ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు అంతర్జాతీయ విమాన రాకపోకలపై ప్రభావం చూపుతున్నాయి. భద్రతాపరమైన ఆందోళనల నేపథ్యంలో ఇరాన్ తన గగనతలాన్ని తాత్కాలికంగా మూసివేసింది. దీనివల్ల ఆసియా-యూరప్ మధ్య ప్రయాణించే ముఖ్యమైన విమాన మార్గాల్లో అంతరాయం ఏర్పడింది.



ఈ పరిణామాల నేపథ్యంలో భారత ప్రధాన విమానయాన సంస్థలు 'ఎయిర్ ఇండియా' 'ఇండిగో' తమ ప్రయాణికుల కోసం కీలక సూచనలు చేశాయి. ఇరాన్‌ గగనతలం మూసివేచడంతో యూరప్, ఉత్తర అమెరికా వంటి ప్రాంతాలకు వెళ్లే పలు విమానాలను ఎయిర్ ఇండియా దారి మళ్లించింది. లండన్-ముంబయి సర్వీస్‌ను వియన్నాకు మళ్లించింది. ఆయా మార్గాల సర్దుబాటు కారణంగా ప్రయాణ సమయం కూడా పెరిగే అవకాశం ఉంది. కొన్ని విమానాలు ఆలస్యంగా రాక పోకలు సాగించవచ్చు.. లేదంటే.. కొన్ని సందర్భాల్లో కొన్ని విమాన సర్వీసులు రద్దయ్యే అవకాశం కూడా ఉంది. పై పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ప్రయాణికులు తమ విమానాల రాకపోకలకు సంబంధించిన ప్రస్తుత పరిస్థితిని, మారిన సమయాలను ఎయిర్‌లైన్ వెబ్‌సైట్లు లేదా మొబైల్ యాప్‌ల ద్వారా నిరంతరం చెక్‌ చేస్తూ ఉండాలని సూచించాయి.



తమ సంస్థ విమానాల రాకపోకలు, ప్రయాణ సమయాల్లో మార్పులు ఉండొచ్చని, ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని మరో విమానయాన సంస్థ ఇండిగో కూడా సూచించింది. రెండు సంస్థలూ పరిస్థితిని గమనిస్తున్నామని, అవసరమైన చోట తక్షణ సూచనలు జారీ చేస్తామని తెలిపాయి. ఈ ఉద్రిక్తతలు ఇంకా కొనసాగితే, ప్రయాణికులకు మరింత అసౌకర్యం కలగొచ్చని హెచ్చరిస్తున్నారు. మధ్యప్రాచ్యం మీదుగా ప్రయాణించే వారు ముందు జాగ్రత్తగా ప్రణాళికలు వేసుకోవాలని సూచిస్తున్నారు.




Next Story