What is happening in the Telangana Congress party?

కాంగ్రెస్‌ పార్టీ సహజ స్వభావంతో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఇబ్బంది పడుతున్నారన్న చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రికి కనీస ఫ్రీ హ్యాండ్‌ ఇవ్వకుండా.. ఢిల్లీ నుంచి అధిష్టానం పావులు కదపడంపై సీఎం అసంతృప్తిగా ఉన్నట్లు చెబుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ.. స్టీరింగ్‌ మాత్రం హస్తినలో ఉందన్న పాత చర్చ మళ్లీ ఊపందుకుంది. చీటికీ మాటికీ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని ఢిల్లీకి పిలిపించుకుంటున్న అధిష్టానం.. ఆయన ఆలోచనలకు, అభిప్రాయాలకు తగినంత విలువ ఇవ్వడం లేదన్న చర్చ జోరుగా సాగుతోంది. మొన్నటికి మొన్న కొత్త మంత్రులుగా ముగ్గురు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత.. వాళ్లకు కేటాయించాల్సిన మంత్రివర్గ శాఖలను కూడా ఢిల్లీలో అధిష్టానమే ఖరారు చేయడంపై పార్టీలోనూ ఆసక్తికర చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో పరిపాలనాధినేతగా ఉన్న ముఖ్యమంత్రిని ఏమాత్రం లెక్కలోకి తీసుకోవడం లేదన్న వాదనలు ఊపందుకున్నాయి.



వాస్తవానికి తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి యేడాదిన్నర గడిచిపోయింది. కేబినెట్‌లో ఖాళీగా ఉన్న ఆరు మంత్రివర్గ పదవులను భర్తీ చేయడానికి కూడా అధిష్టానం యేడాదిన్నర సమయం తీసుకుంది. ఈ లోగా.. యేడాది కాలంలో ఎన్నోసార్లు ఊరించింది. మరెన్నో సార్లు ముఖ్యమంత్రి సహా పలువురు పార్టీ ముఖ్యులను, మంత్రులను పిలిపించింది. కానీ, నిర్ణయం తీసుకోవడానికి, గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడానికి ఇంత సమయం తీసుకుంది. కొత్త మంత్రులను ఖరారు చేయడంలోనూ తనదైన వ్యూహాన్ని అనుసరించింది. రాష్ట్రంలో పరిస్థితులను, సామాజిక సమీకరణాలను, నాయకుల సామర్థ్యాన్ని కాకుండా.. అధిష్టానం తమకు కావాల్సిన రీతిలో మంత్రులను ఎంపిక చేసిందన్న విమర్శలు సొంతపార్టీలోనే వినిపిస్తున్నాయి. ఇక, ఇప్పుడు వాళ్లకు మంత్రిత్వ శాఖలు కేటాయించడంలోనూ హైదరాబాద్‌లో జరగాల్సిన తంతుకు న్యూఢిల్లీలో ఇంకా మంతనాలు సాగించడం అవసరమా? అన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.



తెలంగాణ ప్రభుత్వంలో, తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో ప్రస్తుత పరిస్థితులకు, గందరగోళానికి కారణం అధిష్టానమే అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్‌ మీనాక్షి నటరాజన్‌ నివేదికలు అధిష్టానాన్ని తప్పుదారి పట్టిస్తున్నాయని, రాష్ట్రంలో పార్టీని గందర గోళంలో పడేస్తున్నాయన్న ఆరోపణలు కూడా స్టార్ట్‌ అయ్యాయి. ప్రజల్లోకి వెళ్లగలిగే నేతలెవరు? ప్రజల్లో పాపులారిటీ ఉన్న నాయకులెవరు? రాష్ట్రంలో పార్టీని నిలబెట్టగలిగే సమర్థులెవరన్న అంశాల్లో ఇంకా పార్టీ ఇంచార్జ్‌కు క్లారిటీ రాలేదని పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధిష్టానం కూడా నాయకులందరికీ సమాన ప్రాతినిథ్యం ఇవ్వకుండా.. అభిప్రాయాలు, ఆలోచనలు పంచుకోవడంలో అవసరమైన వాళ్లకు కూడా అవకాశం కల్పించకపోవడమే ప్రస్తుత పరిస్థితికి కారణమంటున్నారు.




Politent News Web4

Politent News Web4

Next Story