ప్రతిష్టాత్మక మిస్ వరల్డ్ కిరీటం గెలుచుకున్న థాయిలాండ్ సుందరి సుచాతా చుయాంగ్‌ శ్రీ భావోద్వేగానికి గురయ్యారు. నిజంగా ఇది తనకు ఒక అద్భుతమైన అనుభవమని, ఒకే ఒక్క రాత్రిలో తన జీవితం మారిపోయిందని ఆనందం వ్యక్తం చేశారు. ఉదయం నిద్రలేచి ‘నేను మిస్ వరల్డ్’ అనుకోవడం ఒక స్ఫూర్తిదాయకమని చెప్పారు. మిస్‌ వరల్డ్ కిరీటం దక్కిన తర్వాత చుయాంగ్‌ శ్రీ హైదరాబాద్‌లో పొలిటెంట్‌ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ గెలుపు తాలూకు ఆనందం ఇంకా తనకు పూర్తిగా అర్థం కాలేదని చెప్పారు.



గెలిచిన క్షణాలను గుర్తు చేసుకుంటూ, ఆ రోజు రాత్రి రిజల్ట్‌ ప్రకటించబోతున్న సమయంలో తాను గట్టిగా ప్రార్థించానని, దయచేసి థాయిలాండ్ అని చెప్పండి. నా దేశ ప్రజలు ఎంతో ఆశగా చూస్తున్నారని మనసులోనే అనుకున్నానని తెలిపారు. ఈ విజయం థాయిలాండ్‌కు మొదటి మిస్ వరల్డ్ కిరీటం కావడం గర్వంగా ఉందన్నారు.



తాను మిస్‌ వరల్డ్‌గా ప్రకటించబడితే.. గెలుపు తర్వాత మూడింటిని చేయాలనుకున్నానని చెప్పారు "మొదట గట్టిగా అరవాలి అనుకున్నాను - అది చేశాను. రెండోది - నా కుటుంబ సభ్యులను, మిత్రులను ఆలింగనం చేసుకోవాలనుకున్నాను. మూడవది - కొత్త ఉదయం మిస్ వరల్డ్‌గా ప్రారంభించడం," అని సంతోషంగా వివరించారు.



హైదరాబాద్‌, తెలంగాణ పర్యటనలో అనుభవాలను సుచాతా ఎంతో ప్రేమగా గుర్తు చేసుకున్నారు. ఇక్కడి ప్రతి ప్రదేశం అద్భుతంగా ఉందని, తన మిత్రులతో కలిసి ఈ అందమైన ప్రదేశాలను చూసిన అనుభవం జీవితాంతం మర్చిపోలేనని చెప్పారు. హైదరాబాదీ బిర్యానీ చాలా రుచిగా ఉందని, ఇక్కడ ఉన్నన్నిరోజులు చాలా సార్లు తిన్నానని, ఆ రుచి మర్చిపోలేనని తెలిపారు.



తనకు బాలీవుడ్‌ సినిమాల పట్ల ఆసక్తి ఉందని, అవకాశం వస్తే నటించేందుకు సిద్ధమని సుచాతా తెలిపారు. అలియా భట్ తన ఫేవరెట్ అని చెప్పిన సుచాతా, ఇండియన్ సినిమా పరిశ్రమలో అవకాశం వస్తే తప్పకుండా ప్రయత్నిస్తానని వెల్లడించారు.



తన మిస్ వరల్డ్ ప్రయాణం అంతా సవాళ్లతో నిండినదేనన్న సుచాతా.. ప్రతి రోజు మంచి వర్షన్‌గా తయారవ్వాలన్నదే తన లక్ష్యమన్నారు. అదే తనకు పెద్ద సవాల్‌గా మారిందని చెప్పారు.



భవిష్యత్తులో మిస్ వరల్డ్ కావాలనుకునే యువతులు వాళ్ల మీద తమ నమ్మకాన్ని కోల్పోవద్దని, వాళ్ల లక్ష్యాలను ఉన్నతంగా పెట్టుకోవాలని, మీ మూల్యాలను వదలకుండా ముందుకు సాగితే తప్పకుండా విజయాన్ని సాధిస్తారని సుచాతా సూచించారు.


Updated On
Next Story