Significant difference in poverty levels between India and Pakistan

భారత్, పాకిస్థాన్ మధ్య పేదరిక స్థాయిలలో గణనీయమైన వ్యత్యాసం ఉందని తాజాగా ప్రపంచ బ్యాంకు గ్లోబల్ పావర్టీ డేటా స్పష్టం చేసింది. వరల్డ్ బ్యాంకు డేటా రెండు దేశాల ఆర్థిక ప్రగతి, పాలన వ్యవస్థల ప్రభావం, సామాజిక సంక్షేమ విధానాల ఫలితాలను ప్రతిబింబిస్తున్నాయి. ప్రపంచ బ్యాంక్ నివేదిక ప్రకారం.. భారతదేశంలో తీవ్రమైన పేదరిక రేటు 2011లో 22.5%గా ఉండగా.. అది 2021 నాటికి 10%కి తగ్గింది.

2031 నాటికి ఈ రేటు సింగిల్ డిజిట్కు తగ్గిపోవచ్చని అంచనాలు ఉన్నాయి. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన, ఉజ్వల యోజన, ఆయుష్మాన్ భారత్, ఆహార రాయితీలు వంటి సంక్షేమ పథకాలు ఈ పురోగతికి దోహదం చేశాయని పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక చైతన్యం, మహిళల ఆర్థిక భాగస్వామ్యం, డిజిటల్ లావాదేవీల విస్తరణ కూడా పేదరికం తగ్గుదలకు దోహదం చేశాయని తెలిపింది.

జనాభాలో ఎంత శాతం మంది దారిద్ర్య రేఖకు దిగువ నివసిస్తున్నారో నిర్దారించడానికి ద్రవ్యోల్బణాన్ని దాని ప్రాథమిక సూచికలలో ఒకటిగా వరల్డ్ బ్యాంకు పరిగణనలోకి తీసుకుంది. తన ప్రపంచ ఆదాయ పరిమితిని ఓ వ్యక్తికి రోజుకు 2.15 డాలర్లు నుంచి 3 డాలర్లకు సవరించింది. ప్రపంచ బ్యాంకు పేదరికం, భాగస్వామ్య శ్రేయస్సు నివేదిక ప్రకారం.. 2012- 2022 మధ్య, ప్రతి వ్యక్తి ఆదాయంలో పెరుగుదల సవరణ ఉన్నప్పటికీ, భారతదేశంలో తీవ్ర పేదరికం మొత్తం జనాభాలో 27.1 శాతం నుంచి 5.3 శాతానికి తగ్గింది.

భారత్లో 2022-23 నాటికి 75.24 మిలియన్ల మంది ప్రజలు తీవ్ర పేదరికంలో జీవిస్తున్నారని, ఇది 2011-12లో 344.47 మిలియన్లతో పోల్చితే భారీ తగ్గుదల అని నివేదిక పేర్కొంది.

కేవలం 11 ఏళ్లలో పాకిస్థాన్ మొత్తం జనాభా కంటే ఎక్కువ మంది భారతదేశంలో తీవ్ర పేదరికం నుంచి బయటపడటం విశేషం. విచారకరంగా పాకిస్థాన్ విషయానికొస్తే కథ దీనికి విరుద్ధంగా ఉంది. 2017- 2021 మధ్య 5 ఏళ్లలో తీవ్ర పేదరికం 4.9 శాతం నుంచి 16.5 శాతానికి పెరిగింది. పాక్ గృహ ఆదాయం, వ్యయ సర్వే కారణంగా పరిస్థితి చాలా దారుణంగా ఉండొచ్చని విశ్లేషకులు సూచిస్తున్నారు.

పాకిస్థాన్లో ఆర్థిక సంక్షోభం, పేదరికం మరింత తీవ్రమవుతుండటం గమనార్హం. ప్రపంచ బ్యాంక్ నివేదిక ప్రకారం.. పాకిస్థాన్లో పేదరిక రేటు 2018లో 34.2%గా ఉండగా.. 2023 నాటికి అది 39.4%కి పెరిగింది. గత ఐదేళ్లుగా పాక్ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ద్రవ్యోల్బణం, ఐఎంఎఫ్ రుణాలపై ఆధారపడటం, ఆ దేశ కరెన్సీ విలువ పతనం, పాలనా అస్థిరత ప్రధాన కారణాలు. ముఖ్యంగా నిత్యావసర, ఇంధన ధరల పెరుగుదల, ఉద్యోగ అవకాశాల కొరత దాయాది దేశంలో పేదరికాన్ని తీవ్రతరం చేస్తున్నాయి.

ఆయుధ సామాగ్రి వ్యయాలు, ఉగ్రవాద వ్యతిరేక చర్యలకు నిధుల వినియోగం, సామాజిక పథకాలకు తక్కువ కేటాయింపులు ఇవన్నీ పరిస్థితిని మరింత దిగజార్చుతున్నాయని నివేదిక తెలిపింది. వాస్తవంగా చూస్తే, వేగంగా పేదరికాన్ని తగ్గిస్తోన్న అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ ఒకటిగా నిలుస్తోంది. మరోవైపు, పాకిస్థాన్ ఆర్థిక స్థిరత్వాన్ని కోల్పోయి, అంతర్గత రాజకీయ అస్థిరత వల్ల సామాజిక రంగాల్లో వెనుకడుగు వేస్తోంది. ప్రస్తుతం పాక్ పేదరికం నుంచి బయటపడాలంటే రాజకీయ స్థిరత్వం, ప్రజాపాలనలో పారదర్శకత, వ్యవస్థాపిత సంక్షేమ విధానాలు, విద్య, ఆరోగ్య రంగాల్లో మరింత పెట్టుబడి అవసరమని ప్రపంచ బ్యాంకు నివేదిక స్పష్టం చేసింది.

Updated On 10 Jun 2025 3:45 PM IST
Politent News Web3

Politent News Web3

Next Story