Donald Trump : చమురు కొనుగోళ్ళలో రష్యాకు దూరమైన భారత్
సంచలన ప్రకటన చేసిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్

చమురు కొనుగోళ్ళకు సంబంధించి భారత్ దేశం రష్యాకి దూరమయ్యిందని అమెరికా అధ్యక్షుడు సంచలన ప్రకటన చేశారు. అమెరికాలోని అలస్కా నగరంలో శుక్రవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సమావేశమైన తరువాత ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం సంచలనం సృష్టించింది. రష్యా నుంచి చమురు కొంటున్న దేశాలపై సుంకాల పెంపు విషయం మళ్ళీ ఆలోచిస్తానని ట్రంప్ ఈ సందర్భంగా వెల్లడించారు. రెండు మూడు వారాల్లో దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటానని ట్రంప్ చెప్పారు. ట్రంప్, పుతిన్‌ల భేటీకి ముందు కూడా విమాన ప్రయాణంలో ఓ మీడియా సంస్ధకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఈ విషయాన్ని ట్రంప్ ప్రస్తావించారు. రష్యా ఇప్పటికే ఒక క్లైంట్‌ను కోల్పోయిందని, 40 శాతం చమురు కొనుగోలు చేసే భారత దేశాన్ని పుతిన్ కోల్పోయాడని ట్రంప్ వ్యాఖ్యానించారు. చైనా కూడా రష్యాతో బానే వాణజ్య సంబంధాలను కొనసాగిస్తోందని ఈ వ్యవహారంలో అవసరమైతే సుంకాల పెంపు గురించి ఆలోచిస్తానని, అయితే అంత అవసరం ఉంటుందని అనుకోవడం లేదని ట్రంప్ పేర్కొన్నారు. గత జూలై 30వ తేదీన భారతదేశంపై ట్రంప్ 25 శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు. ఆ సందర్భంగా భాతర్ అమెరికాకు మిత్ర దేశం అయినప్పటికీ మనతో వాణిజ్య ఒప్పందాలు సరిగాలేవని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడం ద్వారా ఉక్రెయిన్ యుద్దానికి ఆయుధాలు కొనుగోలు చేయడానికి పరోక్షంగా రష్యాకు సహకరిస్తోందని ట్రంప్ తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే పాకిస్తాన్, భారత్ యుద్దాన్ని తానే ఆపినట్లు పదే పదే చెప్పుకునే ట్రంప్ ఇప్పుడు కొత్తగా రష్యా నుంచి చమురు కొనుగోళ్ళను భారత్ నిలిపివేసిందని చెపుతున్నారు. అయితే ఈ వ్యవహరంలో ఇప్పటి వరకూ భారత ప్రభుత్వం నుంచి ఎవరూ స్పందించలేదు.
