Veligonda Project: 30 ఏళ్ల సంకల్పం సాకారం.. ఆగస్టు 31న వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభం
వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభం
Veligonda Project: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెలిగొండ ప్రాజెక్టుపై కీలక ప్రకటన చేశారు. ఈ నెల 31న వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. 30 ఏళ్ల క్రితం తాను తీసుకున్న సంకల్పం ఇప్పుడు నెరవేరిందంటూ ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేశారు.
“వెలిగొండ జలసిరులు-అభివృద్ధికి రెక్కలు” అంటూ ట్వీట్ చేసిన సీఎం, 1996 మార్చి 5న వెలిగొండకు శంకుస్థాపన చేసిన ఫొటోను కూడా జతచేశారు. ఎన్నో అవాంతరాలు, సవాళ్లను అధిగమించి భగీరథ ప్రయత్నంతో వెలిగొండ ఫేజ్-1ను పూర్తి చేసి కరవు నేలకు కృష్ణమ్మ జలాలను అందించబోతున్నామని చెప్పారు. మూడు దశాబ్దాల తర్వాత ఈనెల 31న ప్రాజెక్టును ప్రారంభించబోతున్నట్లు సీఎం తెలిపారు.
వెలిగొండ ఫేజ్-1 ద్వారా 1.19 లక్షల ఎకరాలకు, ఫేజ్-2తో 3.283 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు లక్షలాది మందికి తాగునీరు అందించడమే లక్ష్యమని సీఎం పేర్కొన్నారు. ఈ నెల 31న 10.7 టీఎంసీల నీటిని నల్లమల సాగర్‌కు విడుదల చేయనున్నామని తెలిపారు. పశ్చిమ ప్రకాశం ప్రాంతానికి సాగునీరు, తాగునీటి సమస్యలకు పరిష్కారం లభిస్తుందని, అలాగే ఇంటింటికీ కుళాయి ద్వారా స్వచ్ఛమైన తాగునీరు అందించి ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.
మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేసి పశ్చిమ ప్రకాశం ప్రజల ఆకాంక్షను నెరవేర్చామని చంద్రబాబు అన్నారు. రాయలసీమ, ఉమ్మడి ప్రకాశం ప్రాంతాలను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు రూ.లక్ష కోట్ల పెట్టుబడులతో త్వరలో పనులు ప్రారంభిస్తామని, బెంగళూరు-అమరావతి హైవే, రామాయపట్నం పోర్టుతో వాణిజ్య, పారిశ్రామిక అభివృద్ధికి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. ప్రతి రైతు పొలానికి నీరు, ప్రతి యువకుడికి ఉపాధి, ప్రతి కుటుంబానికి భరోసా కల్పించాలన్నదే తన సంకల్పమని సీఎం చెప్పారు. వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభంతో ఈ ప్రాంత అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.