CM Chandrababu: బీసీల హక్కుల కోసం మరో నిర్ణయం – రిజర్వేషన్లు పెంచుతామని సీఎం చంద్రబాబు భరోసా

రిజర్వేషన్లు పెంచుతామని సీఎం చంద్రబాబు భరోసా

Update: 2026-02-24 05:15 GMT

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, స్థానిక సంస్థల ఎన్నికలకు ముందుగానే బీసీలకు రిజర్వేషన్లు పెంచేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఏకసభ్య కమిషన్ నివేదిక వచ్చిన వెంటనే చట్టం తీసుకొచ్చి అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వం బలహీన వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తుందని, వారి రక్షణకు మంత్రివర్గ ఉపసమితి ఏర్పాటు చేశామని తెలిపారు. శాసనసభలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖలు మరియు ఆహార పౌరసరఫరాల శాఖకు గ్రాంట్లు కోరుతూ జరిగిన చర్చలో సీఎం మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

వైసీపీ పాలనలో బీసీ రిజర్వేషన్లు 33 శాతం నుంచి తగ్గించారని, ఇప్పుడు మళ్లీ పెంచడానికి ఏకసభ్య కమిషన్ నియమించామని చంద్రబాబు వివరించారు. బీసీలలో కొందరు తమను ఎస్సీ, ఎస్టీలలో చేర్చాలని కోరిన మనవులను కేంద్రానికి పంపామని చెప్పారు. బలహీన వర్గాల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని, ప్రజాప్రతినిధులు చేసే ప్రతి పనిలోనూ వారిని ఆదుకోవడాన్ని ప్రధానంగా చూడాలని సూచించారు. ఈ ప్రభుత్వం బలహీన వర్గాలదేనని, వారికి అన్ని విధాలుగా అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు.

ఎస్సీ వర్గీకరణను 1996-97లో తొలిసారి తెదేపా ప్రభుత్వమే అమలు చేసిందని, తర్వాతి ప్రభుత్వాలు దాన్ని కాపాడలేకపోయాయని సీఎం గుర్తు చేశారు. సుప్రీంకోర్టు అనుమతితో మళ్లీ ఎస్సీ వర్గీకరణను అమలు చేసి సామాజిక న్యాయం నెరవేర్చామని తెలిపారు. గిరిజనుల సమస్యల పరిష్కారానికి ఆమోదయోగ్యమైన విధానాన్ని అనుసరిస్తామని, జీవో 3ను తెచ్చినా వైసీపీ కాపాడలేకపోయిందని విమర్శించారు. గిరిజన ప్రాంతాల్లో 100 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలనే లక్ష్యంతో సమావేశాలు నిర్వహించి సూచనలు తీసుకుని నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

బలహీన వర్గాల సంక్షేమానికి బడ్జెట్‌ను పెంచామని, చిత్తశుద్ధితో అమలు చేస్తామని సీఎం పేర్కొన్నారు. అంగన్‌వాడీలు, ప్రాథమిక పాఠశాలలు, రెసిడెన్షియల్‌ స్కూళ్లపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నామని తెలిపారు. ప్రతి పథకంలోనూ మహిళలకు ప్రాధాన్యమిస్తున్నామని, అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడినవారిని కూడా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. పేదలందరికీ అండగా ఉంటామని, ప్రతి కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పిస్తామని, త్వరలో ఫ్యామిలీ కార్డు పంపిణీ చేస్తామని చెప్పారు. కుటుంబాన్ని యూనిట్‌గా చేసి సాధికారత కల్పిస్తామని, సంజీవని ద్వారా ఆర్థిక సదుపాయాలు అందిస్తామని వివరించారు. ఆర్థిక అసమానతల తగ్గింపే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

సూపర్‌ సిక్స్‌ పథకాలను సూపర్‌హిట్‌ చేశామని, ఇది మొదటి అడుగు మాత్రమేనని చంద్రబాబు తెలిపారు. అన్ని వర్గాలకు సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నామని, ఆటోడ్రైవర్లు, మత్స్యకారులు, చేనేత కార్మికులతో సహా అందరినీ ఆదుకుంటున్నామని చెప్పారు. ప్రజాపంపిణీ వ్యవస్థలో సాంకేతికతను వినియోగిస్తున్నామని తెలిపారు. స్వర్ణాంధ్ర 2047 విజన్‌లో భాగంగా 2047 నాటికి తలసరి ఆదాయాన్ని రూ.3 లక్షల నుంచి రూ.54 లక్షలకు పెంచాలని లక్ష్యమని వెల్లడించారు. పీ4 కార్యక్రమం కింద 10 లక్షల బంగారు కుటుంబాలను మార్గదర్శులు దత్తత తీసుకున్నారని చెప్పారు. ఏ కార్యక్రమమైనా ఫలితాలు వెంటనే రావని, నిరంతర పర్యవేక్షణతో ఆర్థిక అసమానతలు తగ్గుతాయని, ఇంతకు మించిన పథకం లేదని సీఎం అభిప్రాయపడ్డారు.

Tags:    

Similar News