Nadendla Manohar: 5 కేజీ సిలిండర్లు త్వరలో.. కిరోసిన్ పంపిణీకి సన్నాహాలు: పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్
పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్
Nadendla Manohar: గ్రామీణ ప్రాంతాల్లో ఎల్‌పీజీ సిలిండర్ల డెలివరీలో జాప్యం ఉండకూడదని, ప్రజలకు ఇబ్బంది కలగకుండా నిరంతరం సమీక్షించాలని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులను సూచించారు. గ్యాస్ సిలిండర్లను పక్కదారి పట్టించి మార్కెట్‌లో అక్రమంగా అమ్ముతున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
బుధవారం కమిషనరేట్ నుంచి జిల్లా సంయుక్త కలెక్టర్లు, పౌర సరఫరాల శాఖ అధికారులు, ఆయిల్ సంస్థలు, గ్యాస్ ఏజెన్సీల ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి మనోహర్ సమీక్ష నిర్వహించారు. “గ్రామాల్లో సిలిండర్ల బుకింగ్‌లు, డెలివరీలను రోజూ అప్‌డేట్ చేసే వ్యవస్థ త్వరగా అందుబాటులోకి రావాలి. ఎల్‌పీజీ ఏజెన్సీలతో సంయుక్త కలెక్టర్లు నిత్యం సమన్వయం చేసుకోవాలి” అని ఆయన స్పష్టం చేశారు.
కేంద్ర ప్రభుత్వం గ్యాస్ కొరతను అధిగమించడానికి 5 కేజీల సిలిండర్ల పంపిణీకి చర్యలు తీసుకుంటోందని మంత్రి తెలిపారు. అవసరమైనవారికి మార్గదర్శకాల ప్రకారం ఈ చిన్న సిలిండర్లను అందించాలని అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా, కిరోసిన్ సరఫరా కూడా కేంద్రం సిద్ధంగా ఉందని, పాడేరు వంటి ప్రాంతాల్లో కిరోసిన్ అవసరం ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. ఇతర ప్రాంతాల్లో కూడా అవసరాన్ని గుర్తించి తక్షణం పంపిణీకి చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఖరీఫ్ సీజన్‌లో రికార్డు స్థాయిలో ధాన్యం సేకరణ జరిగిందని, రబీ సీజన్‌లో కూడా అదే స్థాయి సాధించాలని మంత్రి అధికారులను కోరారు. అకాల వర్షాలు పడే అవకాశం ఉన్న ప్రాంతాల్లో ధాన్యం సేకరణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని ఆదేశించారు.