AP Cabinet Takes Key Decision: ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయం: మూడు కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆమోదం
మూడు కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆమోదం
AP Cabinet Takes Key Decision: ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం ఆమోద ముద్ర వేసింది. మదనపల్లె, మార్కాపురం, రంపచోడవరం కేంద్రాలుగా మూడు కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్ పచ్చజెండా ఊపింది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 26 నుంచి 28కి పెరగనుంది.
ప్రస్తుతం ఉన్న అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిని మదనపల్లె జిల్లాలో కలపనున్నారు. పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాల అభివృద్ధి, గిరిజన ప్రాంతాల పరిపాలన సౌకర్యం కోసం రంపచోడవరం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా ప్రకాశం జిల్లాలోని మార్కాపురం, చిత్తూరు పరిధిలోని మదనపల్లెను కేంద్రాలుగా చేసి కొత్త జిల్లాలు ప్రకటించారు.
అంతేకాదు, పరిపాలనను మరింత చేరువ చేయడానికి అనకాపల్లి జిల్లాలో నక్కపల్లి, ప్రకాశం జిల్లాలో అద్దంకి, మదనపల్లె జిల్లాలో పీలేరు, నంద్యాల జిల్లాలో బనగానపల్లె, శ్రీ సత్యసాయి జిల్లాలో మడకశిర వంటి ఐదు కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
ఈ మార్పులతో ప్రజలకు పరిపాలనా సేవలు మరింత సులభతరం కానున్నాయని, గిరిజన, కరువు ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు. కొత్త జిల్లాలు, డివిజన్లు త్వరలోనే అధికారిక నోటిఫికేషన్ జారీ చేసి అమల్లోకి తెచ్చే అవకాశం ఉంది.
ఈ సమావేశంలో ఇతర అంశాలపైనా చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర అభివృద్ధికి ఈ మార్పులు మైలురాయిగా నిలుస్తాయని మంత్రులు అభిప్రాయపడ్డారు.