కలెక్టర్ కు అర్జీ ఇచ్చిన 4వ తరగతి విద్యార్థి
ఆధికారుల చర్యతో ఆ బాలుడి కుటుంబం రోడ్డున పడుతోంది. జీవనోపాధి కోల్పోతుండటంతో ఆ తల్లి ఆత్మవిశ్వాసం కోల్పోయి ఆత్మహత్యకు సిద్దపడుతోంది. జరుగుతున్న పరిణామాలు చూసి ఆ చిన్నారి మనసు అల్లకల్లోలంగా తయారవుతోంది. అయినా ఆ తొమ్మిదేళ్ళ బాలుడు ఆధైర్య పడలేదు. ఎలాగైనా తన తల్లి చిరువ్యాపారం నిలబెట్టాలనుకున్నాడు. ఒక కాయితం మీద తన కుటుంబం ఎదుర్కొంటున్న సమస్యను రాసుకున్నాడు. అది పట్టుకుని కలెక్టర్ ని కలవడానికి వెళ్ళాడు. ఆసక్తికరమైన ఈ సంఘటన గుంటూరు జిల్లాలో జరిగింది. నాలుగొవ తరగతి చదువుతున్న తొమ్మిదే్ళ చిన్నారి యశ్వంత్ తల్లి అలవాల రాధిక గుంటూరు ప్రభుత్వాసుపత్రి ఎమర్జెన్సీ విభాగం గేటు వద్ద టిఫిన్ బండి పెట్టుకుని జీవనం సాగిస్తోంది. అయితే రోడ్డు విస్తరణలో భాగంగా అధికారులు రాధిక బండిని అక్కడ నుంచి తొలగించాల్సి వచ్చింది. దీంతో ఉపాధి కోల్పోయి కుటుంబం రోడ్డున పడటంతో రాధిక తీవ్రంగా కలత చెందింది. మరో పక్క కుమారుడు యశ్వంత్ గుండె జబ్బుతో బాధపడుతున్నాడు. అతనికి 16 సంవత్సరాలు వచ్చిన తరువాతే ఆపరేషన్ చేయాలని డాక్టర్లు చెపుతున్నారు. ఈ పరిస్ధితుల్లో మానసికస్ధైర్యం కోల్పోయిన రాధిక ఇక మనం బతకలే, చనిపోదాం అని పదే పదే కొడు వద్ద ప్రస్తావించేది. దీంతో ఏంచేయాలో ఆ చిన్నారికి పాలుపోయేది కాదు. చివరికి గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మి వద్దకు వెళ్లి తమ కుటుంబ పరిస్ధితులను వివరిస్తూ అర్జీ పెట్టుకున్నాడు. సోమవారం గ్రీవెన్స్ సెల్ ఉండటంతో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల మధ్యలో 9 సంవత్సరాల చిన్నారి యశ్వంత్ కూడా ఒక కాగితం పట్టుకుని నిలబడి ఉన్నాడు. ఆ బాలుడిని చూసిన విలేకరులు అతన్ని కలెక్టర్ వద్దకు తీసుకుని వెళ్ళారు. యశ్వంత్ చెప్పిన వివరాలు విని వెంటనే స్పందించి కలెక్టర్ ఆమెకు జీజీహెచ్ ఎదుట టిఫిన్ బండి పెట్టుకోవడానికి స్ధలం చూపించమని అధికారులను ఆదేశించారు. అధికారలు కూడా వెంటనే రాధికకు టిఫిన్ బండిపెట్టుకోవడానికి స్ధలం చూపించారు.