ఆంధ్రప్రదేశ్ లో అరాచక పాలన నడుస్తోంది

బొత్స సత్యనారాయణ నేతృత్వంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ కి ఫిర్యాదు చేసిన వైఎస్ఆర్సీపీ;

Update: 2025-08-08 04:40 GMT

కడప జిల్లాలో స్థానిక సంస్థల ఉప ఎన్నికల సందర్భంగా టీడీపీ గూండాల హింస పెరుగుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల బృందం గురువారం గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలిసి ఫిర్యాదు చేసింది. శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ నేతృత్వంలో వైఎస్‌ఆర్‌సీపీకి చెందిన మాజీ మంత్రులు,మాజీ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు గవర్నర్‌ని కలిసి రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలనపై ఫిర్యాదు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, పోలీసు వ్యవస్థ తటస్థంగా ఉండటానికి బదులుగా అధికార కూటమికి మద్దతు ఇస్తోందని వైఎస్‌ఆర్‌సీపీ ప్రతినిధి బృందం గవర్నర్‌ దృష్టికి తీసుకు వెళ్ళారు. పులివెందులలో ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పాక్షికంగా జరిగేలా చూడాలని నాయకులు గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు.

టీడీపీ మద్దతుతో రౌడీలు పులివెందులలో మారణాయుధాలు ఆయుధాలను ఉపయోగించి హింసాత్మక దాడులు చేశారని శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ నేతృత్వంలోని వైఎస్‌ఆర్‌సీపీ ప్రతినిధి బృందం గవర్నర్‌కు తెలియజేసింది. వాహనాలను ధ్వంసం చేశారని, వైఎస్‌ఆర్‌సీపీ నాయకులను చంపాలనే ఉద్దేశ్యంతో దాడులు చేశారని గవర్నర్‌కు వివరించారు. దాడిలో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ తీవ్రంగా గాయపడ్డారని, ఫిర్యాదు చేసినా పోలీసులు చర్య తీసుకోలేదని గవర్నర్‌కి చెప్పారు. పోలీసులు అధికార టీడీపీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని బొత్స గవర్నర్‌కు తెలిపారు. కర్నూలు డీఐజీ కోయ ప్రవీణ్ సహా పోలీసు బలగాలు ఎలా పక్షపాత వ్యాఖ్యలు చేస్తున్నాయో కూడా ఆయన గవర్నర్ దృష్టికి తీసుకువచ్చారు.

గవర్నర్‌ని కలసిన అనంతం రాజ్ భవన్ వెలుపల మీడియాతో మాట్లాడిన బొత్స సత్యనారాయణ, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఇంకా బతికే ఉందా అని ప్రశ్నించారు. బీసీ నాయకుడు అయిన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ కు ప్రాథమిక రక్షణ కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలమయ్యిందని ఆయన విమర్శించారు. పోలీసులు ప్రభుత్వ ఒత్తిడికి తలొగ్గి తీవ్రమైన దాడులను కూడా పట్టించుకోకుండా విస్మరిస్తున్నారని బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఎమ్మెల్సీ రమేష్‌ యాదవ్‌పై దాడి చేసిన వారిపై తక్షణం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బొత్స డిమాండ్ చేశారు. కడపలో స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు కూడా సమర్పించామని బొత్స వెల్లడించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అన్ని వ్యవస్ధలను ఎలా బలహీన పరుస్తోందో గవర్నర్‌ అబ్దుల్ నజీర్‌కు వివరించామని బొత్స మీడియాకు తెలిపారు. పోలీసులు రాజకీయ పార్టీలకు ఏజెంట్లుగా వ్యవహరించ కూడదని, అధికారం శాశ్వతం కాదని వ్యవస్ధలు చట్టప్రకారం పనిచేయాలని బొత్స సత్యనారాయణ పోలీసులకు హితవు పలికారు.

Tags:    

Similar News