CM Chandrababu: వెలిగొండ ఫీడర్ కాలువ లైనింగ్ పనులకు శంకుస్థాపన: ముఖ్యమంత్రి చంద్రబాబు
లైనింగ్ పనులకు శంకుస్థాపన: ముఖ్యమంత్రి చంద్రబాబు
CM Chandrababu: మార్కాపురం, పోలవరం జిల్లాలు ఏర్పాటు చేస్తానని చెప్పిన మాట నిలబెట్టుకున్నానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మార్కాపురం జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ లైనింగ్ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మార్కాపురం ప్రజా వేదికలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు.
మార్కాపురం జిల్లా ప్రజలు తనకు ఘన స్వాగతం పలికారని, రాష్ట్రానికి పూర్వ వైభవం తీసుకురావాలంటే అందరూ సహకరించాలని అప్పుడే చెప్పానని గుర్తుచేశారు. రాష్ట్ర శ్రేయస్సు కోసమే పవన్ కల్యాణ్‌తో కలిశానని, అరకు నుంచి ప్రకాశం జిల్లా వరకు తమదే హవా అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించాలని పిలుపునిచ్చారు.
1995లోనే మార్కాపురం ప్రజల కష్టాలు చూశానని, ఇక్కడి రైతులు సాగునీరు లేక అనేక ఇబ్బందులు పడ్డారని చెప్పారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తయితే రైతుల జీవితాలు బాగుపడతాయని వివరించారు. 2014-19 మధ్య ఈ ప్రాజెక్టు పనులను వేగవంతం చేశామని, 2019-24 మధ్య పనులు మూలనపడ్డాయని విమర్శించారు. అప్పటి ముఖ్యమంత్రి పనులు పూర్తి కాకుండానే రిబ్బన్ కట్ చేసి, ప్రాజెక్టు పూర్తయిందని రైతులకు పొగరు చూపారని, మోసం చేశారని ఆరోపించారు. తాము ప్రాజెక్టుల విషయంలో మోసం చేయలేదని, చేయబోమని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టును రెండు దశల్లో పూర్తి చేయాలని నిర్ణయించామని తెలిపారు.
మంచి చేసిన వారికి అండగా ఉంటేనే జీవితాలు మారతాయని, ప్రతి విషయంలో చంద్రన్న అండగా ఉంటాడని హామీ ఇచ్చారు. మార్కాపురం జిల్లాను ఉద్యానవనంగా తయారు చేస్తామని, పండ్ల తోటల ద్వారా రైతుల ఆదాయం గణనీయంగా పెరుగుతుందని చెప్పారు. గత ఏడాది హంద్రీనీవా ప్రాజెక్టుపై దృష్టి సారించగా, ఈ ఏడాది వెలిగొండపై ప్రత్యేక దృష్టి పెట్టామని వెల్లడించారు.