Andhra Pradesh Cabinet: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ క్యాబినెట్ సమావేశం ముగిసింది. రాజధాని అమరావతికి స్థిరమైన చట్టబద్ధత కల్పించాలని మంత్రివర్గం చారిత్రాత్మక తీర్మానం చేసింది. ఏపీ పునర్విభజన చట్టం-2014లోని సెక్షన్-5ను సవరించి, కొత్త రాజధాని స్థానంలో అమరావతి పేరును చేర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది.

అమరావతిని సీఆర్‌డీఏ చట్టం పరిధిలో చేర్చి రాజధాని చట్టబద్ధత ఇవ్వాలని క్యాబినెట్ స్పష్టం చేసింది. ఈ సవరణ బిల్లుపై అసెంబ్లీలో నాలుగు గంటలపాటు చర్చించి తీర్మానం చేయాలని నిర్ణయించింది. రాజధాని అమరావతి చరిత్రను ప్రజలందరికీ తెలియజేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు క్యాబినెట్ సభ్యులకు సూచించారు.

ఈ సమావేశంలో ముఖ్యమంత్రి విద్యుత్ శాఖపై పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఏప్రిల్ 5 నుంచి 14 వరకు ప్రతి నియోజకవర్గంలో 2,000 సూర్యఘర్ కనెక్షన్లు ఇవ్వాలని, పీఎం కుసుమ్ ద్వారా పవర్ లాస్‌లు తగ్గించాలని ఆదేశించారు. బ్యాటరీ స్టోరేజ్ వ్యవస్థలను 33/11 కేవీ సబ్‌స్టేషన్ల వద్ద ఏర్పాటు చేయాలని సూచించారు.

అమరావతి అభివృద్ధితో పాటు నీరుకొండలో ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయం, 60 మీటర్ల ఎత్తు వరకు అకడమిక్ భవనాల నిర్మాణానికి క్యాబినెట్ అనుమతి ఇచ్చింది. ఇంకా రాష్ట్రంలో 96 జూనియర్, సీనియర్ సివిల్ జడ్జిల కోర్టుల ఏర్పాటు, వడ్డెర సంఘాలకు ఖనిజ లీజుల్లో ప్రాధాన్యత, లీజు ప్రీమియం-సీనరేజ్ ఫీజుల్లో 50 శాతం రాయితీ, కుప్పం బాలికల పాఠశాలలో పీఈటీ, నర్సు, రికార్డు అసిస్టెంట్ పోస్టుల మంజూరు, 2025-26 ఆర్థిక సంవత్సరం ఆస్తి పన్ను బకాయిలపై వడ్డీ మాఫీ, జలవనరుల శాఖ ప్రాజెక్టుల ఆధునికీకరణ, వివిధ సంస్థలకు భూ కేటాయింపులు, ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు వంటి ముఖ్య నిర్ణయాలు క్యాబినెట్ తీసుకుంది.

క్యాబినెట్ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, ‘‘ఆదాయంలో 99 శాతం జీతాలకే వెళ్తోంది. కేంద్ర సాయం అప్పులు, వడ్డీలు చెల్లించడానికే సరిపోతోంది. క్లిష్ట పరిస్థితుల్లోనూ సంక్షేమం అందిస్తూ అభివృద్ధి దిశగా నడిపిస్తున్నాం. కేంద్ర పథకాలను ఎక్కువగా ఉపయోగించుకుంటున్నాం. ఈ పార్లమెంట్ సమావేశంలోనే అమరావతి రాజధాని చట్టబద్ధత సవరణ బిల్లు ప్రవేశపెడతాం’’ అని ప్రకటించారు.

Tags: