Pemmasani: తెలుగు రాష్ట్రాలకు 5 లక్షల ఇళ్లు.. ఏపీకి 3 లక్షలు, తెలంగాణకు 2 లక్షలు: పెమ్మసాని
పెమ్మసాని
Pemmasani: ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం 5 లక్షల ఇళ్లు కేటాయించినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌కు 3 లక్షలు, తెలంగాణకు 2 లక్షల ఇళ్లు కేటాయించినట్లు వెల్లడించారు.
2024లో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత చేసిన కేటాయింపుల కంటే ఏపీకి అదనంగా 2.25 లక్షలు, తెలంగాణకు 1.25 లక్షల ఇళ్లు మంజూరు చేశామని పేర్కొన్నారు. గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి తెలుగు రాష్ట్రాలకు ఇంత పెద్ద మొత్తంలో కేటాయించడం ఇదే తొలిసారని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ, శివరాజ్ సింగ్ చౌహాన్‌కి ధన్యవాదాలు తెలిపారు.
2019-24 మధ్య ఏపీకి 1.78 లక్షల ఇళ్లు కేటాయించగా కేవలం 42 వేలు మాత్రమే పూర్తయ్యాయని, తెలంగాణ ఆ కాలంలో పథకంలో చేరలేదని వివరించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేయడంతో అడిగిన దానికంటే ఎక్కువగా మంజూరు చేశామని అన్నారు.
ఒక్కో ఇంటి నిర్మాణానికి కేంద్రం రూ.1.20 లక్షల ప్రాథమిక సాయం అందిస్తుందని, అదనపు సాయంతో దాదాపు రూ.1.80 లక్షల వరకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు. స్వచ్ఛ భారత్ కింద మరుగుదొడ్డికి రూ.12 వేల సహాయం ఉంటుందన్నారు. ఆవాస్ ప్లస్ యాప్‌తో పారదర్శకంగా ఎంపిక, జియో ట్యాగింగ్‌తో సెల్ఫ్ సర్వే సదుపాయం కల్పించామని చెప్పారు. ఆదాయ పరిమితిని రూ.10 వేల నుంచి 15 వేలకు పెంచి, మోటార్ బైక్, ఫ్రిజ్ ఉన్నా అర్హత కోల్పోకుండా సవరణలు చేశామని పెమ్మసాని వెల్లడించారు.