N. Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజిక్ మెటీరియల్స్ హబ్‌గా అభివృద్ధి చేస్తాం: సీఎం చంద్రబాబు
స్ట్రాటజిక్ మెటీరియల్స్ హబ్‌గా అభివృద్ధి చేస్తాం: సీఎం చంద్రబాబు
రూ.50 వేల కోట్ల పెట్టుబడులు, 40 వేల ఉద్యోగాల లక్ష్యంతో ఏపీ టైటానియం, స్ట్రాటజిక్ మెటీరియల్స్ మిషన్
N. Chandrababu Naidu: రాష్ట్రాన్ని ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజిక్ మెటీరియల్ హబ్‌గా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. దీని కోసం తీరప్రాంతంలో లభించే బీచ్ శాండ్ మినరల్స్‌ను సమర్థవంతంగా వినియోగించుకోవాలని, వాటికి విలువ జోడించి (వాల్యూ ఎడిషన్) పారిశ్రామికాభివృద్ధికి ఊతమివ్వాలని ఆదేశించారు. ఏపీ టైటానియం మరియు స్ట్రాటజిక్ మెటీరియల్స్ మిషన్‌ను త్వరలో రూపొందించాలని సూచించారు. ఈ మిషన్ ద్వారా వచ్చే 10 సంవత్సరాల్లో రాష్ట్రానికి రూ.50 వేల కోట్ల పెట్టుబడులు ఆకర్షించడం, సుమారు 40 వేల ఉద్యోగాలు సృష్టించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకోవాలని అధికారులకు సూచించారు.
మంగళవారం సచివాలయంలో గనుల శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించిన సీఎం చంద్రబాబు, అరుదైన ఖనిజాల విషయంలో కేంద్ర ప్రభుత్వం, ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని, వాటి నుంచి ఉత్తమ పద్ధతులను అనుసరించాలని ఆదేశించారు. భవిష్యత్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. వనరుల సద్వినియోగం కోసం అవగాహన పెంచుకోవాలని, ఖనిజాలపై ఆధారిత పరిశ్రమల అవసరాలను గుర్తించాలని తెలిపారు.
రాష్ట్రంలో లభ్యమవుతున్న బీచ్ శాండ్ మినరల్స్‌ను సమర్థవంతంగా వినియోగించేందుకు మూడు ప్రధాన ప్రాసెసింగ్ పార్క్‌లను ఏర్పాటు చేయాలని అధికారులు ప్రతిపాదించారు. శ్రీకాకుళంలో టైటానియం పార్క్ ఏర్పాటు చేసి, ఏటా 15 లక్షల టన్నుల ఉత్పత్తి లక్ష్యంగా నిర్దేశించాలని చెప్పారు. అనకాపల్లి వద్ద రేర్ ఎర్త్ కారిడార్ ఏర్పాటు చేసి, ఏటా 25 వేల టన్నుల ఉత్పత్తి చేయాలని ప్రతిపాదించారు. మచిలీపట్నం వద్ద సమగ్ర టైటానియం మరియు రేర్ ఎర్త్ కారిడార్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు వివరించారు.
తీరప్రాంతంలో శ్రీకాకుళం నుంచి మచిలీపట్నం వరకు లభించే బీచ్ శాండ్ మినరల్స్‌లో ఇల్మెనైట్, రూటైల్, జిర్కాన్, మోనజైట్, గార్నెట్, సిల్లిమనైట్ వంటి ఖనిజాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఇవి పెయింట్, కాస్మెటిక్స్, ఔషధ పరిశ్రమలు, ఏరోస్పేస్, రక్షణ రంగం, సిరామిక్స్, ఎలక్ట్రానిక్స్, అణు ఇంధనం, అణు రియాక్టర్ల తయారీ వంటి కీలక రంగాలకు అవసరమవుతాయని వివరించారు.
సమావేశంలో గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ముఖ్య కార్యదర్శి ముకేశ్‌కుమార్ మీనా, అదనపు సంచాలకులు శ్రీనివాసరావు, ఏపీఎండీసీ ఎండీ ప్రవీణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.