CM Revanth Reddy: ‘జగన్‌కు నీళ్లను తాకట్టు పెట్టింది మీరే’.. అచ్చంపేట సభలో విపక్షాలపై రేవంత్‌రెడ్డి విమర్శలు
రేవంత్‌రెడ్డి విమర్శలు

CM Revanth Reddy: నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో గురువారం జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి భాజపా, భారాసలపై తీవ్రంగా మండిపడ్డారు. ‘మేం చేసిన సంక్షేమం గురించి రాస్తే రామాయణం అవుతుంది, చెబితే భారతం అవుతుంది. మీరు విడివిడిగా కాదు కలిసి అసెంబ్లీకి రండి, అక్కడే అన్ని లెక్కలు తేలుస్తా’ అని సవాలు విసిరారు. రూ.450 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి, ఇందిరమ్మ చీరల కానుక కార్యక్రమం ప్రారంభించారు.
పాలమూరు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులను కేసీఆర్ పదేళ్లు పడావు పెట్టారని, కాళేశ్వరానికి లక్ష కోట్లు ఖర్చు చేసి పాలమూరుకు పది వేల కోట్లు కూడా ఖర్చు చేయలేదని ఆరోపించారు. ‘మా నీళ్లను జగన్‌రెడ్డికి తాకట్టు పెట్టారు. ఇప్పుడు రాయలసీమకు నీళ్లు పోతున్నాయని గగ్గోలు పెడుతున్నారు’ అని విమర్శించారు. కృష్ణాలో 811 టీఎంసీలు ఉంటే తెలంగాణకు 299 టీఎంసీలు చాలని సంతకం పెట్టింది మామా-అల్లుళ్లేనని, ఆంధ్రాకు 66 శాతం నీళ్లు ఇచ్చిన ద్రోహులని పేర్కొన్నారు.
నాటి రాణి అచ్చమాంబ తరహాలో ఇందిరాగాంధీ స్ఫూర్తితో ప్రజా పాలన కొనసాగిస్తున్నామని, ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ చీరలు, కుటుంబ జీవిత బీమా అమలు చేస్తున్నామని చెప్పారు. కోటి మంది ఆడబిడ్డలకు చిలకపచ్చ రంగు చీరలు ఇస్తున్నామని, 2004-14 కాంగ్రెస్, 2014-23 భారాస అధికారంలో ఉన్నాయని, 2023-34 వరకు కాంగ్రెస్‌దే అధికారమని ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో కోటి ఓట్లు, 90 సీట్లు మావేనని విశ్వాసం వ్యక్తం చేశారు.
యువతకు ఇప్పటికే 75 వేల ఉద్యోగాలు ఇచ్చామని, త్వరలోనే 25 వేలు ఇచ్చి లక్ష ఉద్యోగాల నియామకం పూర్తి చేస్తామని ప్రకటించారు. బీసీల లెక్క తేల్చి ప్రధాని మోదీకి సవాలు విసిరానని, గడ్డం పెంచుకున్న ప్రతివారూ రేవంత్‌రెడ్డి కాలేరని హెచ్చరించారు. అచ్చంపేట తన జన్మస్థలమని, నల్లమల అడవి బిడ్డలు ఆశీర్వదించగా పాదయాత్ర చేశానని చెప్పారు. సభకు ముందు హెలిప్యాడ్ నుంచి సభా ప్రాంగణం వరకు సుమారు 3 కి.మీ. పాదయాత్రగా విచ్చేశారు.
పాలమూరు పౌరుషం తనలో ఉందని, కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలనుకుంటున్నామని స్పష్టం చేశారు. గత పాలనలో ప్రజల సొమ్ము దోచుకున్నారని, ప్రస్తుత ప్రభుత్వం ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం కృషి చేస్తోందని ప్రకటించారు.

