ఉక్రెయిన్‌పై రష్యా అతిపెద్ద డ్రోన్ దాడి - 479 డ్రోన్లతో ఎటాక్
Russia's largest drone attack on Ukraine - attack with 479 drones

ఉక్రెయిన్‌పై వందలకొద్దీ డ్రోన్లను ప్రయోగిస్తూ రష్యా ఈ యుద్ధంలో ఇప్పటి వరకు లేని విధంగా తొలిసారి అతిపెద్ద డ్రోన్ దాడికి తెరలేపింది. ఈ దాడి రష్యా వైమానిక స్థావరాలపై ఉక్రెయిన్ చేసిన దాడులకు ప్రతీకారంగా భావిస్తున్నారు. ఈ క్రమంలో, మూడు సంవత్సరాల యుద్ధంలో మొదటిసారి 479 డ్రోన్లు ప్రయోగించిందని ఉక్రెయిన్ వాయుసేన ధ్రువీకరించింది. అలాగే, రష్యా 20 క్షిపణులను కూడా ప్రయోగించినట్లు తెలిపింది. ఇవి మధ్య, పశ్చిమ ఉక్రెయిన్ ప్రాంతాలను టార్గెట్‌గా చేసుకున్నాయని పేర్కొంది.
మాస్కో ప్రయోగించిన ఆయుధాల్లో 277 డ్రోన్లు, 19 క్షిపణులను తమ వాయుసేన క్షిపణి నిరోధక వ్యవస్థలు మధ్యలోనే కూల్చేశాయని ఉక్రెయిన్ తెలిపింది. ఈ దాడుల్లో కేవలం 10 డ్రోన్లు లేదా క్షిపణులు మాత్రమే లక్ష్యాలను తాకినట్లు వెల్లడించింది. సాధారణంగా రష్యా సాయంత్రం నుంచి తెల్లవారు జాము వరకు డ్రోన్ దాడులు జరిపే వ్యూహాన్ని అనుసరిస్తోంది. చీకట్లో డ్రోన్లను గుర్తించడం కష్టమవుతుందనే ఉద్దేశంతో ఈ విధానాన్ని అవలంబిస్తోంది. ఇటీవల రష్యా పౌర ప్రాంతాలపై దాడులు చేస్తున్నట్లు విమర్శలు వచ్చాయి. ఇప్పటి వరకు రష్యా దాడుల్లో 12వేల మంది ఉక్రెయిన్ ప్రజలు ప్రాణాలు కోల్పోయారని ఐక్యరాజ్యసమితి గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అయితే, రష్యా మాత్రం తాము కేవలం సైనిక స్థావరాలపైనే దాడులు చేస్తున్నామని పేర్కొంటోంది.
ఇదిలా ఉండగా, రష్యా నౌకాదళానికి సంబంధించి సరికొత్త వ్యూహాన్ని ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆమోదించారు. ప్రపంచంలో అత్యుత్తమ నౌకాదళంగా రష్యాను తీర్చిదిద్దడమే ఈ వ్యూహం లక్ష్యమని క్రెమ్లిన్ ప్రతినిధి నికోలాయ్ పత్రుషేవ్ తెలిపారు. అయితే ఈ వ్యూహానికి సంబంధించిన పూర్తి వివరాలను ఆయన వెల్లడించలేదు. ప్రస్తుతం రష్యా ప్రపంచంలో మూడో అతిపెద్ద నేవీగా ఉంది. కానీ ఉక్రెయిన్‌తో యుద్ధంలో దానికి కొన్ని తీవ్ర ఎదురుదెబ్బలు తగిలినట్లు తెలుస్తోంది. రష్యా వద్ద 79 జలాంతర్గాములు ఉండగా, అందులో 14 అణుశక్తితో పనిచేస్తున్నవి. అలాగే 222 యుద్ధ నౌకలు రష్యా నౌకాదళంలో ఉన్నాయి. పుతిన్ ఆమోదించిన వ్యూహం ప్రకారం 2050 నాటికి రష్యా నౌకాదళాన్ని మరింత శక్తిమంతంగా తీర్చిదిద్దనున్నారు. ఇదే సమయంలో చైనా నౌకాదళం వేగంగా అభివృద్ధి చెందుతున్నదని, 2030 నాటికి 460 యుద్ధనౌకలు చైనా వద్ద ఉండబోతున్నాయని అమెరికా రక్షణ శాఖ నివేదికలో పేర్కొంది.
