Minister Ponguleti: 22-ఏ భూముల పేరుతో సామాన్యులను ఇబ్బంది పెడితే సహించేది లేదని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి హెచ్చరించారు. ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పడం, దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం చేయడం ఇకపై సహించబోమని స్పష్టం చేశారు.

సోమవారం సచివాలయంలో 22-ఏ భూములపై మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల అధికారులతో కీలక అంశాలపై చర్చించారు. సబ్‌రిజిస్ట్రార్‌ల వారీగా దరఖాస్తుల స్థితిని వివరంగా అడిగి, ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, ఎప్పటి నుంచి పెండింగ్‌లో ఉన్నాయి అని ప్రశ్నించారు. పెండింగ్ దరఖాస్తులను ఎప్పటిలోగా పరిష్కరిస్తారో స్పష్టత ఇవ్వాలని ఆదేశించారు.

ఫిర్యాదుల పరిష్కారం కోసం ప్రత్యేక టోల్‌ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేస్తామని మంత్రి ప్రకటించారు. 22-ఏలో భూమి ఉందనే కారణంతోనే దరఖాస్తులను తిరస్కరించకూడదని హుకుం జారీ చేశారు. భూమి నిషేధిత జాబితాలోకి ఎందుకు వచ్చిందో రికార్డులు, వాస్తవ పరిస్థితులను సమగ్రంగా పరిశీలించాలని సూచించారు.

నిజమైన భూ హక్కుదారులకు న్యాయం చేస్తూనే ప్రభుత్వ భూములు, ఆస్తులను కాపాడాలని మంత్రి ఆదేశించారు. ప్రభుత్వ భూముల రక్షణ, ప్రజల హక్కుల విషయంలో నిర్లక్ష్యం చేస్తే తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story