అమెరికా చమురు రష్యాను దూరం చేస్తుందా ..?
భారత్ అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గిందా ..

భారత్ అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గిందా ..
రష్యాతో ఉన్న స్నేహంపై ఎలాంటి ప్రభావం పడుతుంది?
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు … ప్రయోజనాలు, పరిస్థితులు మారితే దేశాల వ్యూహాలు కూడా మారుతాయి. భారత్ ఈ రోజు అమెరికా నుంచి చమురు దిగుమతి చేస్తే… రష్యాతో ఉన్న దశాబ్దాల స్నేహంపై ఎంత ప్రభభావం పడుతుంది ?
ఒక సారి విశ్లేషిద్దాం ..
భారత్‌కు చమురు అవసరం రోజు రోజుకూ పెరుగుతోంది. ప్రపంచంలో మూడో అతిపెద్ద చమురు వినియోగదారు భారత్ . ఈ అవసరాన్ని తీర్చడానికి భారత్ ఎన్నో దేశాల నుంచి ముడి చమురును దిగుమతి చేకుంటోంది.
ఇందులో ముఖ్యంగా– రష్యా, ఇరాక్, సౌదీ, యుఎస్… ఇవన్నీ పెద్ద సరఫరాదారులు.
2022 తర్వాత ఉక్రెయిన్–రష్యా యుద్ధం మొదలుకాగానే, ఇండియా రష్యా నుంచి భారీ రాయితీతో చమురు కొనడం మొదలు పెట్టింది.
70 ఏళ్లకు పైగా ఉన్న స్నేహం… రక్షణ , అణు శక్తి, వ్యూహాత్మక భాగస్వామ్యం — ఇవన్నీ రష్యా– భారత్ సంబంధాల్లో కీలకం.
భారత రక్షణ వ్యవస్థలో సుమారు 60% రష్యన్ టెక్నాలజీ నుంచే.
అందుకే రష్యా, భారత్‌కి కేవలం చమురు సరఫరాదారు కాదు — ఒక నమ్మకమైన మిత్రుడు కూడా.
అమెరికా నుంచి చమురు కొనడం అనేది భారత్ కు కొత్త విషయం కాదు. కానీ కొంత ఎక్కువ పరిమాణంలో దిగుమతి చేస్తే… అది ప్రపంచ దేశాలతో భారత్ కు ఉన్న సంబంధాలలో పెద్ద మార్పునకు సంకేతం .
అమెరికా ఎప్పటినుంచో ఆసియాలో తన ప్రాభవాన్ని పెంచుకునేందుకు భారత్‌తో సన్నిహిత ఆర్థిక సంబంధాలు కోరుకుంటోంది.
భారత్ అమెరికా నుంచి చమురు కొనుగోలు పెంచితే…ఆ దేశంతో మన సంబంధాలు బలపడతాయి
అయితే రష్యా ఎలా స్పందిస్తుందన్నదే అసలు ప్రశ్న. భారత్ అమెరికా చమురుపై ఆధారపడటం పెంచితే… రష్యా తో భారత్ కు ఉన్న సంబంధాలు ఏ మేరకు దెబ్బతింటాయి ..
మొదటగా —
రష్యా పెద్దగా స్పందించకపోవచ్చు. ఎందుకంటే భారత్ ఇంకా రష్యాకు పెద్ద మిత్రుడే .
కానీ తెర వెనకాల కొన్ని ప్రభావాలు ఉండే అవకాశం ఉంది.
రష్యా ఇప్పుడిస్తున్న రాయితీ తగ్గించ వచ్చు. ఇండియా ప్రత్యామ్నాయ మార్కెట్ పెంచుకుంటే, రష్యా ఇక అంత పెద్ద రాయితీ మున్ముందు ఇవ్వకపోవచ్చు.
రక్షణ ప్రాజెక్టుల వేగం తగ్గే అవకాశం ఉంది. కొన్ని జాయింట్ ప్రాజెక్ట్ లు — బ్రహ్మోస్ అప్డేట్స్, సుఖోయ్ అప్‌గ్రేడ్స్… ఇవి కొద్దిగా మందగించే అవకాశం ఉంది.
అమెరికాకు భారత్ దగ్గరయితే రష్యా-చైనా బంధం మరింత బలపడే అవకాశం ఉంది.
భారత్ అమెరికాకు దగ్గరవుతుంటే… రష్యా చైనాతో వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత పెంచే అవకాశం ఉంది.
భారత్ నిర్ణయాలను రష్యా దౌత్యపరంగా జాగ్రత్తగా పరిశీలిస్తోంది.
భారత్ దశాబ్దాలుగా ఒకే విదేశీ పాలసీని అనుసరిస్తోంది —
అదే ఎవరికీ వ్యతిరేకంగా గాని, పూర్తి అనుకూలంగా గాని ఎటువంటి నిర్ణయాలు తీసుకోదు. పరిస్థితి, ప్రయోజనాల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటుంది.
భారత దృష్టిలో చమురు కొనడం ఒక వ్యాపార నిర్ణయం
రష్యాతో స్నేహం ఒక వ్యూహాత్మిక నిర్ణయం
అమెరికాతో బంధం ఒక ఆర్థిక, అంతర్జాతీయ వ్యూహంలో భాగం మాత్రమే.
అయితే చమురు కొనుగోలుపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎందుకు ఒత్తిడి చేస్తున్నారు. .
