AP Deputy Chief Minister Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ సమావేశంలో వ్యూహాత్మక చర్చలు: అసెంబ్లీ సమావేశాల ప్రారంభంతో పాటు అప్రమత్తతపై దృష్టి

అసెంబ్లీ సమావేశాల ప్రారంభంతో పాటు అప్రమత్తతపై దృష్టి

Update: 2026-02-11 11:10 GMT

AP Deputy Chief Minister Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశం బుధవారం అసెంబ్లీ కమ్యూనిటీ హాల్‌లో జరిగింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షత వహించిన ఈ సమావేశానికి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, వైసీపీ హిందూ మతాన్ని రాజకీయంగా వాడుకోవాలని చూస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు. దక్షిణ భారతదేశంలో అందరూ మతాలను గౌరవిస్తారని, అయితే వైసీపీ నేతలు హిందూ మతాన్ని రాజకీయ లాభాల కోసం దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. వైసీపీ నేతలు, ముఖ్యంగా జగన్ అండ్ కో చేసే విధ్వంసకర కుట్రలపై మూడు పార్టీల సభ్యులు పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వంపై జరుగుతున్న కుట్రలను ఎదుర్కోవడంలో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.

శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ, అసెంబ్లీలో సభ్యులు ఎంత సేపు మాట్లాడారనేది కంటే ఏం మాట్లాడారనేది ముఖ్యమని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటనలో పారిశ్రామికవేత్తలతో జరిపిన భేటీలను ఉదాహరణగా చూపారు. ఆయన ప్రతి సమావేశంలో ముందస్తు సమాచారం సేకరించి, సంస్థకు కావాల్సినవి, రాష్ట్రంలో ఉన్న వనరుల గురించి సూటిగా చర్చించి తక్కువ సమయంలో ఎక్కువ మందిని కలిశారని వివరించారు. అదే స్ఫూర్తితో అసెంబ్లీలో సభ్యులు కూడా కీలక అంశాలపై దృష్టి సారించి, సమర్థవంతంగా మాట్లాడాలని మంత్రి సూచించారు.

ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల వ్యూహం, ప్రభుత్వ ప్రాధాన్యతలు, విపక్ష కుట్రలపై అప్రమత్తత వంటి అంశాలపై చర్చ జరిగింది. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఎన్డీఏ సభ్యులు ఏకగ్రీవంగా వ్యూహాత్మకంగా ముందుకు సాగాలని నిర్ణయించారు.

Tags:    

Similar News