CM Chandrababu Naidu: ఎన్నికలను అడ్డుకునేందుకే జగన్ కుట్రలు.. సీఎం చంద్రబాబు తీవ్ర ఆరోపణలు
తీవ్ర ఆరోపణలు
CM Chandrababu Naidu: పులివెందులలో ప్రశాంతంగా జరుగుతున్న ఎన్నికల్ని అడ్డుకోవడానికి జగన్ కుట్రలు పన్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. వైకాపా నాయకులు ఎంత కవ్వించినా కూటమి శ్రేణులు సంయమనం పాటించాయని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని, కౌంటింగ్ సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
కూటమి పార్టీల నేతలు, కార్యకర్తలతో సోమవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం.. ‘‘గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు కీలకం. రాష్ట్రంలోని 28 జిల్లా పరిషత్తు ఛైర్మన్ స్థానాల్ని కూటమి పార్టీలే కైవసం చేసుకోవాలి. అన్ని జడ్పీటీసీ స్థానాల్నీ మనమే గెలుచుకోవాలి. ప్రతి మండలంలోనూ కూటమి పార్టీల జెండాలు రెపరెపలాడాలి’’ అని అన్నారు.
కూటమి అధికారంలోకి వచ్చాక గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, రూ.1.50 లక్షల కోట్లతో అభివృద్ధి పనులు సాగుతున్నాయని తెలిపారు. ఇంటింటికీ సంక్షేమాన్ని అందించామని, ప్రజల ఆకాంక్షల మేరకు సుపరిపాలన చేస్తున్నామని పేర్కొన్నారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో ప్రతి అంశాన్నీ ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌లతో చర్చిస్తున్నానని వివరించారు.
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోలింగ్ శాతం తక్కువగా నమోదైందని, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఆ పరిస్థితి ఉండకూడదని, ఓట్లు పెద్ద ఎత్తున పోలయ్యేలా చూడాలని సూచించారు. టెలికాన్ఫరెన్స్‌లో మంత్రి నాదెండ్ల మనోహర్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ పాల్గొన్నారు.
జడ్పీ పీఠాలపై కూటమిలో చర్చలు
జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ పదవుల సర్దుబాటుపై తెదేపా, జనసేన, భాజపాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. మొత్తం 28 జిల్లా పరిషత్‌లకు గాను కనీసం ఆరు కావాలని జనసేన పట్టుబడుతోంది. పల్నాడు, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జడ్పీ ఛైర్పర్సన్ స్థానాలను జనసేనకు కేటాయించాలని నిర్ణయించినట్లు సమాచారం. అల్లూరి సీతారామరాజు, పోలవరం, తిరుపతి, కృష్ణ, కాకినాడ జడ్పీ ఛైర్పర్సన్ పోస్టుల్ని కూడా జనసేన కోరుతున్నట్లు తెలిసింది. భాజపాకు ఒక జడ్పీ ఛైర్పర్సన్ స్థానాన్ని కేటాయించాలని నిర్ణయించారు. ఏ పార్టీకి ఎన్ని స్థానాలన్నది రెండు మూడు రోజుల్లో ప్రకటించే అవకాశముంది.