త్వరలో ఏపీ మంత్రివర్గ పునర్‌వ్యవస్ధీకరణ

క్యాబినేట్‌ నుంచి జూనియర్లకు ఉద్వాసన, సీనియర్లకు చోటు;

Update: 2025-07-23 08:34 GMT
  • అనిత నుంచి హోంశాఖ తప్పించాలనే యోచనలో చంద్రబాబు
  • నాగబాబు, రఘురామలకు బెర్తులు కన్ఫర్మ్‌
  • సీనియర్ల కోటాలో కళా వెంకటరావు, సోమిరెడ్డిలకు మంత్రి పదవులు
  • డిప్యూటీ స్పీకర్‌ గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి

ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గ పునర్‌వ్యవస్ధీకరణకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిద్దమవుతున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది కాలం పూర్తయిన సందర్భంలో మంత్రుల పనితీరు ఆదారంగా మంత్రివర్గ పునర్‌వ్యవస్ధీకరణ చేయలని సీయం చంద్రబాబు కసరత్తు ప్రారంభించారు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడి క్యాబినేట్‌ లో మొత్తం 24 మంది మంత్రులు ఉన్నారు. వీరిలో చాలా మంది మంత్రుల వ్యవహార సరళి, పనితీరులపై ముఖ్యమంత్రి చంద్రబాబు అనేక సందర్భాల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అయినప్పటికీ పనితీరు మార్చుకోని మంత్రులకు ఉద్వాసన చెప్పాలని చంద్రబాబు భావిస్తున్నారు. ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌.జగన్మోహనరెడ్డి ఇటీవల కాలంలో దూకుడు పెంచారు. పలు సమస్యలను టేకప్‌ చేసి తరచు ప్రజల్లోకి వెళుతున్నారు. అలాగే ఫ్రీక్వెంట్‌ గా విలేకరుల సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆ సందర్భాల్లో వైఎస్‌.జగన్‌ లేవనెత్తుతున్న అంశాలపై మంత్రులు చాలా మంది కౌంటర్‌ ఇవ్వడానికి ముందుకు రావడం లేదనేది కొందరు మంత్రులపై చంద్రబాబు ప్రధాన ఆరోపణ.

ఈ విషయంలో చంద్రబాబు చాలా అసహనంతో ఉన్నట్లు సమాచారం. మొన్నీ మధ్య నెల్లూరులో వైసీపీ మాజీ శాసనసభ్యుడు ప్రశన్నకుమార్‌ రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిల మధ్య వివాదం చెలరేగిన సందర్భంలో ఆశించిన స్ధాయిలో మంత్రులు రియాక్ట్‌ అవ్వలేదని క్రితం సారి జరిగిన మంత్రివర్గ సమావేశంలో మంత్రులపై సీయం చంద్రబాబు మండిపడ్డారు. అలాగే వివిధ శాఖలకు సంబంధించి విపక్ష వైసీపీ నేతలు లేవనెత్తుతున్న అంశాలకు కూడా ఆయా శాఖలకు చెందిన మంత్రులు సరైన కౌంటర్‌ సమాధానాలు ఇవ్వలేకపోతున్నారనే అభిప్రాయంలో చంద్రబాబు ఉన్నారు. పైపెచ్చు చాలా మంది మొదటి సారి ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా చేస్తున్నవారు అవటం వల్ల అనుభవ లేమితో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆరు నుంచి ఎనిమిది మంది మంత్రులకు ఉద్వాసన పలికి సీనియర్లకు మంత్రివర్గంలో చోటివ్వాలనే ఆలోచనతో చంద్రబాబు ఉన్నట్లు సమాచారం.

మంత్రివర్గ పునర్‌వ్యవస్ధీకరణపై ఇప్పటికే అధికారవర్గాల్లో అనేక రకాల ప్రచారాలు నడుస్తున్నాయి. మంత్రివర్గ పునర్‌వ్యవస్ధీకరణ ఆగస్టు 6వ తేదీన ఉంటుందని టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంటే, వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి అరెస్ట్‌ తరువాత సెప్టెంబర్‌ మాసంలో మంత్రివర్గ పునర్‌వ్యవస్ధీకరణ ఉంటుందని మరో వాదన ప్రచారంలో ఉంది. ప్రస్తుతం చంద్రబాబు క్యాబినేట్‌లో ఉన్న కొలుసు పార్థసారధి, మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, వాసంశెట్టి సుభాష్‌, కొండపల్లి శ్రీనివాస్‌, సంధ్యారాణి, సవితల పేర్లు మంత్రి పదవుల నుంచి తొలగించే వారి జాబితాలో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఒకవేళ ఎనిమిది మంది మంత్రులను కనుక క్యాబినేట్‌ నుంచి తప్పించదలిస్తే కింజారపు అచ్చెన్నాయుడు, ఆనం రామనారాయణరెడ్డిల పేర్లు కూడా ఉద్వాసన జాబితో చేరుస్తారని ప్రచారం అవుతోంది. అలాగే వంగలపూడి అనిత నుంచి హోంమంత్రిత్వ శాఖను తప్పిస్తారనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది.

