CM Chandrababu: జిల్లాలోని మాచవరంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ‘మీ భూమి-మీ హక్కు’ కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు భూమి హక్కులు అందించేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించారు. నీరు జీవమైతే భూమి జీవితమని అన్న ఆయన, కోనసీమ అంటేనే మాజీ లోక్‌సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి గుర్తుకు వస్తారని పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలనకు తమ ప్రభుత్వం నాంది పలికిందని, సామాజిక బాధ్యతగా పీ4 కార్యక్రమాన్ని తీసుకొచ్చామని తెలిపారు.

గత ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేశామని, భూముల హక్కుల విషయంలో పారదర్శకత ఉండేలా చర్యలు చేపడుతున్నామని సీఎం చెప్పారు. ప్రపంచంలోనే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాస్‌బుక్‌లు తయారు చేస్తున్నామని, రాష్ట్రవ్యాప్తంగా 56 లక్షల పాస్‌బుక్‌లు పంపిణీ చేయాల్సి ఉందని, అవినీతికి తావులేకుండా వాటిని అందిస్తున్నామని వివరించారు. ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న అనేక భూ సమస్యలను పరిష్కరించామని, మిగిలిన సమస్యలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రజలు భూముల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా సాంకేతికతను వినియోగిస్తున్నామని, వచ్చే ఏడాది మార్చి నాటికి రాష్ట్రంలోని పెండింగ్ భూసమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని స్పష్టం చేశారు.

తాను 55 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని, ముఖ్యమంత్రిగా 31 సంవత్సరాలు పూర్తి చేసుకున్నానని చెప్పిన చంద్రబాబు, ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో విలువలతో కూడిన రాజకీయాలే చేశానని, సంపదపై తనకు ఎలాంటి ఆశ లేదని పేర్కొన్నారు. నంద్యాలలో ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా తనను అరెస్ట్ చేసి 53 రోజులు అన్యాయంగా జైలులో పెట్టారని ఆరోపించారు. తన అరెస్టుకు నిరసనగా ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలు స్పందించారని, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోరాడి సంఘీభావం తెలిపారని గుర్తుచేశారు. పవన్ కల్యాణ్‌ను బలవంతంగా విశాఖ నుంచి పంపించారని అన్నారు. కక్ష తీర్చుకోవాలంటే ఒక్క నిమిషంలోనే అరెస్ట్ చేయించి జైలుకు పంపగలనని, కానీ తనకు సహనం ఎక్కువని వ్యాఖ్యానించారు.

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య ఘటనను ప్రస్తావిస్తూ, వివేకానందరెడ్డిని క్రూరంగా హత్య చేసిన తర్వాత ఆయన కుమార్తె సునీత మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించాలని కోరారని, అనంతరం పోస్టుమార్టం నిర్వహించినట్లు తెలిపారు. ఆ రోజే హత్యకు పాల్పడిన దోషులను అరెస్ట్ చేసి ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేదా అని ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో తల్లి, చెల్లి పడుతున్న పరిస్థితిని ప్రజలు చూశారని అన్నారు. జగన్‌ను ఆయన తండ్రి రాజశేఖరరెడ్డి దూరం పెట్టారని కూడా వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో 14 డీఎస్సీలు నిర్వహించి ఏడాదిలోనే ఉద్యోగాలు ఇచ్చామని చెప్పిన సీఎం, అయితే ఏడాది తర్వాత డీఎస్సీ ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. డీఎస్సీ అంశంపై కొందరు వితండవాదం చేస్తున్నారని మండిపడ్డారు. కోర్టులు చీవాట్లు పెట్టినా వారికి బుద్ధి రావడం లేదని అన్నారు. గత ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు వెంటిలేటర్‌పై ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు సంజీవినిగా మారిందని, ప్రజలు ఇచ్చిన అవకాశంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.

Tags: