Pawan Kalyan: రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో రెండున్నరేళ్ల కాలంలో 20,600 కిలోమీటర్ల పొడవున రోడ్ల నిర్మాణం చేపట్టినట్లు ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ వెల్లడించారు. ఇందులో 10 వేల కి.మీ. తారు రోడ్లు, 9,600 కి.మీ. సిమెంట్‌ రోడ్లు ఉన్నాయని ఆయన తెలిపారు.

గిరిజన గ్రామాలకు అడవి తల్లి బాట పథకం కింద వెయ్యి కి.మీ.కు పైగా రోడ్డు సౌకర్యం కల్పించామని పవన్‌కల్యాణ్‌ బుధవారం ‘ఎక్స్‌’లో పోస్టు చేస్తూ పేర్కొన్నారు. అన్నదాతలకు అండగా 1.15 లక్షల పంట కుంటలు నిర్మించినట్లు, గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా రెండు లక్షల ఎకరాల్లో పండ్ల తోటల పెంపకానికి రైతులకు సహాయం అందించినట్లు ఆయన వివరించారు. పాడి రైతుల కోసం 38 వేల మినీ గోకులాలు, 15 వేల నీటి తొట్టెలు నిర్మించినట్లు కూడా తెలిపారు.

ఏడున్నర దశాబ్దాలుగా రోడ్డు సౌకర్యం లేని మారుమూల గ్రామాలకు తొలిసారి రహదారి అందుబాటులోకి వచ్చిందని పవన్‌కల్యాణ్‌ స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో విగ్రహాల ధ్వంసంతో అపవిత్రమైన రామతీర్థంలో భక్తుల సౌకర్యార్థం ఉపాధి హామీ పథకం ద్వారా రోడ్డు నిర్మించినట్లు పేర్కొన్నారు. అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రం, కోటప్పకొండ, ఐఎస్‌ జగన్నాథపురం వంటి వందలాది పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తుల ప్రయాణ సౌకర్యం మెరుగుపరచేందుకు రోడ్లు వేసినట్లు కూడా ఆయన వెల్లడించారు.

రోడ్ల నిర్మాణానికి సంబంధించిన ఫోటోలను కూడా పవన్‌కల్యాణ్‌ తన పోస్టులో జతచేశారు.

Tags: