Telangana CM Revanth Reddy: రాంలీలా మైదానంలో కాంగ్రెస్ కార్యకర్తలు తీసుకుంటున్న దీక్షతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గద్దె దిగక తప్పదని, ఆయన గుజరాత్‌కు వెళ్లక తప్పదని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ఆదివారం ఉదయం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ‘ఓట్ బచావో-దేశ్ బచావో చలో ఢిల్లీ’ ర్యాలీకి వచ్చిన రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రం నుంచి 15 వేల మందిని ఢిల్లీకి తీసుకురావాలని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ప్రయత్నించినా, రైల్వే శాఖ చివరి నిమిషం వరకు రైళ్లు ఇస్తామని చెప్పి మాట తప్పిందని సీఎం విమర్శించారు. “రైళ్లను ఆపగలిగారు కానీ తెలంగాణ నుంచి వచ్చి ఢిల్లీలో కదం తొక్కిన వేల మందిని ఆపగలిగారా? ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌లు మన సంకల్పాన్ని అడ్డుకోగలిగారా? తెలంగాణ బలం, గళం ముందు వారు తలవంచక తప్పలేదు” అని ప్రశ్నించారు.

నాడు రావణుడిని సంహరించే సమయంలో రాముడికి తోడుగా వానరసైన్యం లంకపై కదం తొక్కినట్లే, నేడు తెలంగాణ సైన్యం రావణుడైన నరేంద్ర మోదీని ఓడించడానికి ఢిల్లీకి వచ్చిందని ఉపమానం ఇచ్చారు. విజయం సాధించే వరకు విశ్రమించబోమని స్పష్టం చేశారు. నవంబర్ 2న హైదరాబాద్‌కు రాబోయే అమిత్ షాకు గుండెలు అదిరేలా నినాదాలు వినిపించాలని కార్యకర్తలను కోరారు.

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నాయకత్వంలో, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జరుగుతోందని గుర్తు చేశారు. బ్రిటిషర్లపై పోరాడి స్వాతంత్య్రం తెచ్చిన కాంగ్రెస్ పార్టీ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ కృషితో పీడిత, బడుగు బలహీన వర్గాలు, దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు, మహిళలు, యువతకు ఓటు హక్కు కల్పించిన చరిత్రను గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రధాని కులాలు, మతాలు, ప్రాంతాలు, భాష పేరుతో ‘విభజించు-పాలించు’ విధానం అమలు చేస్తున్నారని ఆరోపించారు.

2024 ఎన్నికల్లో బీజేపీకి 400 సీట్లు వస్తే రాజ్యాంగం రద్దు, రిజర్వేషన్లు తొలగింపు, ఆడపడుచులు, ఆదివాసీలు, గిరిజనుల ఓటు హక్కు తీసేయాలని కుట్ర చేశారని, కానీ ప్రజలు బుద్ధి చెప్పారని అన్నారు. అప్పటి నుంచి దళితులు, ఆదివాసీలు, ఆడపడుచులపై కక్ష పెంచుకున్న మోదీ, జ్ఞానేశ్ కుమార్‌ను ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా నియమించి ఓట్లు తొలగించే ప్రక్రియ చేపట్టారని, ఇప్పటికే 13.5 కోట్ల ఓట్లు తొలగించారని, రాబోయే రోజుల్లో అది 20 కోట్లకు పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. దేశంలో 15-20 శాతం ఓట్లు తొలగించి బీజేపీ మళ్లీ అధికారంలోకి రావాలన్న కుతంత్రం పన్నిందని, దీన్ని అడ్డుకోవడానికే రాహుల్ గాంధీ ఏడాదిగా చేస్తున్న పోరాటం చివరి అంకానికి చేరుకుందని పేర్కొన్నారు.

తెలంగాణ బలం కనిపించేలా ర్యాలీలో పాల్గొని, సభలో చివరి వరకు కూర్చొని సందేశాన్ని తీసుకొని గ్రామాలకు తీసుకెళ్లాలని కార్యకర్తలను ఆదేశించారు. మేధావులు, ప్రొఫెసర్లు కూడా ప్రజాస్వామ్యానికి పొంచి ఉన్న ప్రమాదంపై నిరసన తెలపడానికి వచ్చారని ప్రొఫెసర్ కోదండరాంను ప్రశంసించారు. ఈ ర్యాలీ కేవలం కాంగ్రెస్ పార్టీ సమస్య కాదని, దేశ ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, ఓటు హక్కు రక్షణ కోసం అందరూ ఏకమవాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడే ఈ పోరాటాన్ని గ్రామాల స్థాయి వరకు తీసుకెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Next Story