Nara Lokesh : ఆసియా మార్కెట్ కు ఆంధ్రప్రదేశ్ వ్యూహాత్మక గమ్యస్థానం
బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి నారా లోకేష్;
- ఐటి, ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్స్ రంగాల్లో పెట్టుబడులు పెట్టండి
- పరిశ్రమదారులకు మరిన్ని వెసలుబాట్లు కల్పించేందుకు సిద్ధం
- నాలెడ్జి బేస్డ్ ఎకానమీ కోసం గ్లోబల్ సంస్థలతో కలసి పనిచేస్తాం
భారతదేశంలో తమ కార్యకలాపాలను విస్తరించడం ద్వారా విస్తృత ఆసియా మార్కెట్‌ను యాక్సెస్ చేయాలని చూస్తున్న వ్యాపార సంస్థలకు ఆంధ్రప్రదేశ్ వ్యూహాత్మకమైన గమ్యస్థానంగా ఉందని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. “ఐటీ, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్స్ & ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్స్, ఎఐ, ఫిన్‌టెక్ రంగాల్లో ఆంధ్రప్రదేశ్ ను భవిష్యత్తులో శక్తివంతం చేయడం” అనే అంశంపై సింగపూర్ షాంగ్రీలా హోటల్ లో ఏర్పాటుచేసిన బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఒక దార్శనిక రాష్ట్రం, భవిష్యత్తు పట్ల స్పష్టమైన దార్శనికత కలిగి ఆర్థిక వృద్ధిని ముందుకు నడిపించడానికి, పౌరసేవలను మెరుగుపరచడానికి సాంకేతికత శక్తిని ఉపయోగించుకోవడంలో మేం నిబద్ధతతో పనిచేస్తున్నాం. పరస్పరం అనుసంధానమైన నేటి ప్రపంచంలో సాంకేతికత కేవలం ఒక టూల్ మాత్రమే కాదు, విజయానికి ఒక ప్రాథమిక అవసరం అని మేము గుర్తించాం. ఈరోజు భారత్ ఆధునిక సాంకేతి విప్లవంలో పాలుపంచుకోవడమే గాక దానికి నాయకత్వం వహిస్తోంది. ఆంధ్రప్రదేశ్ భారతదేశ తూర్పు తీరంలో వ్యూహాత్మక స్థానంగా ఉంది. ప్రధాన నగరాలు, అంతర్జాతీయ మార్కెట్లకు అద్భుతమైన కనెక్టివిటీని కలిగి ఉంది. ఎపిలో 974 కి.మీల సువిశాల తీరప్రాంతం, ఓడరేవులు, విమానాశ్రయాలు, హైవేలు, రైల్వేల నెట్‌వర్క్‌తో అనుసంధానమైన మౌలిక సదుపాయాలు ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ ఐటి, ఇంజనీరింగ్, తయారంగంలో ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులను కలిగి ఉంది. ఆధునిక ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ కు అనుగుణంగా గ్రాడ్యుయేట్లను తయారుచేసే బలమైన విద్యా పర్యావరణ వ్యవస్థ, విశ్వవిద్యాలయాలు, ఇంజనీరింగ్ కళాశాలలు, వృత్తి శిక్షణా సంస్థలు మావద్ద ఉన్నాయి. మారుతున్న పరిశ్రమ అవసరాలకు తగ్గట్టుగా యువతలో నైపుణ్యాభివృద్ధికి ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తూ వారికి అవకాశాలు కల్పించేందుకు పరిశ్రమదారులను భాగస్వాములను చేస్తున్నాం. పెట్టుబడులను ఆకర్షించేందుకు అధునాతన ఆవిష్కరణలు, స్థిరమైన ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించే వ్యాపార అనుకూల వాతావరణాన్ని సృష్టించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. పారదర్శకత, జవాబుదారీతనం, వ్యాపార సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకొని సులభతరమైన విధానాల కోసం మేం నిరంతరం కృషిచేస్తున్నాం. ఎపిలో వ్యాపారాభివృద్ధికి అవసరమైన మరిన్ని వెసలుబాట్లు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నాం.
