పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న వేళ, ఇరాన్ తన వైఖరిని మరింత స్పష్టంగా ప్రకటించింది. ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్న తరుణంలో అమెరికాతో ఎలాంటి అణు ఒప్పంద చర్చలు జరగవని ఇరాన్ తేల్చిచెప్పింది. ఈ మేరకు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ కీలక వ్యాఖ్యలు చేశారు.



ఇరాన్‌పై దాడులు ఆపేంతవరకు చర్చలు జరిపే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్‌పై జరుగుతున్న హింసాత్మక చర్యలకు అమెరికా పరోక్ష మద్దతు ఇస్తోందన్న అనుమానం ఉందని, ఇజ్రాయెల్ చేస్తున్న దాడులకు అమెరికా నేరుగా భాగస్వామిగా ఉన్నదన్న అభిప్రాయాన్ని మేము తోసిపుచ్చలేమని అరాఘ్చీ వ్యాఖ్యానించారు.



అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల చేసిన హెచ్చరికలను ఆయన ప్రస్తావిస్తూ, ఇరాన్ చర్చలకు రాకపోతే రెండు వారాల్లో చర్యలు తీసుకుంటామనే వ్యాఖ్యలు తమ దేశాధికారానికి విరుద్ధంగా ఉన్నాయని తెలిపారు. ప్రస్తుత ఆత్మరక్షణ పరిస్థితుల్లో, ఇటువంటి ఒత్తిడిలో చర్చలు అసాధ్యమని పేర్కొన్నారు.



అణు ఒప్పందాలపై అమెరికా నుంచి చర్చలకు పిలుపు వచ్చినప్పటికీ, ఇజ్రాయెల్ దాడులకు అడ్డుకట్ట పడే వరకు ఆ అవకాశం లేదని ఇరాన్ స్పష్టం చేసింది. దాడులకు సంబంధం లేదని అమెరికా తెలిపినా, ఆ దేశ ప్రోత్సాహంతో ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తోందన్న అభిప్రాయం ప్రపంచ వ్యాప్తంగా చాలామందిలో ఉందని అరాఘ్చీ వ్యాఖ్యానించారు.



ఈ నేపథ్యంలో అమెరికా-ఇరాన్ సంబంధాలు మరింత తారాస్థాయికి చేరే సూచనలు కనిపిస్తున్నాయి. అణు చర్చలు వాయిదా పడటం వల్ల ప్రాంతీయ శాంతి భద్రతలపై ప్రభావం పడే అవకాశముంది.


Next Story