iran have to make a deal first.. Trump on Israel-Iran war

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో, ఇరాన్‌ అణు ఒప్పందంపై ముందుగా కమిట్‌ అవాల్సిందేనని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ స్పష్టం చేశారు. ఇజ్రాయెల్‌తో కాల్పుల విరమణ కోసం అరబ్‌ దేశాల మద్దతుతో ఇరాన్‌ రాయబారం సాగిస్తుండగా, ట్రంప్‌ మాత్రం తొలుత టెహ్రాన్‌ అణు ఒప్పందానికి అంగీకరించాలి అని షరతు విధించారు.

జీ7 సదస్సుకు హాజరైన సందర్భంగా ట్రంప్‌ మీడియాతో మాట్లాడుతూ, ఇరాన్‌ ఈ యుద్ధం గెలవదని, వారు చర్చలకు రావాల్సిందేనని, పరిస్థితి అదుపు తప్పకముందే మేధస్సుతో ముందుకు రావాలని సూచించారు.

తమ అరబ్‌ మిత్ర దేశాల ద్వారా ఇరాన్‌ చర్చలకు సన్నద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇరాన్‌ విజ్ఞప్తి మేరకు గల్ఫ్‌ దేశాలైన సౌదీ అరేబియా, ఖతార్‌, ఒమన్‌ దేశాలు అమెరికా మీద ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఇజ్రాయెల్‌ను అదుపు చేసేందుకు చర్యలు తీసుకోవాలని, లేకపోతే చమురు సరఫరాలపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందని ఆయా దేశాలు ట్రంప్‌ను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నాయి.

కాల్పుల విరమణ విషయాన్ని ట్రంప్‌ సీరియస్‌గా తీసుకుంటున్నారని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఎమ్మానుయెల్‌ మేక్రాన్‌ తెలిపారు. అదే సమయంలో, ఇరాన్‌లో ప్రభుత్వాన్ని కూలదోయాలన్న ఇజ్రాయెల్‌ ఆలోచన వ్యూహాత్మకంగా తప్పని అభిప్రాయపడ్డారు. ఇరాన్‌, ఇజ్రాయెల్‌ చర్చలకు ముందుకు రావాల్సిన సమయం ఇది అని.. కాల్పులు ఇరుదేశాలూ ఆపాలని, బాంబింగ్‌ దాడులు నిలిపివేయాలని ఫ్రాన్స్‌ తరఫున తాము స్పష్టంగా కోరామన్నారు. ఇరు పక్షాల నుంచి సానుకూల స్పందన రావాలని ఆశిస్తున్నామని మేక్రాన్‌ పేర్కొన్నారు.

ఇక ట్రంప్‌ తన సోషల్‌ మీడియా వేదికగా మరింత స్పష్టత ఇచ్చారు. ఇరాన్‌ అణ్వాయుధాలను మర్చిపోవాలని, ఒప్పందంపై సంతకం చేయాల్సిందేనని, ఈ యుద్ధంతో వృథాగా ప్రాణాలు పోవడం దురదృష్టకరమని, టెహ్రాన్‌లోని ప్రతి ఒక్కరూ తక్షణమే ఆ ప్రాంతం విడిచి వెళ్లాలని డోనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరించారు.


Politent News Web4

Politent News Web4

Next Story