చురుకైన ప్రభుత్వ విధానాలు, నైపుణ్యం కలిగిన శ్రామికశక్తి, భవిష్యత్ పై స్పష్టమైన దృక్పథంతో పాటు పలు ప్రత్యేకతలతో దూసుకుపోతున్న ప్రగతిశీల రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఎపి ఆర్థికాభివృద్ధిలో ఐటి, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్స్, ఇన్నొవేషన్ ఎకో సిస్టమ్స్, ఎఐ, ఫిన్ టెక్ రంగాలు కీలకంగా మారుతున్నాయి. ఈ రంగాల్లో పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ వ్యూహాత్మకమైన ప్రాంతం. ఐటి రంగంలో సాఫ్ట్ వేర్ డెవలప్ మెంట్, ఐటి సేవలు, బిజినెస్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్ లలో పెట్టుబడులను ఆకర్షించి ఎపిని ఐటి హబ్ గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ క్రమంలో మా ప్రయత్నాలు విజయవంతమై టిసిఎస్, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్ వంటి ప్రఖ్యాత సంస్థలు ఎపిలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాయి.
ఎలక్ట్రానిక్స్ తయారీ పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయడం ద్వారా ఆర్థిక వృద్ధితోపాటు యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు మేం కృషి చేస్తున్నాం. భారతదేశంలో ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. రాబోయే నాలుగేళ్లలో ఎలక్ట్రానిక్స్ రంగంలో 150 బిలియన్ డాలర్ల పెట్టుబడులు లక్ష్యంగా ఎలక్ట్రానిక్స్ పాలసీ 4.0 ను ఇటీవల ఎపి ప్రభుత్వం ప్రకటించింది. గత ఏడాది కాలంగా ఈ రంగంలో మేం గణనీయమైన పెట్టుబడులను ఆకర్షించాం. ఎపిలో నైపుణ్యం కలిగిన వర్క్ ఫోర్స్ తోపాటు ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ ప్రభుత్వం ఉంది. విడిభాగాల తయారీ నుండి అసెంబ్లింగ్, టెస్టింగ్ వరకు ఎలక్ట్రానిక్స్ పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయడంపై మేం దృష్టిసారించాం. ఈ రంగంలో రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్, ఇన్నొవేషన్స్ ను ప్రోత్సహిస్తున్నాం. స్థానిక కంపెనీలు గ్లోబల్ ఎలక్ట్రానిక్స్ వాల్యూ చైన్ లో పాల్గొనేలా అవకాశాలు సృష్టిస్తున్నాం.
సెమీ కండక్టర్ల ప్రాధాన్యతను గుర్తించి ఆ రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు నవీన ఆవిష్కరణలను ప్రోత్సహిస్తూ నైపుణ్యం కలిగిన శ్రామికశక్తిని తయారుచేయడానికి చర్యలు చేపడుతున్నాం. ఇన్నొవేషన్, ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సంస్కృతిని పెంపొందిస్తూ స్టార్టప్ లకు మద్దతు ఇస్తున్నాం. ప్రభుత్వపాలనలో పౌరసేవలను మెరుగుపర్చడంతోపాటు పాటు పరిశ్రమల సామర్థ్యాన్ని మెరుగుపర్చడానికి, కొత్త ఉత్పత్తులు, సేవల కోసం ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ను ఉపయోగస్తున్నాం. ఫైనాన్షియల్ సెక్టార్ లో ఫిన్ టెక్ కంపెనీల అభివృద్ధి సాధించడానికి అవసరమైన అవకాశాలు కల్పిస్తున్నాం. నాలెడ్జి బేస్డ్ ఎకానమీని సాధించేందుకు గ్లోబల్ కంపెనీలతో కలసి పనిచేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో సింగపూర్ హై కమిషనర్ శిల్పక్ అంబులే, ఎపి ఐటిశాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్, ఎస్ టి టెలీమీడియా ఇన్వెస్టిమెంట్స్ హెడ్ రీతూ మెహ్లావత్, క్యాంటీర్ సిస్టమ్స్ ప్రెసిడెంట్ & సిఇఓ ప్రభాకర్ పి.సెల్వం, అరియోన్ ప్రో సొల్యూషన్స్ సిఇఓ బాలకృష్ణ పంగం దినేష్, జిటిఎఫ్ఎన్ సిఇఓ సొప్నేందు మెహంతీ, వాటర్ లీప్ ఫౌండర్ సునిల్ విక్రమనాయకే, ఆంకోషాట్ సిఇఓ హ్యురేన్ శివరాజ్, ఫాథమ్ ఎక్స్ సిఇఓ స్టీఫెన్ లిమ్, ఏస్.ఎస్ జి చైర్మన్ సౌరవ్ భట్టాచార్య తదితరులు పాల్గొన్నారు.