CM Chandrababu: ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 15వ ఎస్‌ఐపీబీ సమావేశం: రూ.29,018 కోట్ల పెట్టుబడులకు ఆమోదం.. 22,407 మందికి ఉపాధి అవకాశాలు
రూ.29,018 కోట్ల పెట్టుబడులకు ఆమోదం.. 22,407 మందికి ఉపాధి అవకాశాలు
CM Chandrababu: రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు వేగం పెంచాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో బుధవారం జరిగిన 15వ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్‌ఐపీబీ) సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఐటీ, విద్యుత్, పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్, మౌలిక సదుపాయాల రంగాల్లో 27 ప్రాజెక్టుల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. ఈ ప్రాజెక్టుల ద్వారా రూ.29,018 కోట్ల పెట్టుబడులు రాష్ట్రంలోకి వచ్చే అవకాశం ఉంది. వీటి వల్ల 22,407 మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయని అంచనా.
సమావేశంలో మంత్రులు పి.నారాయణ, టీజీ భరత్, అనగాని సత్యప్రసాద్, నారా లోకేశ్, విజయానంద్, అచ్చెన్నాయుడు, గొట్టిపాటి రవికుమార్, బీసీ జనార్దన్‌రెడ్డి, కందుల దుర్గేష్ తదితరులు పాల్గొన్నారు.
సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, గూగుల్, అర్సెలార్ మిత్తల్, బీపీసీఎల్ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థల మెగా ప్రాజెక్టులు త్వరగా ఏర్పడాలని, వాటికి ప్రభుత్వం నుంచి ఎలాంటి అడ్డంకులు రాకుండా చూడాలని ఆదేశించారు. భూములు కేటాయించినా నిర్ణీత సమయంలో పనులు ప్రారంభించని సంస్థలతో సంప్రదింపులు జరిపి, అవసరమైతే భూములు వెనక్కి తీసుకోవాలని సూచించారు. ప్రతి ఒప్పందం వేగంగా అమలవ్వాలనేదే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
ఇప్పటివరకు 15 ఎస్‌ఐపీబీ సమావేశాల్లో రూ.9,03,726 కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించిందని, వాటి ద్వారా 8,58,082 మందికి ఉపాధి కలుగుతుందని సీఎం తెలిపారు.
సెమీకండక్టర్ ప్రాజెక్టులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు
సెమీకండక్టర్ రంగంలో ప్రాజెక్టులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు సీఎం ప్రకటించారు. సొంత భూముల్లో ప్రాజెక్టులు ఏర్పాటు చేసుకునేవారికి అదనపు సౌకర్యాలు కల్పించే విషయం పరిశీలనలో ఉందన్నారు. ఎన్నారైలను పెట్టుబడులకు ఆహ్వానించాలని సూచించారు.
విశాఖలో ఐకానిక్ 'భారత్ మండపం'
విశాఖపట్నంలో 'భారత్ మండపం' ఐకానిక్‌గా తీర్చిదిద్దాలని, దేశంలోనే అత్యుత్తమ కన్వెన్షన్ సెంటర్‌గా నిలవాలని సీఎం ఆదేశించారు. ప్రతి జిల్లాలో శిల్పారామాలు ఏర్పాటు చేయాలి. కాకినాడ, ఏలూరు వంటి ప్రాంతాల్లో హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్లు పెంచాలి. విశాఖ, అమరావతి, తిరుపతి రీజియన్లుగా పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలి. సూర్యలంక, పోలవరం, పులికాట్, గండికోట, శ్రీశైలం, మదనపల్లె హార్స్‌లీ హిల్స్ వంటి క్లస్టర్లలో షాపింగ్ మాల్స్, హోటళ్లు ఏర్పాటు చేసి పర్యాటకులను ఆకర్షించాలి. క్రీడా నగరం, క్రియేటివ్ సిటీ, ఎకో సిస్టమ్, హెల్త్ టూరిజం, హాస్పిటాలిటీలో డీమ్డ్ యూనివర్సిటీలు ప్రోత్సహించాలి. ఆక్వా రంగంలో విలువ ఆధారిత ఉత్పత్తులు పెంచి అమెరికాకు ఎగుమతులు పెంచాలి. డెయిరీ, పౌల్ట్రీ, లైవ్‌స్టాక్, మాంస ఎగుమతులు పెరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
నైపుణ్యం పోర్టల్‌తో ఉద్యోగ వివరాలు
రాష్ట్రంలో లభించిన ఉద్యోగాల వివరాలను నైపుణ్యం పోర్టల్‌తో అనుసంధానం చేయాలని సీఎం ఆదేశించారు. రియల్ టైంలో అప్‌డేట్ చేసి, ఎన్ని ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయో తెలియజేయాలి. ఎస్‌ఐపీబీ ఆమోదించిన ప్రాజెక్టులు, విశాఖ భాగస్వామ్య సదస్సులో కుదిరిన ఒప్పందాల ప్రారంభ తేదీలు స్పష్టంగా పేర్కొనాలి. విజయవాడ, విశాఖ, తిరుపతిలో ఈవీ ఛార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు.
ఈ సమావేశం రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి కీలకమైన అడుగుగా మారనుంది.