆర్‌ దుర్మార్గమైన ఆలోచనలతో జాతి, కుల వివక్ష అంతరాలను తిరిగి సమాజంలోకి తీసుకురావాలని చూస్తున్నారు. సమాజాన్ని రెచ్చగొట్టి దొరలు, దళితులుగా విడగొట్టి, రెండు జాతుల మధ్య వైరం సృష్టించాలని అనుకుంటున్నారు. కేసీఆర్‌ కుటుంబాన్ని సామాజిక బహిష్కరణ చేయాలి. అప్పుడే ఆ వివక్ష ఎలా ఉంటుందో తెలుస్తుంది. శుద్ధి చేయాల్సి వస్తే.. ఆయనలోని అంటరానితన ఆలోచనల్ని చేయాలి. కేసీఆర్‌ కుటుంబ సభ్యుల మనసుల్లో అహంకారపూరిత అంటరానితన ఆలోచనల్ని శుద్ధి చేయాలి. దొర అహంకారాన్ని శుద్ధి చేసే బాధ్యతను తెలంగాణ సమాజం తీసుకుంటుంది. ప్రజా ప్రభుత్వం అంటరానితనం, వివక్ష, శుద్ధీకరణలను చూస్తూ ఊరుకోదు” అని సీఎం మండిపడ్డారు.

విద్య, ధరణిలో అక్రమాలు, 22-ఏపై జరుగుతున్న రాద్ధాంతం, ప్రతిపక్షాలు లేవనెత్తిన చాలా విషయాలు, ఇతర ప్రజాసమస్యలపై సభలో చర్చించాలని ప్రభుత్వం భావించిందని, ఈ సమావేశాలు జరిగితే 2014 నుంచి 2023 నవంబరు వరకు కేసీఆర్‌, ఆయన కుటుంబ దురాగతాలు, చేసిన అప్పులు చర్చకు వస్తాయని భారాస వారు భావించి చర్చ జరగకూడదని కుట్ర చేశారని ఆయన ఆరోపించారు. కేసీఆర్‌ సభ్యులను ఉసిగొల్పి ఉన్మాదులుగా మార్చడంతో వారు విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తున్నారని, కొందరు ముష్కరులు ఉన్మాద వైఖరితో శాసనసభకు వచ్చి అధికారులపై దాడులు చేయడమే కాకుండా స్పీకర్‌ కుర్చీని, శాసనసభాపతి తల్లిని అవమానించారని సీఎం తెలిపారు.

పూర్వ హైదరాబాద్‌లో భాగమైన కల్యాణ కర్ణాటకలో రజాకార్ల దాడిలో తల్లిని కోల్పోయి తండ్రి ఆలనలో పెరిగిన దళిత బిడ్డ మల్లికార్జున ఖర్గే దాదాపు 60 ఏళ్లు ప్రజాజీవితానికి అంకితమైన వ్యక్తని గుర్తు చేస్తూ.. ఆయనపై జరిగిన శుద్ధీకరణను శాసనసభ, తెలంగాణ సమాజం సంపూర్ణంగా ఖండిస్తోందని సీఎం అన్నారు. రాష్ట్రంలో అత్యంత అవమానకరమైన, క్రూర సంఘటన జరిగిందని, మనం దేశాన్ని మాతగా భావిస్తాం కానీ ఒక తల్లిని అవమానించేలా భారాస సభ్యులు విచక్షణ కోల్పోయారని ఆయన విమర్శించారు. 24 గంటలైనా స్పందించకపోవడంతో దళిత వర్గాలు ఆవేదనకు గురయ్యాయని, కేసీఆర్‌ ఆదేశాలు ఇచ్చినందునే ఇలా జరిగిందని భావించి ప్రజాస్వామ్య పద్ధతిలో ఫాంహౌస్‌ వద్ద దండోరా వేసి, డప్పు కొట్టాలని నిర్ణయించాయని తెలిపారు. పదేళ్లు సీఎంగా పనిచేసిన కేసీఆర్‌ దళిత ప్రతినిధులను పిలిచి మాట్లాడలేదని, పైగా దళితులు అడుగుపెట్టిన ఫాంహౌస్‌ చుట్టూ పసుపు నీళ్లతో శుద్ధి చేశామంటూ ఆ పార్టీ ప్రతినిధులు తెలిపారని సీఎం ఆరోపించారు.

ఫాంహౌస్‌ కుట్ర నుంచి శుద్ధీకరణ వరకు అట్రాసిటీ ప్రివెన్షన్‌ చట్టం కింద చర్యలుంటాయని, దళితులను ఉద్దేశపూర్వకంగా బహిరంగంగా అవమానించడం (సెక్షన్‌ 3(1)(r)), విద్వేషపూరిత వివక్ష, శాంతిభద్రతలకు విఘాతం కలిగించడం, ప్రజల్లో విద్వేషం, అల్లర్లను రేకెత్తించడం తదితర సెక్షన్ల కింద కుట్ర పన్నిన, అమలు చేసిన వ్యక్తులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు. అనుకోని సంఘటన అయితే క్షమాపణతో సరిదిద్దవచ్చని, దొరలు, దళితులు అనే బేధభావాలకు ఆస్కారమిచ్చే చర్యలు మంచివి కావని అన్నారు. ఫాంహౌస్‌లో కుట్ర నుంచి ఇప్పటివరకు జరిగిన ఘటనలన్నీ క్రోడీకరించి, క్రిమినల్‌ కేసులు పెట్టి విచారణ చేపట్టేందుకు శాసనసభ ఆమోదించాలని కోరారు.

దేశానికి కాంగ్రెస్‌ ఏమి చేసిందనే వారంతా మనతో సమానంగా స్వాతంత్య్రం తెచ్చుకున్న పాకిస్థాన్‌ను చూస్తే తెలుస్తుందని సీఎం అన్నారు. అంబేడ్కర్‌ రాసిన రాజ్యాంగం, కాంగ్రెస్‌ పార్టీ త్యాగం, ఆలోచన విధానాలతో భారత్‌ ప్రపంచంలో ప్రధాన దేశాల సరసన నిలుస్తోందని, ఎస్సీ, ఎస్టీలకు విద్య, ఉద్యోగాలు, రాజకీయ పదవుల్లో రిజర్వేషన్లు లభించాయని గుర్తు చేశారు.

Next Story