CM Chandrababu: స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని చోట్లా కూటమి అభ్యర్థుల్ని గెలిపిస్తే రాష్ట్రంలో ట్రిపుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ (కేంద్రం, రాష్ట్రం, స్థానిక సంస్థలు) ఏర్పడుతుందని, అప్పుడు అభివృద్ధి మరింత వేగవంతమవుతుందని ముఖ్యమంత్రి ఎన్‌. చంద్రబాబు నాయుడు అన్నారు.

వైఎస్సార్‌ కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లిలో సోమవారం జల జీవన్‌ మిషన్‌-అమరజీవి జలధార 2.0 పనుల ప్రారంభోత్సవ సభలో ఆయన మాట్లాడారు. ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి. మాధవ్‌తో కలిసి ప్రాజెక్టు పైలాన్‌ను ఆవిష్కరించారు.

2024 అసెంబ్లీ ఎన్నికల్లో 57 శాతం ఓట్లు, 164 సీట్లు ఇచ్చి ప్రజలు డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ను ఏర్పాటు చేశారని చంద్రబాబు గుర్తు చేశారు. “నిరంతరం ప్రజల బాగోగులు ఆలోచించి పనిచేస్తున్నాం. స్థానిక ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థుల్ని గెలిపించి రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలి” అని కోరారు.

రూ.30,156 కోట్లతో 90 లక్షల కుటుంబాలకు తాగునీరు అందించే అమరజీవి జలధార ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి గ్రామానికి శాశ్వత నీటి వనరు ఏర్పాటు చేసి, ప్రతి ఇంటికి కుళాయి ద్వారా రక్షిత తాగునీరు అందిస్తామని తెలిపారు.

వైకాపా ప్రభుత్వం జల జీవన్‌ మిషన్‌ను నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. “ఐదేళ్ల పాటు చేసిన విధ్వంసానికి పల్లెలు కన్నీరు పెట్టుకునే పరిస్థితి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌ రూ.లక్ష కోట్లు, రాజస్థాన్‌ రూ.85 వేల కోట్లు, మధ్యప్రదేశ్‌ రూ.83 వేల కోట్లు, కర్ణాటక రూ.63 వేల కోట్లు, అస్సాం రూ.34 వేల కోట్లు ఖర్చు పెట్టగా.. వైకాపా హయాంలో ఆంధ్రప్రదేశ్‌లో రూ.2,600 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఐదేళ్లు అధికారంలో ఉన్న వైకాపా రాయలసీమకు, ముఖ్యంగా కడపకు ఏం చేశారు?” అని నిలదీశారు.

రౌడీ రాజకీయాలు, రప్పారప్పా రాజకీయాలు వద్దని స్పష్టం చేశారు. “కులాలు, మతాలు కాదు.. రాయలసీమ అభివృద్ధే ముద్దు. రాయలసీమకు శాంతి, నీరు, పరిశ్రమలు, ఉద్యానం, ఉపాధి కావాలి. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా రాయలసీమ రైజింగ్‌ను అడ్డుకోలేరు. కరవు సీమను రతనాల సీమగా చేస్తాం” అన్నారు. గోదావరి-కావేరి అనుసంధానం జరిగితే బనకచర్ల, శ్రీశైలానికి నీరు చేరుతుందని, రాబోయే రోజుల్లో రాయలసీమను ఫైటర్‌ జెట్లు, విమానాలు తయారు చేసే ప్రాంతంగా మారుస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు.

ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ గ్రామీణాభివృద్ధిలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని ప్రశంసించారు. 2024 ఆగస్టు 23న 13,326 పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించి రికార్డు సృష్టించారని, 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.4,136 కోట్లు నేరుగా పంచాయతీలకు విడుదల చేయించారని వివరించారు. గ్రామీణాభివృద్ధిలో రాష్ట్రానికి 13 జాతీయ అవార్డులు దక్కాయని చెప్పారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ఐదేళ్లలో రూ.1.30 లక్షల కోట్లు ఖర్చు చేస్తామని, ప్రతి ఇంటిపై సోలార్‌ రూఫ్‌టాప్‌ ఏర్పాటు చేసి ఉచిత ఇండక్షన్‌ స్టవ్‌ ఇస్తామని హామీ ఇచ్చారు.

“ప్రతి కుటుంబానికి సొంత ఇంటి స్థలం, పక్కా ఇల్లు ఉండాలి. ఇంటింటికీ కుళాయి ద్వారా సురక్షిత తాగునీరు అందాలి” అనేదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

Tags: