ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రరూపం దాల్చిన వేళ, ఇజ్రాయెల్‌ మంత్రి చేసిన వ్యాఖ్యలు గతాన్ని గుర్తు చేస్తున్నాయి. "ఇరాన్ పాలకులు సద్దాం హుస్సేన్‌కు ఏ గతి పట్టిందో గుర్తుంచుకోవాలి" అని ఇజ్రాయెల్‌ మంత్రి హెచ్చరించడంతో చాలాకాలం మర్మంగా ఉన్న చరిత్ర మరోసారి తెరపైకి వచ్చింది. అదే "ఆపరేషన్ బ్రాంబుల్ బుష్". సద్దాం హుస్సేన్ హత్యకు సంబంధించి ఇజ్రాయెల్ సిద్ధం చేసుకున్న సీక్రెట్ మిషన్.

1991 గల్ఫ్ యుద్ధం తర్వాత సద్దాం హుస్సేన్ విధ్వంసక చర్యలు, అతడి క్షిపణి ప్రయోగాలు ఇజ్రాయెల్‌ను ఉలిక్కిపడేలా చేశాయి. అతడు భారీ దాడుల కోసం మారణాయుధాలు అభివృద్ధి చేస్తున్నాడని భావించిన ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మొస్సాద్, ఎప్పటికప్పుడు అతడిపై నిఘా పెట్టింది. దీంతో సద్దాంను నిర్మూలించే దిశగా ఒక సురక్షిత, రహస్య ఆపరేషన్‌కు రూపకల్పన చేశారు. దీనికి "ఆపరేషన్ బ్రాంబుల్ బుష్" అనే కోడ్‌నేమ్ పెట్టారు.

ఈ ఆపరేషన్‌ను ఇజ్రాయెల్ అత్యుత్తమ కమాండో విభాగం అయిన సయెరెట్ మట్కల్ చేతికి అప్పగించారు. సద్దాం తన సొంత ఊరైన తిక్రిత్‌ లో ఓ కుటుంబ సభ్యుడి అంత్యక్రియలకు హాజరవుతాడని సమాచారం అందడంతో ఆరోజునే అతడిపై దాడికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది ఇజ్రాయెల్‌ ప్రభుత్వం. మిషన్ ప్రణాళిక ప్రకారం, సద్దాం కాన్వాయ్‌ను టార్గెట్ చేస్తూ ఖచ్చితమైన క్షిపణి దాడి చేయాలని నిర్ణయించారు.

ఈ ఆపరేషన్‌ అమలులో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూసేందుకు 1992 నవంబర్ 5న నెగెవ్ ఎడారిలో లైవ్ ఫైర్ రిహార్సల్స్ చేపట్టారు. మిషన్‌ను సజావుగా అమలు చేయడానికే ఇది అన్నప్పటికీ.. ప్రమాదం అంచనాలకు అందకుండా తిప్పలు తెచ్చింది. లైవ్ మిస్సైళ్లతో ప్రాక్టీస్ చేస్తుండగా, ఒక కమాండో పొరపాటుగా పేల్చిన క్షిపణి సొంత బృందంపై పడింది. ఈ పేలుడుతో ఐదుగురు సైనికులు అక్కడికక్కడే మరణించగా, ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.

ఈ దుర్ఘటనతో ఆపరేషన్ బ్రాంబుల్ బుష్‌ను వెంటనే రద్దు చేశారు. ఆ సమయంలో కమాండోల మృతిని, ఆపరేషన్ వివరాలను చాలా సంవత్సరాలపాటు ఇజ్రాయెల్ గోప్యంగా ఉంచింది. చివరికి ఈ ఘటన బహిర్గతమైన తర్వాత, అధికార దర్యాప్తు జరిగి తార్కికమైన కారణాలు వెలుగులోకి వచ్చాయి. ప్రణాళికలో లూప్‌హోల్స్, కమ్యూనికేషన్ లోపాలు, ప్రమాదపు అంచనా లోపాలు ఈ విషాదానికి కారణమయ్యాయని విచారణలో తేలింది.

ఇజ్రాయెల్‌ హత్యాయత్నం విఫలమైనా, దాదాపు పదేళ్ల తర్వాత సద్దాం హుస్సేన్‌ను అమెరికా సైనికులు 2003లో ఓ భూగర్భ బంకర్‌లో పట్టుకున్నారు. అనంతరం అతడి పాలనలో జరిగిన పలు ఘోర నేరాలకు సంబంధించి కేసులు నమోదు అయ్యాయి. విచారణల్లో సద్దాం దోషిగా తేలడంతో 2006లో ఉరిశిక్ష అమలయ్యింది.


Politent News Web4

Politent News Web4

Next Story