SEC Chief Anil Chandra Punetha: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ పేరుతో సోషల్ మీడియా, వాట్సాప్‌లో వైరల్‌ అవుతున్న వార్తలు పూర్తిగా నకిలీవని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) అనిల్‌ చంద్ర పునేఠా స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం ప్రకటన విడుదల చేశారు.

స్థానిక ఎన్నికల తేదీలు, షెడ్యూల్‌ పేరుతో తప్పుడు సమాచారం వ్యాప్తి చెందుతోందని, అధికారిక గుర్తులు, లోగోలను కొందరు దుర్వినియోగం చేస్తున్నారని ఎస్‌ఈసీ తెలిపారు. ఈ ప్రచారం నిజమా? కాదా? అని వివరణ కోరుతూ వివిధ వర్గాల నుంచి ఎన్నికల కమిషన్‌ కార్యాలయానికి పెద్ద ఎత్తున ఫోన్‌ కాల్స్‌ వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

“వాట్సాప్‌లో వస్తున్న ఎన్నికల తేదీలు, షెడ్యూల్‌లో ఎలాంటి వాస్తవం లేదు. అవి పూర్తిగా ఫేక్‌. వాటిని నమ్మొద్దు. ఇతరులకు ఫార్వర్డ్‌ చేయొద్దు” అని అనిల్‌ చంద్ర పునేఠా హెచ్చరించారు. అధికారిక అనుమతి లేకుండా ఎన్నికల సంఘం పేరు, లోగోను ఉపయోగించడం చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు.

ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేసేవారిపై సైబర్‌ చట్టాల కింద కఠిన చర్యలు తీసుకుంటామని, ఫేక్‌ షెడ్యూల్‌ను షేర్‌ చేసేవారిపై కేసులు నమోదు చేస్తామని ఎస్‌ఈసీ హెచ్చరించారు. స్థానిక ఎన్నికలకు సంబంధించిన సమాచారం కేవలం అధికారిక ప్రకటనలు, పత్రికా ప్రకటనలు లేదా మీడియా సమావేశాల ద్వారానే విడుదల అవుతుందని ఆయన సూచించారు.

రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు అనధికారిక సమాచారాన్ని విశ్వసించవద్దని, సోషల్ మీడియా వార్తలను అధికారికంగా పరిగణించొద్దని ప్రజలు, మీడియాకు ఎస్‌ఈసీ సూచన చేశారు. ఎన్నికల సంఘం అధికారిక సమాచారాన్నే ఆధారంగా తీసుకోవాలని ఆయన కోరారు.

Tags: