Venkaiah Naidu: పల్లెటూరి నుంచి దేశస్థాయి పదవుల వరకు.. స్కూళ్లలో ఫోన్ నిషేధం, మోరల్ క్లాసులు తప్పనిసరి: వెంకయ్య నాయుడు
వెంకయ్య నాయుడు
Venkaiah Naidu: పల్లెటూరిలో పుట్టినా పదవులు తనను వెతుక్కుంటూ వచ్చాయని మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు అన్నారు. చదువురాని కుటుంబంలో జన్మించినా దేశస్థాయిలో ప్రభుత్వ, పార్టీ పదవులు చేపట్టగలిగానని ఆయన చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ 2047 నాటికి దేశాన్ని వికసిత్ భారత్‌గా తీర్చిదిద్దాలనే సంకల్పంతో పనిచేస్తున్నారని, అన్ని రంగాల్లో దేశం వికసించాలని ఆకాంక్షించారు. అంతర్జాతీయంగా భారత్ అత్యంత వేగంగా ఆర్థికంగా దూసుకెళ్తోందని కూడా వెల్లడించారు.
ప్రస్తుతం కొందరు నేతలు దేశాన్ని చులకన చేస్తూ విమర్శలు చేయడం సరికాదని వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. పరిపాలనలో లోపాలుంటే, సమస్యలు పరిష్కారం కాకుంటే విమర్శించాలని, కానీ వ్యక్తిగతంగా, కుటుంబ సభ్యులు, మహిళలపై విమర్శలు మంచివి కావని తెలిపారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పదవి ఇస్తే తాను వద్దన్నానని, ఆర్థిక ప్రాధాన్యం లేని గ్రామీణ శాఖ ఇవ్వమంటే ఆయన నవ్వారని గుర్తు చేసుకున్నారు. దేశవ్యాప్తంగా జాతీయ రహదారులను కలపడం, వరుసగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడం తన అదృష్టమని చెప్పారు. గ్రామాల్లో గ్రామీణ సడఖ్ రోడ్లు వాజ్‌పేయీ పుణ్యమేనని అన్నారు.
‘నా జీవితంలో ఎన్నో పనులు చేసినా స్వర్ణ భారత్ ట్రస్ట్ అత్యధిక సంతృప్తిని ఇచ్చింది. దేశ చరిత్రలో ఎప్పుడూ లేనన్ని లక్షల ఇళ్లను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చాం. కోవూరు మండలంలో రూ.4 వేల కోట్లతో మిథేన్ కంపెనీ వచ్చి ఉంటే ఆ ప్రాంత రూపురేఖలు మారిపోయేవి. పదవిలో ఉన్నప్పుడు 35 మంది కేంద్ర మంత్రులతో సమావేశం నిర్వహించి ఏపీకి పలు ప్రాజెక్టులు వచ్చేలా చూశాను’ అని ఆయన వివరించారు.
స్కూళ్లలో మానవతా విలువలు నేర్పే మోరల్ క్లాసులు నిర్వహించాలని మంత్రి నారా లోకేశ్‌ను కోరుతున్నానని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. స్కూళ్లల్లో ఖచ్చితంగా ఫోన్లు నిషేధించాలని, సోషల్ మీడియా యాంటీ సోషల్ ఎలిమెంట్‌గా మారిందని హెచ్చరించారు. అబ్యూజ్, పెట్రోల్, వయిలెన్స్ ఉండకూడదని, చట్టసభల్లో గౌరవంగా మెలగాలని సూచించారు. రాజ్యసభ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 12 మందిని సస్పెండ్ చేశానని గుర్తు చేశారు. దేశంలో పాశ్చాత్య పోకడలు పెరిగిపోతున్నాయని, కొందరు తల్లిదండ్రులు భోజనాల సమయంలోనూ పిల్లలకు ఫోన్లు ఇవ్వడం దురదృష్టకరమని అన్నారు. 25 దేశాల్లో ఫోన్ వాడకంపై పలు ఆంక్షలు పెట్టాయని కూడా తెలిపారు.