CM Revanth Reddy: మీ పెట్టుబడులకు మా పూర్తి రక్షణ.. తెలంగాణకు రండి: సీఎం రేవంత్‌రెడ్డి
సీఎం రేవంత్‌రెడ్డి

CM Revanth Reddy: తెలంగాణ పెట్టుబడులకు సురక్షిత గమ్యస్థానమని, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి సీఐఐ నార్తర్న్ రీజియన్ ప్రతినిధులను ఆహ్వానించారు. ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలోని బోధి పెవిలియన్‌లో శుక్రవారం జరిగిన సమావేశంలో సీఎం మాట్లాడుతూ ‘‘తెలంగాణ అంటే వ్యాపారం. ఇక్కడికి రండి.. పెట్టుబడులు పెట్టండి. మీ పెట్టుబడులకు మా ప్రజాప్రభుత్వం పూర్తి రక్షణ కల్పిస్తుంది’’ అని స్పష్టం చేశారు.
ప్రభుత్వాలు మారినా తెలంగాణలో పారిశ్రామిక విధానాలు మారవని సీఎం అన్నారు. 2004 వరకు ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పెట్టుబడులు ఆకర్షించారని, బిల్ గేట్స్, బిల్ క్లింటన్ వంటి దిగ్గజాలను హైదరాబాద్‌కు తీసుకొచ్చారని గుర్తు చేశారు. 2004-2014 కాంగ్రెస్ పాలనలో అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్, ఫార్మా, ఐటీ కంపెనీలు వచ్చాయని, 2014-2023 బీఆర్ఎస్ పాలనలోని కొన్ని విధానాలను కొనసాగిస్తూనే కొత్త పాలసీలు తీసుకొచ్చామని చెప్పారు. నాయకులు ఎవరైనా, పార్టీ ఏదైనా మంచి పాలసీ తీసుకొస్తే అది కొనసాగుతుందని ఆయన అన్నారు.
ఫార్చ్యూన్ 500 కంపెనీలు భారత్ ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టాలనేది లక్ష్యమని సీఎం వెల్లడించారు. గత డిసెంబరులో గ్లోబల్ సమిట్ నిర్వహించి తెలంగాణ రైజింగ్-2047 పాలసీని ప్రకటించామని, ఆ సదస్సులో 175 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారని చెప్పారు. ప్రస్తుతం దేశ జీడీపీలో తెలంగాణ వాటా 5 శాతం ఉండగా, దాన్ని 10 శాతానికి పెంచాలని ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
కాలుష్యంతో ఢిల్లీ, వర్షాలతో ముంబై, ట్రాఫిక్‌తో బెంగళూరు, ప్రకృతి వైపరీత్యాలతో చెన్నై సతమతమవుతున్న నేపథ్యంలో తెలంగాణను క్యూర్, ప్యూర్, రేర్‌గా విభజించి అభివృద్ధి చేస్తున్నామని సీఎం చెప్పారు. ప్యూర్, రేర్ ప్రాంతాల్లో పరిశ్రమలకు భూములు, వసతులు కల్పిస్తామని, భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి మచిలీపట్నం పోర్టు వరకు 12 లేన్ల రహదారి నిర్మిస్తామని తెలిపారు. వరంగల్, ఆదిలాబాద్‌ల్లో విమానాశ్రయాలకు కేంద్రం అనుమతి ఇచ్చిందని, 7 బుల్లెట్ ట్రైన్లలో 3 తెలంగాణకు వచ్చాయని పేర్కొన్నారు. పొరుగు రాష్ట్రాలతో కాకుండా ప్రపంచ దేశాలతో పోటీపడి చైనా ప్లస్ వన్‌గా తెలంగాణను నిలపాలని లక్ష్యమని అన్నారు.
తెలంగాణ సంస్కృతి పెద్ద ఆస్తని, హైదరాబాద్‌లో అన్ని రాష్ట్రాల ప్రజలున్నారని సీఎం అన్నారు. పెట్టుబడులు పెడితే రెట్టింపు ఆదాయం వస్తుందని, పారిశ్రామికవేత్తలు కోరిన వసతులు కల్పిస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిత్యం, పరిశ్రమల శాఖ మంత్రి రెండు నెలలకోసారి, తాను మూడు నెలలకోసారి అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఏఐ సునామీతో వైట్ కాలర్ ఉద్యోగాలు పోతున్న నేపథ్యంలో నైపుణ్యాభివృద్ధిపై దృష్టి పెట్టామని, పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంతో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని తెలిపారు. అమెజాన్ రూ.లక్ష కోట్లు, అదానీ గ్రూప్ రూ.35 వేల కోట్లతో డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాయని వివరించారు.
ఈ సమావేశంలో సీఎం సలహాదారు కె. రామకృష్ణారావు, పరిశ్రమల శాఖ స్పెషల్ సెక్రటరీ కృష్ణ ఆదిత్య, సీఐఐ నార్తర్న్ రీజియన్ ఛైర్మన్ పునీత్ కౌరా, వైస్ ఛైర్‌పర్సన్ శ్రద్ధా సూరి మార్వా, ప్రతినిధులు కృష్ణ బోధనపు, గౌరవ్ మహేశ్వరి, వనిత దాట్ల, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వినోద్ కె. బాప్న తదితరులు పాల్గొన్నారు.
సీఐఐ నార్తర్న్ రీజియన్ ఛైర్మన్ పునీత్ కౌరా మాట్లాడుతూ తెలంగాణ పారిశ్రామిక విధానాలు బాగున్నాయని, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, మద్దతుతో జీసీసీలు హైదరాబాద్‌కు వరుస కడుతున్నాయని అన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు అనువైన వాతావరణం, మౌలిక వసతులు, ప్రభుత్వ సహకారం మెరుగ్గా ఉండడంతోనే సమావేశానికి హైదరాబాద్‌ను ఎంచుకున్నామని, ఇక్కడ అధ్యయనం చేసేందుకు వచ్చామని తెలిపారు.