ఉక్రెయిన్ యుద్ధం తర్వాత అమెరికా, పాశ్చాత్య దేశాలు రష్యాపై పెద్ద ఎత్తున ఆంక్షలు విధించాయి.
భారతదేశం రష్యా నుంచి ఎక్కువగా చమురు కొనుగోలు చేస్తే, ఆంక్షల ప్రభావం తగ్గిపోతుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భావిస్తున్నారు.
ఈ రకంగా రష్యా ఆదాయం తగ్గించాలన్నది ఆయన లక్ష్యం. చమురు విక్రయం రష్యాకు ప్రధాన ఆదాయం.
భారత్–చైనా లాంటి పెద్ద మార్కెట్లు రష్యా చమురును కొనకపోతే, యుద్ధం కొనసాగించే రష్యా ఆర్థిక శక్తి తగ్గుతుందని ట్రంప్ వ్యూహం .
అమెరికా ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద చమురు–గ్యాస్ ఉత్పత్తిదారుల్లో ఒకటి.
భారత్ లాంటి భారీ మార్కెట్ అమెరికా చమురును ఎక్కువగా కొంటే, అమెరికాకు ఆర్థిక ప్రయోజనాలు పెరుగుతాయి.
భారత్‌ను చైనాకు బలమైన ప్రత్యర్థిగా అమెరికా చూస్తోంది.
అందుకే భారత్ “అమెరికా కూటమి ” వైపు రావాలని, రష్యాకు దూరం చేయాలని చూస్తోంది.
భారత్ మాత్రం తన జాతీయ ప్రయోజనం చూసుకుంటోంది
చవకగా దొరికితే ఎక్కడి నుంచి అయినా కొనుగోలు చేస్తాము,
భారత ప్రజలకు, ఆర్థిక వ్యవస్థకు లాభం చేకూరుస్తుంది కనుకనే
రష్యా చమురును కొనడాన్ని ఆపడం లేదన్నది ప్రధాని మోదీ వాదన .
భారత్ రష్యా నుంచి చమురును కొనుగోలు ఆపేస్తే, రష్యా అధ్యక్షుడు పుతిన్ దృష్టిలో ఇది పెద్ద రాజకీయ–ఆర్ధిక సంకేతం. ఆయన ఇలా భావించే అవకాశం ఉంది.
రష్యా దృష్టిలో భారత్ ఒక విశ్వసనీయ మిత్రదేశం.
భారత్ అమెరికా ఒత్తిడి కారణంగా చమురు కొనుగోళ్లు ఆపేస్తే, పుతిన్ భారత్ అమెరికా కూటమికి దగ్గరవుతోందని భావించవచ్చు.
రష్యా చాలా ఏళ్లుగా భారత్‌కు ఆయుధాలు, ఇంధన రంగంలో సహాయం చేస్తోంది.
చమురు కొనుగోళ్లు పూర్తిగా ఆగితే, భారత్ కు మా మీద నమ్మకం లేకుండా పోయింది అని పుతిన్ భావించవచ్చు.
రష్యాకు చమురు ఎగుమతులే ప్రధాన ఆదాయం.
భారత్ లాంటి పెద్ద కొనుగోలుదారు వెనక్కి తగ్గితే, అది రష్యా ఆర్థిక వ్యవస్థకు నష్టం.
దీన్ని పుతిన్ అమెరికా చేసిన ఆర్థిక యుద్ధంలో భారత్ కూడా చేరింది అని భావించే అవకాశం ఉంది.
పుతిన్ దృష్టిలో భారత్ ఎప్పటి నుంచో స్వతంత్ర విదేశాంగం పాటిస్తున్న దేశం.
ఆ స్వతంత్రత దెబ్బతిన్నట్లుగా అతను అనుకోవచ్చు.
దీంతో రక్షణ, శక్తి, అంతరిక్ష వంటి రంగాల్లో రష్యా సహకారం తగ్గే అవకాశం కూడా లేకపోలేదు.
భారత్ రష్యా నుంచి దూరమైతే, పుతిన్ చైనాతో సంబంధాలను మరింత బలపరుచుకోడానికి ప్రయత్నిస్తాడు.
ఇది భారత్‌కు వ్యూహాత్మకంగా మంచి పరిణామం కాదు.
అమెరికా ఒత్తిడి కారణం ప్రధానంగా రష్యాపై ఆంక్షలు, భౌగోళిక-రాజకీయ వ్యూహం, తన స్వంత చమురు ఎగుమతుల ప్రయోజనం.
కానీ భారత్ ది మాత్రం స్వతంత్ర విదేశాంగ విధానం, చవక చమురు, ఇతర ప్రయోజనాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోదు .
అమెరికా నుంచి ఆయిల్ దిగుమతులు పెంచడం వలన రష్యా–ఇండియా స్నేహం పూర్తిగా దెబ్బతినే అవకాశాలు తక్కువ.
కానీ ప్రపంచ రాజకీయాలు సున్నితమైనవి. కొద్దికొద్దిగా ఒత్తిళ్లు రావచ్చు… అసంతృప్తి ఉండొచ్చు… కానీ భారత్ తన ప్రయోజనాలు, అవసరాలు దృష్టిలో పెట్టుకుని అన్ని వైపుల మంచి సంబంధాలు కొనసాగించే ప్రయత్నం చేస్తుంది.
ఇదే భారత్ విదేశాంగ విధానానికి ఉన్న బలం.

