AU Vice-Chancellor Prasada Reddy: ఏయూ మాజీ వీసీ ప్రసాదరెడ్డిపై సస్పెన్షన్ సిఫారసు.. నిధుల దుర్వినియోగంపై విజిలెన్స్ నివేదిక
నిధుల దుర్వినియోగంపై విజిలెన్స్ నివేదిక
AU Vice-Chancellor Prasada Reddy: వైకాపా ప్రభుత్వ హయాంలో విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ (ఏయూ) వీసీగా అనేక అరాచకాలకు, అధికార దుర్వినియోగానికి పాల్పడిన పీవీజీడీ ప్రసాదరెడ్డిని తక్షణం సస్పెండ్ చేయాలని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఆయన హయాంలో జరిగిన నిధుల దుర్వినియోగంతో పాటు అక్రమాస్తులపై ఏసీబీ దర్యాప్తు జరిపించాలని, క్రిమినల్ చర్యలు చేపట్టాలని నివేదికలో సూచించింది.
2019-24 మధ్య వైకాపా ప్రభుత్వ పెద్దల అండతో రాజ్యాంగేతర శక్తిలా వ్యవహరించిన ప్రసాదరెడ్డి అక్రమాల్ని విజిలెన్స్ విభాగం నిగ్గుతేల్చింది. ఆయన తన పదవీకాలంలో దాదాపు వైకాపా కార్యకర్తలా పనిచేశారని, యూనివర్సిటీని వైకాపా కార్యాలయంలా, రాజకీయ కార్యకలాపాలకు వేదికగా మార్చేశారన్న విమర్శలు వచ్చాయి. జీవీఎంసీ ఎన్నికల్లో పోటీ చేసే వైకాపా కార్పొరేటర్ అభ్యర్థుల్ని ఎంపిక చేయడంతో పాటు ప్రచార వ్యూహాలు వీసీ కార్యాలయం కేంద్రంగానే నడిచాయని, విద్యార్థులతో సర్వేలు చేయించారని ఆరోపణలు ఉన్నాయి. ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసేందుకు కళాశాలల అధ్యాపకులతో నిర్వహించిన సమావేశంలోనూ ప్రసాదరెడ్డి పాల్గొన్న వీడియోలు బయటకొచ్చాయి.
మాజీ వీసీ ప్రసాదరెడ్డి, మరో 44 మందిపై 21 ఫిర్యాదులు వచ్చాయి. ప్రధానంగా నిధుల దుర్వినియోగం, దొడ్డిదారి నియామకాలు, నిబంధనలకు విరుద్ధంగా ప్రవేశాలు, భవన నిర్మాణాల్లో అక్రమాలు, ఆదాయానికి మించిన ఆస్తులు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారం వంటి తీవ్ర అభియోగాలు ఉన్నాయి.
వీసీగా ప్రసాదరెడ్డి నిబంధనల్ని అతిక్రమించి తీసుకున్న నిర్ణయాల వల్ల రూ.10.60 కోట్ల మేర అవకతవకలు జరిగాయని విజిలెన్స్ గుర్తించింది. అంబేడ్కర్ అధ్యయన కేంద్రం ప్రొఫెసర్‌గా నియమించిన జేమ్స్ స్టీఫెన్‌కు వేతనం, అలవెన్స్‌ల కింద రూ.1.10 కోట్లు చెల్లించారు. సెక్యూరిటీ, బోధనేతర సిబ్బంది, పదవీ విరమణ చేసిన ఉద్యోగులను నిబంధనలకు విరుద్ధంగా నియమించి రూ.3.34 కోట్లు అక్రమంగా చెల్లించారు. హోర్డింగ్‌లు, గ్రౌండ్ అద్దెలో నిబంధనలు పాటించకపోవడంతో వర్సిటీకి రూ.2.32 కోట్ల నష్టం వాటిల్లింది.ప్రసాదరెడ్డితో పాటు వి.కృష్ణమోహన్, మేకా జేమ్స్ స్టీఫెన్, కె.బసవయ్య, కె.శ్రీనివాసరావు తదితరులపై భారత న్యాయ సంహితలోని వివిధ సెక్షన్ల కింద క్రిమినల్ చర్యలు చేపట్టాలని, దుర్వినియోగం చేసిన నిధుల్ని రికవరీ చేయాలని విజిలెన్స్ సిఫారసు చేసింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వీసీ పదవికి ప్రసాదరెడ్డి రాజీనామా చేశారు. తాజాగా నివేదిక రావడంతో ఆయనపై చర్యలకు ప్రభుత్వం ఉపక్రమిస్తోంది. ఆయన శుక్రవారం పదవీ విరమణ చేయనున్నారు.