Comptroller and Auditor General (CAG): పర్యావరణ నిబంధనలు పట్టించుకోని గనుల తవ్వకాలు – జరిమానాలు వద్దన్న వాదనలు

జరిమానాలు వద్దన్న వాదనలు

Update: 2026-03-07 06:51 GMT

Comptroller and Auditor General (CAG): పర్యావరణ అనుమతులు (ఈసీలు) లేకుండానే గనుల లీజుదారులు ఖనిజాలను తవ్వి తరలించినా అధికారులు కన్నెత్తి చూడలేదు. ఉల్లంఘనలకు పాల్పడిన వారికి విధించిన జరిమానాలను ప్రభుత్వం పునఃసమీక్షలో భారీగా తగ్గించడం గమనార్హం. గనుల శాఖలో జరిగిన ఈ నిర్లక్ష్యాలను కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తన నివేదికలో తీవ్రంగా పరిగణించింది. 2017-18 నుంచి 2021-22 వరకు గనుల శాఖపై కాగ్ నివేదికను శాసనసభలో శుక్రవారం పట్టికపై ఉంచారు. ఇందులో శాఖ అధికారుల తప్పిదాలను కాగ్ వివరంగా ఎత్తిచూపింది.

అనుమతి లేకుండా తవ్వకాలు.. చర్యలు సున్నా

ఏడు గనుల శాఖ సహాయ డైరెక్టర్ (ఏడీ) కార్యాలయాల పరిధిలో 2017 నుంచి 2022 వరకు 159 లీజుదారులు పర్యావరణ అనుమతులు లేకుండానే ఖనిజాలను తవ్వి రవాణా చేసినట్లు తేలింది. ఈ ఉల్లంఘనలకు రూ.254.15 కోట్ల జరిమానాలు విధించాల్సి ఉండగా, అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విస్మయకరం. పర్యావరణ అనుమతి లేకుండా ఖనిజాల రవాణాకు అనుమతించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కాగ్ సిఫార్సు చేసింది.

జరిమానాల తగ్గింపు.. కారణాలు లేకుండానే

లీజుదారులు నిబంధనలు ఉల్లంఘించినప్పుడు విధించే జరిమానాలను పునఃసమీక్షించే అధికారం ప్రభుత్వానికి ఉంది. అయితే, సరైన కారణాలు ఉంటే మాత్రమే ఆ తగ్గింపు జరగాలి. కానీ, 31 కేసుల్లో రూ.84.18 కోట్ల జరిమానాలను ఎలాంటి ఆధారాలు లేకుండానే రూ.9.85 కోట్లకు తగ్గించారు. ఈ తప్పిదానికి సంబంధిత అధికారులను బాధ్యులను చేయాలని కాగ్ సూచించింది.

లీజు దరఖాస్తులు అందిన 75 రోజుల్లోపు లెటర్ ఆఫ్ ఇంటెంట్ (ఎల్‌ఓఐ) జారీ చేయాలన్న నియమం ఉన్నప్పటికీ, అనేక దరఖాస్తులు ఏళ్ల తరబడి పెండింగ్‌లోనే ఉన్నాయి. రెవెన్యూ శాఖ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు రాకపోవడం వల్ల ఎనిమిది ఏడీ కార్యాలయాలు, నాలుగు డిప్యూటీ డైరెక్టర్ (డీడీ) కార్యాలయాల పరిధిలో 1,348 దరఖాస్తులు నిలిచిపోయాయి.

మెరిట్ నిధుల్లో తక్కువ వసూళ్లు

2017-22 కాలంలో చిన్నతరహా ఖనిజాలపై సీనరేజ్ ఫీజుల ద్వారా రూ.6,367 కోట్లు వసూలు చేశారు. ఇందులో 2 శాతం మొత్తం అంటే రూ.127.37 కోట్లు మైనరల్ ఎక్స్‌ప్లోరేషన్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ట్రస్ట్ (మెరిట్)కు జమ కావాలి. అయితే, అధికారులు కేవలం రూ.82.31 కోట్లు మాత్రమే జమ చేసినట్లు లెక్కలు చూపారు. దీంతో రూ.45.06 కోట్లు తక్కువగా వసూలు అయినట్లు కాగ్ గుర్తించింది.

ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఎండీసీ) అమ్మకాల టర్నోవర్‌లో 10 శాతం మెరిట్ నిధికి జమ చేయాలి. 2016-22 మధ్య రూ.476.55 కోట్లు జమ చేయకపోవడం గమనార్హం. ఇందుకు సంబంధించి ఏపీఎండీసీతో చర్చలు జరుగుతున్నాయని గనుల శాఖ 2024 జనవరిలో తెలిపింది.

ఆయా సంవత్సరాల్లో చిన్న ఖనిజాల అన్వేషణకు మెరిట్ నిధులు ఏమీ ఖర్చు చేయకపోవడం ఆడిట్‌లో బయటపడింది.

డీఎంఎఫ్, మెరిట్ నిధుల్లో రూ.681.92 కోట్ల నష్టం

ప్రభుత్వ నిర్మాణ పనులకు ఖనిజాలు వినియోగించేటప్పుడు గనుల శాఖ అనుమతి లేకుండా తవ్వకాలు జరిగాయి. ఎంత మొత్తం ఖనిజాలు వాడారన్న సమాచారం ఏడీ కార్యాలయాల్లో సరిగా లేదు. ఇది అక్రమ తవ్వకాలకు దారి తీసినట్లు కనిపిస్తోంది. ప్రభుత్వ పనుల్లో వినియోగించిన ఖనిజాలను లెక్కలోకి తీసుకుంటే, డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ (డీఎంఎఫ్), మెరిట్ నిధులకు రూ.681.92 కోట్లు జమ కావాల్సి ఉంది. కానీ అది జరగలేదు.

గనుల శాఖ అధికారులు తమ పరిధిలోని అన్ని లీజులను ఏటా తప్పనిసరిగా తనిఖీ చేయాలి. 2017-22 మధ్య ఎనిమిది ఏడీ కార్యాలయాల పరిధిలో 8,939 లీజుల్లో తనిఖీలు జరగాల్సి ఉండగా, కేవలం 5,953 లీజుల్లో మాత్రమే తనిఖీలు చేశారు. మిగతా 33 శాతం లీజుల్లో తనిఖీలు లేవు. కొవిడ్ కారణంగా 2020-22లో తక్కువ తనిఖీలు జరిగాయని చెప్పినా, 2017-20 మధ్యకు సరైన కారణాలు లేవని కాగ్ తేల్చి చెప్పింది.

Tags:    

Similar News