CM Revanth Reddy: ట్యాంక్‌బండ్‌పై సర్దార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌ విగ్రహావిష్కరణ సభలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ, బహుజనులు, కల్లుగీత కార్మికులు, గౌడ సోదరుల అండదండలతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 117 సీట్లు గెలుస్తుందని ధైర్యంగా ప్రకటించారు.

“గతంలో పీసీసీ అధ్యక్షుడిగా డి. శ్రీనివాస్‌, సీఎల్‌పీ లీడర్‌గా వైఎస్‌. రాజశేఖరరెడ్డి పార్టీని రెండుసార్లు అధికారంలోకి తీసుకొచ్చారు. అదే తరహాలో మహేశ్‌కుమార్‌గౌడ్‌, నేను కూడా పార్టీని రెండోసారి అధికారంలోకి తెస్తాం” అని ఆయన అన్నారు. సామాజిక న్యాయం, బహుజనులకు అధికారం, ప్రజాప్రభుత్వం అనేవి తమ ప్రభుత్వ ఆశయాలని స్పష్టం చేశారు.

రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ, బహుజనులపై రాజులు, భూస్వాములు, జమీందార్లు దాడులు చేస్తుంటే సహించలేక సర్వాయి పాపన్న ఒక్కడే సైన్యంగా మారి దండయాత్రలు చేశారని గుర్తు చేశారు. ఆయన చరిత్ర బ్రిటిష్‌ లైబ్రరీలో గ్రంథంగా ఉందని, ఆ పోరాట స్ఫూర్తితో లక్షల మంది జీవితాలు మార్చుకోవాలనే లక్ష్యంతోనే ట్యాంక్‌బండ్‌పై విగ్రహం ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ సందర్భంగా ముదిరాజుల ఆరాధ్యుడు పండుగ సాయన్న జయంతిని అక్టోబరు 22న ప్రతి సంవత్సరం అధికారికంగా నిర్వహిస్తామని కూడా ప్రకటించారు.

గీత, చేనేత కార్మికుల సంక్షేమాన్ని ప్రభుత్వం బాధ్యతగా తీసుకుందని, రాష్ట్రవ్యాప్తంగా వారికి పింఛన్లు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చామని సీఎం చెప్పారు. గౌడ సోదరులను ఉద్దేశించి, కాలువ గట్లపై ఈత, తాటి చెట్లు పెంచుకొని సారవంతమైన కల్లు తయారు చేయాలని సూచించారు. ఇందుకు సహకరించాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కోరారు. కులవృత్తులు కొనసాగిస్తూనే పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివించాలని, అప్పుడే వారు ఐఏఎస్‌, ఐపీఎస్‌, డాక్టర్లు, ఇంజినీర్లు, లాయర్లుగా మారి తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములవుతారని అన్నారు.

గత బీఆర్ఎస్‌ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ, కేసీఆర్‌ పదేళ్లు అధికారంలో ఉన్నా ప్రజలకు ఉపయోగపడకుండా కుటుంబానికే న్యాయం చేశారని ఆరోపించారు. కేటీఆర్‌, హరీశ్‌ మంత్రులు, కవిత ఎమ్మెల్సీ, వినోద్‌కుమార్‌ ప్లానింగ్‌ కమిషన్‌ ఉపాధ్యక్షుడు, సంతోష్‌ రాజ్యసభ సభ్యుడు అయ్యారని జాబితా చదివారు. తమ ప్రభుత్వంలో మహేశ్‌కుమార్‌గౌడ్‌ పీసీసీ అధ్యక్షుడు, సీతక్క, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్‌ మంత్రులు అయ్యారని, వీరనారి చాకలి ఐలమ్మ మనవరాలు మహిళా కమిషన్‌ సభ్యురాలు అయ్యారని చెప్పారు.

ప్రజాప్రభుత్వం ప్రకటించిన పనుల్లో కొంత ఆలస్యం కావచ్చు కానీ అన్ని హామీలు నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్న ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీఆర్ఎస్‌ నాయకులు చెట్లకు, పుట్టలకు మొక్కుతూ, చేతబడులు చేయిస్తున్నారని విమర్శించారు. ఇలాంటి వారు సమాజానికి మంచిది కాదని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌, ఎంపీలు, ఎమ్మెల్యేలు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఈ మట్టి బానిసత్వాన్ని సహించదని అన్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story