Minister Payyavula: ఉద్యోగులు–పాలకుల మధ్య సమన్వయమే అభివృద్ధికి కీలకం: మంత్రి పయ్యావుల

సమన్వయమే అభివృద్ధికి కీలకం: మంత్రి పయ్యావుల

Update: 2026-02-06 06:36 GMT

గత వైకాపా పాలనలో రూ.26 వేల కోట్లు పక్కదారి.. జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితి

కూటమి ప్రభుత్వం సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉంది


Minister Payyavula: రాష్ట్ర అభివృద్ధి సాధించాలంటే ఉద్యోగులు, పాలకుల మధ్య పూర్తి సమన్వయం అవసరమని రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ స్పష్టం చేశారు. ఏపీ జేఏసీ అమరావతి నాలుగో రాష్ట్ర మహాసభ విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గురువారం జరిగింది.

ముఖ్య అతిథులుగా ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ హాజరయ్యారు. తొలుత లెనిన్ సెంటర్ నుంచి ఉద్యోగులు భారీ ర్యాలీగా తుమ్మలపల్లి కళాక్షేత్రానికి చేరుకున్నారు.

సభలో మాట్లాడిన మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ, ఉద్యోగులు, పాలకులు వేరువేరు కాదని, ఏ సమస్య అయినా చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని అన్నారు. గత వైకాపా ప్రభుత్వం ఉద్యోగులు దాచుకున్న రూ.26 వేల కోట్లను పక్కదారి పట్టించిందని, విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్, వృద్ధులు, దివ్యాంగుల పింఛన్లు బకాయి పెట్టి వెళ్లిపోయిందని విమర్శించారు. ఉద్యోగులకు నెలవారీ జీతాలు కూడా ఇవ్వలేని స్థితికి రాష్ట్రాన్ని తీసుకొచ్చి, అప్పుల కుప్పగా మార్చేశారని ఆరోపించారు.

ప్రస్తుత కూటమి ప్రభుత్వం రాష్ట్ర పరిస్థితిని మెరుగుపరుస్తూ, అభివృద్ధికి సమన్వయంతో కృషి చేస్తోందని తెలిపారు. దేశంలో తొలిసారిగా మహిళా ఉద్యోగులకు (60 శాతం) ప్రయోజనం చేకూరేలా చైల్డ్‌కేర్ లీవు వయోపరిమితి, నిబంధనలను సడలించామని వివరించారు.

మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ, ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో ఉద్యోగులదే కీలక పాత్ర అన్నారు. వారి సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు.

ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, గత వైకాపా పాలనలో ఉద్యోగుల సమస్యల్లో ఒక్కటి కూడా పరిష్కారం కాలేదని, కూటమి ప్రభుత్వం వచ్చాక సమస్యల పరిష్కారానికి కృషి జరుగుతోందని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల నెరవేర్పులో భాగంగా 12వ పీఆర్సీ కమిషన్‌ను నియమించి, ఐఆర్ ప్రకటించాలని కోరారు.

మహాసభలో ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర నూతన కమిటీని 21 మందితో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర ఛైర్మన్‌గా బొప్పరాజు వెంకటేశ్వర్లు నాలుగోసారి ఎన్నికయ్యారు. సెక్రటరీ జనరల్‌గా పలిశెట్టి దామోదరరావు, అసోసియేట్ ఛైర్మన్‌గా టి.వి. ఫణి పేర్రాజు, కోశాధికారిగా తిమ్మసర్తి నాగేశ్వరరావు, ప్రచార కార్యదర్శిగా ఆర్.శ్రీనివాసరావు, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా బి.కిషోర్‌కుమార్, కార్యదర్శులుగా కె.చంద్రశేఖర్‌తో పాటు మరో నలుగురు ఎన్నికయ్యారు.

Tags:    

Similar News