Amaravati ORR: అమరావతి అవుటర్‌ రింగ్‌ రోడ్‌ (ఓఆర్‌ఆర్‌)లో మొత్తం 17 చోట్ల ఇంటర్‌ఛేంజ్‌లు నిర్మించనున్నారు. 189.93 కి.మీ. మేర ఆరు వరుసలతో యాక్సెస్‌ కంట్రోల్‌ విధానంలో నిర్మించే ఈ రహదారిలోకి వాహనాలు ప్రవేశించాలంటే, లేదా బయటకు రావాలంటే ఇంటర్‌ఛేంజ్‌ల వద్దే అవకాశం ఉంటుంది.

ఓఆర్‌ఆర్‌ ఆరు జాతీయ రహదారులను క్రాస్‌ చేస్తుంది. వాటిలో ఎనిమిది చోట్ల డబుల్‌ ట్రంపెట్‌ ఇంటర్‌ఛేంజ్‌లు నిర్మిస్తారు. రాష్ట్ర, జిల్లా రహదారులను క్రాస్‌ చేసే ప్రాంతాల్లో ఒక సింగిల్‌ ట్రంపెట్‌ ఇంటర్‌ఛేంజ్‌, ఎనిమిది రోటరీ ఇంటర్‌ఛేంజ్‌లు ఏర్పాటు చేయనున్నారు.

గతంలో 19 చోట్ల ఇంటర్‌ఛేంజ్‌లు నిర్మించాలని ప్రతిపాదించారు. ప్రాజెక్ట్‌ వ్యయం రూ.38,450 కోట్లుగా ఉండటంతో ఎన్‌హెచ్‌ఏఐ ఉన్నతాధికారుల నుంచి తగ్గించాలని ఆదేశాలు వచ్చాయి. దీంతో ఓఆర్‌ఆర్‌లో లోపలి వైపు మాత్రమే సర్వీస్‌ రోడ్లు ఉంచి, బయటివైపు సర్వీస్‌ రోడ్ల ప్రతిపాదనను తొలగించారు. తెనాలి సమీపం నుంచి చెన్నై-కోల్‌కతా హైవేలో కాజా వరకు 17.5 కి.మీ. మేర ఆరు వరుసల అనుసంధాన రహదారి ప్రతిపాదనను కూడా పక్కన పెట్టారు. దీనివల్ల ఆ రహదారి మొదలయ్యే, ముగిసే చోట నిర్మించాలనుకున్న రెండు ఇంటర్‌ఛేంజ్‌లు తొలగిపోయాయి. ఫలితంగా ఇంటర్‌ఛేంజ్‌ల సంఖ్య 17కు తగ్గి, ప్రాజెక్ట్‌ వ్యయం రూ.30,491 కోట్లకు పరిమితమైంది.

ఎక్కడెక్కడ ఏ రకం ఇంటర్‌ఛేంజ్‌లు?

కంచికచర్ల వద్ద విజయవాడ-హైదరాబాద్‌ హైవేపై డబుల్‌ ట్రంపెట్‌ ఇంటర్‌ఛేంజ్‌

కంచికచర్ల-మధిర రాష్ట్ర రహదారి క్రాస్‌ అయ్యే చోట పొన్నవరం సమీపంలో (3.90 కి.మీ.) రోటరీ ఇంటర్‌ఛేంజ్‌

విజయవాడ-ఖమ్మం-నాగ్‌పూర్‌ హైవే (ఎన్‌హెచ్‌-163జి) క్రాస్‌ అయ్యే దుగ్గిరాలపాడు సమీపంలో (18.30 కి.మీ.) డబుల్‌ ట్రంపెట్‌

మైలవరం సమీపంలో విజయవాడ-భద్రాచలం-రాయ్‌పూర్‌ హైవే క్రాస్‌ అయ్యే చోట (31.29 కి.మీ.) డబుల్‌ ట్రంపెట్‌

అడవినెక్కలం-వెల్వడం రోడ్‌ క్రాస్‌ అయ్యే చోట (42.50 కి.మీ.) రోటరీ

ఆగిరిపల్లి సమీపంలో విజయవాడ-నూజివీడు రోడ్‌ క్రాస్‌ అయ్యే చోట (47.80 కి.మీ.) డబుల్‌ ట్రంపెట్‌

చెన్నై-కోల్‌కతా హైవేలో పొట్టిపాడు వద్ద (66.10 కి.మీ.) డబుల్‌ ట్రంపెట్‌

గన్నవరం-పుట్టగుంట రోడ్‌ క్రాస్‌ అయ్యే చోట (71.54 కి.మీ.) రోటరీ

విజయవాడ-గుడివాడ రోడ్‌ను మానికొండ వద్ద (80.31 కి.మీ.) క్రాస్‌ చేసే చోట రోటరీ

విజయవాడ-మచిలీపట్నం హైవేపై చలివేంద్రపాలెం సమీపంలో (85.90 కి.మీ.) డబుల్‌ ట్రంపెట్‌

గుంటూరు-హనుమాన్‌పాలెం రోడ్‌ నందివెలుగు వద్ద (105.70 కి.మీ.) రోటరీ

నారాకోడూరు నుంచి బుడంపాడుకు స్పర్‌ రోడ్‌ నిర్మిస్తున్న చోట (123.20 కి.మీ.) డబుల్‌ ట్రంపెట్‌

అనంతవరప్పాడు-ముట్లూరు రోడ్‌లో అనంతవరప్పాడు సమీపంలో (128.70 కి.మీ.) రోటరీ

గుంటూరు-ప్రత్తిపాడు-పర్చూరు రోడ్‌లో పుల్లడిగుంట వద్ద (134.90 కి.మీ.) రోటరీ

పొత్తూరు-లింగాయపాలెం మధ్య చెన్నై-కోల్‌కతా హైవే క్రాస్‌ చేసే చోట (139.90 కి.మీ.) డబుల్‌ ట్రంపెట్‌

మేడికొండూరు సమీపంలో వినుకొండ-గుంటూరు హైవే క్రాస్‌ అయ్యే చోట (149.02 కి.మీ.) సింగిల్‌ ట్రంపెట్‌

సత్తెనపల్లి-అమరావతి రాష్ట్ర రహదారిని బలుసుపాడు సమీపంలో (170.70 కి.మీ.) క్రాస్‌ చేసే చోట రోటరీ

ఈ ఇంటర్‌ఛేంజ్‌ల ద్వారా అమరావతి-విజయవాడ-గుంటూరు ప్రాంతం చుట్టూ వేగవంతమైన కనెక్టివిటీ ఏర్పడనుంది.

Tags: