Minister Atchennaidu : ఎరువుల సరఫరా పెరిగేలా ప్రణాళిక రూపొందించాలి
వ్యవసాయ అధికారులను ఆదేశించిన మంత్రి అచ్చెన్నాయుడు;
- సొసైటీలు, మార్క్ ఫెడ్ లకు ఎరువుల సరఫరా ఆలస్యం అవ్వకూడదు
- ఎరువుల కోసం సహాకార సంస్థల వైపే రైతులు మొగ్గు చూపుతున్నారు
- రాష్ట్ర వ్యాప్తంగా ఎరువుల వినియోగంపై మంత్రి అచ్చెన్నాయుడు ఆరా
రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్ కు అన్ని సహాకార సంస్థల్లో ప్రైవేట్ కంపెనీలలో రైతులకు ఎరువులు అందుబాటులో ఉండాలని, కొరత సంభవించే అవకాశం ఉంటే ముందుగానే గ్రహించి ఎరువుల సరఫరా పెరిగేలా వ్యవసాయ అధికారులు ప్రణాళికలు రూపొందించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులో ఉన్న ఎరువులు, వాటి సరఫరా, కొన్ని ప్రాంతాలలో యూరియా సరఫరాపై అందుతున్న సమాచారం పై మంగళవారం విజయవాడలో వ్యవసాయ అధికారులు, జిల్లా కలెక్టర్లతో మంత్రి అచ్చెన్నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ రైతు ఎరువుల కోసం ఇబ్బంది పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రతి సహాకార సంస్థను అధికారులు పర్యవేక్షిస్తూ, అందరికి ఎరువులు అందుతున్నాయా లేదా అని తనిఖీ చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చాలా ముందు చూపుతో కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ తో సంప్రదించి మిగిలిన రాష్ట్రాల కంటే ఎక్కువ పరిమాణంలో ఎరువులను రాష్ట్రానికి తెప్పించినా కూడా పలు ప్రాంతాలలో యూరియా సరఫరాపై పత్రికలలో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్న వార్తలు వస్తున్నాయన్న విషయాన్ని గ్రహించి వాటి కారణాల గురించి మంత్రి వాకబు చేశారు.
ఎక్కువ మొత్తంలో ఎరువులు పంపిణీ
శ్రీకాకులం జిల్లాలో ఎరువుల కొరత అంటూ వచ్చిన వార్తలపై కలెక్టర్ ను మంత్రి ప్రశ్నించగా వంశధార ప్రాజెక్టు లో ముందుగా నీటిని విడుదల చేయడం వల్ల విస్తీర్ణం పెరిగిందని, జిల్లాకు 12000 మెట్రిక్ టన్నుల ఎరువుల అవసరం ఉందని అందుకు గాను 18000 మెట్రిక్ టన్నుల ఎరువులు (9000 సొసైటీలు+ 9000 ప్రైవేట్ కంపెనీలకు) అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ స్వప్నీల్ దినకర్ మంత్రికి వివరించారు. రైతులు ప్రైవేట్ డీలర్ల వద్ద ఎరువులు కొనటానికి విముఖత చూపిస్తున్నారని , వారు గ్రామంలో ఉన్న రైతు సేవాకేంద్రాలకు ఎరువులు అందించాలని కోరుతున్నారని తెలిపారు. గతంలో ఎరువుల తక్కువ అవసరం ఉన్న ఆర్ఎస్కే లకు ఎక్కువ మొత్తంలో ఎరువులు పంపిణీ చేశారని తెలిపారు. ప్రభుత్వ కోట 50 శాతం ఎరువులు మన్యం, విజయనగరం జిల్లాల సొసైటీలు, ఆర్ఎస్కేలకు వెళ్తున్నాయని, శ్రీకాకుళం జిల్లాకు ప్రైవేట్ డీలర్ లకు వెళ్తున్నాయని తెలిపారు. ప్రైవేట్ డీలర్ల వద్ద వీఆర్ఓల పర్యవేక్షణలో అమ్మిస్తున్నామని తెలిపారు. నంద్యాల, అవనిగడ్డ కు సంబంధించి వచ్చిన వార్తలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని, చిన్న చిన్న విషయాలను కొండంతలుగా ప్రచారం చేసి కొంత మంది ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయాలని చూస్తున్నారని, వారికి అవకాశం ఇవ్వకూడదు కలెక్టర్లకు మంత్రి సూచించారు. జూలై, ఆగస్ట్ నెలలకు సంబంధించి రాష్ట్రానికి రావల్సిన బకాయి ఎరువులను వెంటనే రాష్ట్రానికి పంపాలని కేంద్రాన్ని కోరడం జరిగిందని వ్యవసాయ సంచాలకులు డిల్లీ రావు మంత్రికి వివరించారు. ఈ విషయంపై కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తో మాట్లాడి త్వరితగతిన యూరియాను రాష్ట్రానికి వచ్చేలా చొరవ చూపుతామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.