ఇక జనసేన విషయానికి వస్తే కందుల దుర్గేష్‌ ని తొలగించి ఆయన స్ధానంలో కొణతాల రామకృష్ణను మంత్రివర్గంలోకి తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఉన్న 24 మంత్రి పదవులకు తోడు మరో మంత్రి పదవిని భర్తీ చేసుకునే అవకాశం ఉండటంతో ఆ పదవిలో ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ సోదరుడు కొణిదెల నాగబాబును తీసుకుంటారని భావిస్తున్నారు. గతంలో స్వయానా చంద్రబాబు నాయుడు నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటామని లిఖితపూర్వకంగా ప్రకటించారు. అయితే నాగబాబుకు మంత్రిపదవి విషయలో పవన్‌ కళ్యాణే వెనకాముందూ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే జనసేన తరపున ఉన్న ముగ్గురు మంత్రుల్లో ఇద్దరు కాపు సామాజికవర్గానికి చెందిన వారు కాగా మరొకరు కమ్మసామాజికవర్గానికి చెందిన వ్యక్తి, ఇప్పుడు నాగబాబును కూడా మంత్రిమండలిలోకి తీసుకుంటే కాపులు ముగ్గురు అవ్వడంతో పాటు అందరూ ఓసీలే అవుతారు. ఇది సామాజిక సమీకరణల దృష్ట్యా పార్టీకి మంచిది కాదనే ఉద్దేశంలో పవన్‌ కళ్యాణ్‌ ఉన్నట్లు సమాచారం. దీంతో నాగబాబు బదులు కొణతాలను తీసుకునే ఆలోచనలో ఆయన ఉన్నట్లు పార్టీ వర్గాలు చెపుతున్నాయి. అయితే ఈ విషయంలో టీడీపీ మరో ప్రపోజల్‌ పెట్టినట్లు సమాచారం. పవన్‌ కళ్యాణ్‌ రాష్ట్ర రాజకీయాలను వీడి జాతీయ రాజకీయాల వైపు దృష్టి సారించి కేంద్రంలో మంత్రి పదవి తీసుకుని ఇక్కడ రాష్ర్టంలో నాగబాబుకు అవకాశం ఇవ్వాలని కొత్త థియరీ టీడీపీ వర్గాలు తెరపైకి తెస్తున్నాయి.

ప్రధానంగా వైఎస్‌.జగన్‌ అరెస్ట్‌ అయితే తదనంతరం ఉత్పన్నమయ్యే పరిణామాలను ఎదుర్కోగల సత్తా ఉన్న సీనియర్‌ నాయకులను ఈసారి మంత్రివర్గంలోకి తీసుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ కోవలో టీడీపీ సూపర్‌ సీనియర్లు, కళా వెంకటరావు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిలతో పాటు నల్లారి కిషోర్‌ కుమార్‌ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, వెంకటరాజులను క్యాబినేట్‌ లోకి తీసుకునే అవకాశం ఉంది. అలాగే ఒకవేళ క్యాబినేట్‌ లోకి రఘరామరాజును తీసుకుంటే ప్రస్తుతం ఆయన బాధ్యతలు నిర్వర్తిస్తున్న డిప్యూటీ స్పీకర్‌ పదవికి గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. రఘురామను క్యాబినేట్‌ లోకి తీసుకోకపోతే గోరంట్లను మంత్రిపదవి వరించే అవకాశం లేకపోలేదు. మొత్తం మీద వైఎస్‌.జగన్‌ దూకుడును నిలువరించడానికి మంత్రివర్గంలో జూనియర్లను సాగనంపి వారి స్ధానాల్లో సీనియర్‌ టీడీపీ శాసనసభ్యులతో భర్తీ చేయాలని చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నారు. అమరావతి రాజకీయవర్గాల్లో ప్రచారం అవుతున్నదాన్ని బట్టి ఆగస్టు 6వ తేదీ ఎట్టి పరిస్ధితుల్లో ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గ పునర్‌ వ్యవస్ధీకరణ ఉంటుందని ఆరోజు తప్పితే ఇక సెప్టెంబర్‌ మాసంలో తప్పని సరిగా ఏపీ క్యాబినేట్‌ ప్రక్షాళన జరుగుతుందని టీడీపీ వర్గాలు చెపుతున్నాయి.

Tags:    

Similar News