AP Alliance Government: కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన సూపర్-6 హామీలను అమలు చేస్తూనే అభివృద్ధి రంగంలోనూ వేగంగా ముందుకు సాగుతోంది. గడిచిన 40-45 రోజుల్లో సుమారు రూ.2.12 లక్షల కోట్ల విలువైన భారీ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిగాయి. సామాజిక పింఛన్లు, మత్స్యకారుల సేవలో, నేతన్నకు చేయూత వంటి సంక్షేమ కార్యక్రమాలతో పాటు పల్లెపండుగ 3.0, మూడు లక్షల ఇళ్ల నిర్మాణం వంటి భారీ కార్యక్రమాల ద్వారా రాష్ట్ర ప్రగతికి బాటలు వేస్తోంది.

సాగునీటి రంగంలో ముఖ్యమైన పురోగతి సాధించింది. వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1ను ఆగస్టు 31న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. దీనివల్ల ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని కరవు ప్రాంతాల్లో 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. శ్రీశైలం నుంచి నల్లమలసాగర్‌కు కృష్ణా జలాలు చేరాయి. పోలవరం ఎడమ కాలువ ద్వారా ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను తీసుకెళ్లారు. అనకాపల్లి వద్ద నీటిని విడుదల చేయడంతో 4 లక్షల ఎకరాలకు సాగునీరు, 9.23 లక్షల ఎకరాలకు తాగునీరు అందనుంది.

రాయలసీమను ‘ఫ్రూట్ బౌల్ ఆఫ్ ది వరల్డ్’గా మార్చే ఉద్యాన హబ్ ప్రాజెక్టుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నమయ్య జిల్లా మదనపల్లెలో శంకుస్థాపన చేశారు. రూ.లక్ష కోట్లతో 10 జిల్లాల్లో అమలయ్యే ఈ ప్రాజెక్టు ద్వారా అదనంగా 6 లక్షల హెక్టార్లలో ఉద్యాన పంటలు విస్తరించి 9.6 లక్షల రైతులకు ప్రయోజనం, 49 లక్షల కుటుంబాలకు ఉపాధి అవకాశాలు కలుగుతాయి.

గ్రామీణ అభివృద్ధికి రూ.11,085 కోట్లతో పల్లెపండుగ 3.0ను నెల్లూరు జిల్లా ఉదయగిరిలో ప్రారంభించారు. 15,500 కి.మీ. రోడ్లు, మినీ గోకులాలు, మ్యాజిక్ డ్రెయిన్లు, బస్ షెల్టర్లు, పంచాయతీ భవనాలు వంటి పనులు చేపడతారు. ప్రతి గడపకు తాగునీరందించే లక్ష్యంతో ‘అమరజీవి జలధార’ పేరుతో జల్ జీవన్ మిషన్ 2.0ను రూ.30,156 కోట్లతో ప్రారంభించి మరో 27 లక్షల గ్రామీణ కుటుంబాలకు కుళాయి కనెక్షన్లు అందించనున్నారు.

నగరాలు, పట్టణాల్లో దశాబ్దాలుగా ప్రభుత్వ స్థలాల్లో నివసిస్తున్న పేద కుటుంబాలకు ‘పేదలకు పట్టాభిషేకం’ కార్యక్రమంలో విశాఖపట్నం, విజయవాడ, మంగళగిరిల్లో 60,646 మందికి పట్టాలు అందించారు. వీటి మార్కెట్ విలువ రూ.52,000 కోట్లు. 2029 నాటికి అర్హులందరికీ సొంతిల్లు అందించాలనే లక్ష్యంతో పీఎంఈవై-గ్రామీణ్ 2.0ను తెనాలిలో ప్రారంభించి 3 లక్షల ఇళ్లు (రూ.7,170 కోట్లు) నిర్మించనున్నారు. 123 నగరాలు, పట్టణాల్లో రూ.11,359 కోట్లతో రోడ్లు, డ్రెయిన్లు వంటి మౌలిక వసతులకు శంకుస్థాపన జరిగింది.

పాన్ ఐఐటీ అలుమ్ని సదస్సులో రూ.500 కోట్ల వెంచర్ కేపిటల్ ఫండ్ ఏర్పాటు, ప్రధాన మంత్రి ఆయుష్మాన్ భారత్ కింద 10 క్రిటికల్ కేర్ బ్లాక్‌లు, 12 ఇంటిగ్రేటెడ్ ల్యాబొరేటరీల ప్రారంభం, ఫ్రీహోల్డ్ భూముల రిజిస్ట్రేషన్‌పై నిషేధం ఎత్తివేత, ప్రభుత్వ ఉద్యోగులకు 12వ వేతన సవరణ సంఘం నియామకం, రిలయన్స్‌తో కలిసి మదనపల్లెలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్‌కు శంకుస్థాపన వంటి చర్యలు కూడా జరిగాయి.

సంక్షేమంతోపాటు అభివృద్ధిని సమాంతరంగా కొనసాగిస్తూ రాష్ట్రాన్ని ముందుకు నడిపించే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

Tags: