Urban Local Body Elections: కూటమి అఖండ విజయం.. పట్టణ స్థానిక సంస్థల్లో ప్రభంజనం
ప్రభంజనం
Urban Local Body Elections: అధికార కూటమి మరోసారి అఖండ విజయం సాధించింది. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, భాజపా కూటమి సూపర్ హిట్‌గా నిలిచింది. 2024 సార్వత్రిక ఎన్నికల నాటి గెలుపును మరిపించేలా ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర, రాయలసీమ అన్ని ప్రాంతాల్లోనూ కూటమి విజయకేతనం ఎగరేసింది. ఈవీఎం ఎన్నికల్లోనే కాదు.. బ్యాలట్ పోరులోనూ కూటమిదే ఘన విజయం. అభివృద్ధి, సంక్షేమానికి ఓటర్లు బ్రహ్మరథం పట్టారు.
రాష్ట్రంలోని 13 నగరపాలక సంస్థలు, 77 పురపాలక సంఘాలు, 10 నగర పంచాయతీలకు కలిపి 100 చోట్ల ఎన్నికలు జరిగాయి. తుది ఫలితాలు వెల్లడయ్యేసరికి నందికొట్కూరు, నాయుడుపేట, బేతంచెర్లల్లోనే వైకాపా గెలిచింది. విశాఖపట్నం మేయర్‌గా తెదేపా అభ్యర్థి ముక్కా శ్రావణి 2,44,644 ఓట్ల బంపర్ మెజారిటీతో బావుటా ఎగరేశారు. గుంటూరులో తెదేపా అభ్యర్థి కోవెలమూడి లక్ష్మీ అపర్ణ 96,294 ఓట్ల ఆధిక్యతతో మేయర్ పదవిని కైవసం చేసుకున్నారు. విజయవాడ మేయర్ స్థానంలో జనసేన అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ లక్ష ఓట్ల మెజారిటీతో దూసుకెళ్తున్నారు. అనంతపురం కార్పొరేషన్‌లో వైకాపా స్వల్ప ఆధిక్యంలో ఉంది. ఆదోని మున్సిపాలిటీ, నెల్లిమర్ల నగర పంచాయతీల్లో కూటమి తిరుగుబాటు అభ్యర్థులు గెలిచారు.
నగరం, పట్టణం తేడా లేకుండా పుర జనం కూటమికే పట్టం కట్టారు. 87 పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో 17 చోట్ల ఛైర్‌పర్సన్ అభ్యర్థుల్ని కూటమి ఏకగ్రీవంగా గెలుచుకుంది. వీటిలో 8 చోట్ల ఛైర్‌పర్సన్ అభ్యర్థులతో పాటు మొత్తం వార్డులన్నీ ఏకగ్రీవమయ్యాయి. విశాఖపట్నం, విజయనగరం, మచిలీపట్నం, ఏలూరు, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కర్నూలు, కడప కార్పొరేషన్లను కూటమి కైవసం చేసుకుంది. జనసేన పోటీ చేసిన రెండు మేయర్ స్థానాల్లో ఏలూరులో గెలిచింది. జనసేన 15 మున్సిపాలిటీలు, మూడు నగర పంచాయతీల ఛైర్‌పర్సన్ పదవులకు పోటీపడి 100 శాతం స్ట్రైక్ రేట్‌తో విజయం సాధించింది. భాజపా నాలుగు మున్సిపాలిటీల్లో గెలిచింది.
మొత్తం 13 కార్పొరేషన్లలో 922 డివిజన్లకు గాను 118 ఏకగ్రీవమయ్యాయి. 87 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో 3020 వార్డులకు గాను 637 ఏకగ్రీవమయ్యాయి. కడపటి వార్తలందేసరికి తెదేపా 1298, జనసేన 298, భాజపా 81, వైకాపా 367 గెలుపొందాయి. రెబల్స్, స్వతంత్రులు 87 చోట్ల గెలిచారు.
వైకాపాకు కోలుకోలేని దెబ్బ తగిలింది. 22 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో వైకాపా అసలు బోణీ కొట్టలేదు. జగన్ సొంత జిల్లా వైఎస్సార్ కడపలో కూటమి క్లీన్‌స్వీప్ చేసింది. ఎర్రగుంట్ల, మైదుకూరు, ప్రొద్దుటూరు, బద్వేలు, రాజంపేట, కమలాపురం ఛైర్‌పర్సన్ స్థానాలు కూటమికి ఏకగ్రీవమయ్యాయి. పులివెందుల మున్సిపాలిటీలోనూ వైకాపాకు ఘోర పరాజయం ఎదురైంది. ఛైర్‌పర్సన్ స్థానంతో పాటు 37 వార్డుల్ని కూటమి కైవసం చేసుకుంది. వైకాపా కేవలం 3 వార్డుల్లోనే గెలిచింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాలకు గాను 11 స్థానాలు (6.29 శాతం) గెలిచిన వైకాపా, పుర ఎన్నికల్లో 100కి గాను 3 మున్సిపాలిటీలకే (3 శాతం) పరిమితమై మరింత ఘోర పరాజయం మూటగట్టుకుంది.
కర్నూలు జిల్లా ఆదోనిలో జనసేన రెబల్ అభ్యర్థి స్వప్ననాయకర్, నెల్లిమర్లలో తెదేపా పట్టణ అధ్యక్షుడు లెంకా అప్పలనాయుడు రెబల్‌గా గెలిచారు. విజయవాడలో స్వతంత్ర అభ్యర్థి ఏబీ వెంకటేశ్వరరావు కేవలం 12 వేల ఓట్లకే పరిమితమయ్యారు.
2021లో వైకాపా అధికారంలో ఉండగా జరిగిన ఎన్నికలతో ఇప్పటి ఎన్నికలను పోల్చలేం. అప్పట్లో అరాచకాలు, బెదిరింపులతో ఎన్నికలు ఏకపక్షం అయ్యాయి. ఇప్పుడు స్వేచ్ఛాయుత వాతావరణంలో, బెదిరింపులు లేకుండానే కూటమి విజయం సాధించింది. చంద్రబాబు ప్రభుత్వం ప్రత్యక్ష విధానంలో పుర ఎన్నికలు నిర్వహించి రిస్క్ తీసుకున్నా జనం కూటమికే జై కొట్టారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజాదీవెనే ఇది. తెదేపా-జనసేన-భాజపా కాంబినేషన్ మరోసారి సూపర్ హిట్‌గా నిరూపితమైంది.